ఉద్యోగులకు బిగ్ షాక్ ఇవ్వనున్న అమెజాన్!
అవును... అమెజాన్ సీఈవో యాండీ జెస్సీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి లేఆఫ్ ల పర్వం కొనసాగుతూనే ఉందనే చెప్పొచ్చు.
By: Raja Ch | 15 Oct 2025 1:23 PM ISTప్రముఖ ఇ-కమర్స్ సంస్థ అమెజాన్ మరోసారి భారీ తొలగింపులకు ప్రణాళికలు వేస్తోంది. పీపుల్ ఎక్స్ పీరియన్స్ అండ్ టెక్నాలజీ (పీ.ఎక్స్.టి) బృందంగా అంతర్గతంగా పిలువబడే దాని మానవ వనరుల విభాగంలో సుమారు 15 శాతం వరకు సిబ్బందిని తగ్గించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఫార్చ్యూన్ పత్రిక వెళ్లడించిన ఈ కథనంలో.. హెచ్.ఆర్. యూనిట్ లో అత్యధికంగా లేఆఫ్ లు ఉన్నట్లు తెలుస్తోంది.
అవును... అమెజాన్ సీఈవో యాండీ జెస్సీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి లేఆఫ్ ల పర్వం కొనసాగుతూనే ఉందనే చెప్పొచ్చు. కంపెనీ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా అంటూ వేలమంది ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఇందులో భాగంగా... 2022-23లో ఏకంగా 27 వేల మంది ఉద్యోగులను ఈ సంస్థ తొలగించింది. ఈ నేపథ్యంలో తాజాగా మానవ వనరుల విభాగంలో 15 శాతం సిబ్బందిని తగ్గించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొంది.
ఉద్యోగి వద్దు.. ఏఐ ముద్దు!:
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అందిపుచ్చుకోవడంతో పాటు పాటు క్లౌడ్ కార్యకలాపాలకు అమెజాన్ ఇటీవల బిలియన్ డాలర్లు కుమ్మరిస్తుంది. ఈ క్రమంలో ఈ ఏడాది వర్కింగ్ క్యాపిటల్ పెట్టుబడుల్లో భాగంగా సుమారు 100 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేయాలని నిర్ణయించుకుంది. దానిలో ఎక్కువ భాగం నెక్స్ట్ జనరేషన్ డేటా సెంటర్ లను నిర్మించేందుకు కేటాయించింది.
మరింత క్లారిటీ రావాల్సి ఉంది!:
అయితే... ఈ భారీ లేఆఫ్ కథనాలపై స్పందించేందుకు అమెజాన్ ప్రతినిధి కెల్లీ నాంటెల్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో... ఈ లేఆఫ్ లు ఎప్పటినుంచి ఉంటాయి.. దీని ప్రభావం ఎంతమంది ఉద్యోగులపై ఉంటుంది.. హెచ్.ఆర్.తో పాటు ఇంకా ఏఏ విభాగాలపై దీని ఎఫెక్ట్ ఉంటుంది అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.
అమెజాన్ సీఈవో నోట ఏఐ మాట!:
అమెజాన్ సీఈవో యాండీ జెస్సీ రెగ్యులర్ గా... ప్రస్తుతం ఉన్నది ఏఐ శకం అని పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రతి ఉద్యోగి దీన్ని అందిపుచ్చుకోవాలని.. ఏఐ సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా కొనుగోలుదారులకు మెరుగైన సేవలు అందించేందుకు సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్పు చెప్పారు.
ఈ క్రమంలోనే ఏఐను విస్తృతం చేయడం ద్వారా ఉద్యోగులను కోల్పోవాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితి. దీంతో... 15% మంది అని చెబుతున్న వేళ.. ఎంతమంది ఉద్యోగుల జీవితాలు ఇబ్బందుల్లోకి నెట్టబడుతున్నాయో అనేది సంచలనంగా మారింది. తీవ్ర కలకలం సృష్టిస్తోంది!
సీజనల్ ఉద్యోగుల నియామకాలకు సన్నాహాలు!:
అమెజాన్ ఓ వైపు వైట్ కాలర్ కార్మికులను తొలగించడానికి సిద్ధమవుతుండగా.. మరో వైపు సీజనల్ ఉద్యోగుల నియామకాలను వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా.. పండుగ సీజన్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని యూఎస్ గిడ్డంగులు, లాజిస్టిక్స్ నెట్ వర్క్ లో సుమారు 2,50,000 మంది సీజనల్ ఉద్యోగుల నియామకానికి సంబంధించిన ప్రణాళికలను ఇటీవల ప్రకటించింది.
