Begin typing your search above and press return to search.

"సిస్టమ్ షట్‌డౌన్" అయ్యే ప్రమాదం ఉంది గురూ.. భారత ఐటీ రంగంలో భారీ ఉద్యోగ కోతలు తప్పవా?

పాపం.. కాలేజీ పూర్తి చేసుకుని "ఐటీకి వెళ్లిపోదాం" అని కలలు కనే ఫ్రెషర్ల పరిస్థితి మరీ దారుణంగా మారింది. "మీకు కోడింగ్ వచ్చా?" అని అడిగే రోజులు పోయాయి.

By:  A.N.Kumar   |   27 Oct 2026 12:03 PM IST
సిస్టమ్ షట్‌డౌన్ అయ్యే ప్రమాదం ఉంది గురూ.. భారత ఐటీ రంగంలో భారీ ఉద్యోగ కోతలు తప్పవా?
X

ఒకప్పుడు బీటెక్ పూర్తి చేసి.. నాలుగు ప్రోగ్రామింగ్ లైన్లు నేర్చుకుంటే చాలు.. గ్రీన్ సిగ్నల్ పడిపోయేది. ఐటీ కొలువు అంటే చాలు.. సమాజంలో హోదా.. చేతినిండా జీతం.. అడ్వాన్స్ పెళ్లి ప్రతిపాదనలు.. కానీ ఇప్పుడు కాలం మారింది. ఆఫీస్‌లో కాఫీ కప్పు పట్టుకుని డెస్క్ ముందర కూర్చున్న ఉద్యోగి కంటే.. 'చాట్ జీపీటీ' లాంటి ఏఐ చాట్‌బాట్‌లే ఐటీ కంపెనీల యాజమాన్యాలకు అత్యంత ప్రియమైన చిన్నారులుగా మారిపోయాయి.

లాభాలు రాకెట్ వేగం.. నియామకాలు పత్తా లేవు

కంపెనీల త్రైమాసిక లాభాల గ్రాఫ్‌లు చూస్తే ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ తీరా "కొత్త నియామకాలు ఏవి బాస్?" అని అడిగితే.. "మా దగ్గర ఏఐ ఉందిగా.. అది రోజుకు 24 గంటలు కాఫీ బ్రేక్ తీసుకోకుండా కోడింగ్ రాస్తుంది" అని మేనేజర్లు వింత నవ్వు నవ్వుతున్నారు. ఒకప్పుడు ఒక ప్రాజెక్ట్‌కి వంద మంది ఉద్యోగులు అవసరమైతే ఇప్పుడు "ఐదుగురు ఉద్యోగులతో పాటు ఒక ఏఐ టూల్" ఉంటే చాలు.. ప్రాజెక్ట్ ఫినిష్.. కంపెనీలకి ఖర్చులు తగ్గాయి.. కానీ ఉద్యోగులకు మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

మైక్రోసాఫ్ట్ ముచ్చట్లు.. మనోళ్లకు వణుకులు

అటు అమెరికాలో మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ దిగ్గజాలు 'రెస్ట్ అండ్ రిలాక్స్' పథకాలు, లేఆఫ్‌లు అని ప్రకటనలు ఇవ్వడమే ఆలస్యం.. ఇక్కడ బెంగళూరు, హైదరాబాద్‌లలో ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్ల బీపీలు ఆటోమేటిక్‌గా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ కంపెనీలు తుమ్మితే.. మన భారతీయ ఐటీ కంపెనీలకు జలుబు చేయడం పాత కథే. కానీ ఈసారి జలుబు కాదు.. ఏకంగా ఏఐ అనే ఒక పెద్ద తుఫానే వచ్చి పడింది..

ఫ్రెషర్ల పరిస్థితి.. 'ఎక్స్‌పీరియన్స్' ఉంటేనే ఎంట్రీ

పాపం.. కాలేజీ పూర్తి చేసుకుని "ఐటీకి వెళ్లిపోదాం" అని కలలు కనే ఫ్రెషర్ల పరిస్థితి మరీ దారుణంగా మారింది. "మీకు కోడింగ్ వచ్చా?" అని అడిగే రోజులు పోయాయి. "మీరు ఏఐ కంటే వేగంగా పని చేయగలరా? సమస్యలను మంత్రం వేసినట్లు పరిష్కరించగలరా?" అని ప్రసంగిస్తున్నారు. అసలు అనుభవమే లేని ఫ్రెషర్‌కి 'ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్' ఎక్కడి నుంచి వస్తుందో ఆ భగవంతుడికే తెలియాలి.

అసలు సవాలు ఏంటంటే.. స్కిల్ మార్చుకో.. లేదంటే సర్దుకో..

"ఏఐ మన ఉద్యోగాలను మింగేస్తుంది" అని భయపడటం ఒకెత్తయితే.. "మనం అప్‌డేట్ అవ్వకపోతే డస్ట్ బిన్ లో పడతాం" అనేది అసలు నిజం. ఏళ్ల తరబడి ఒకే తరహా రొటీన్ వర్క్ చేస్తూ కాలక్షేపం చేసేవారికి ఈ ఏఐ యుగం ఒక పెద్ద హెచ్చరిక.

భారత ఐటీ రంగం ఏమీ రాత్రికి రాత్రే తుడిచిపెట్టుకుపోదు. కాకపోతే ఇకపై కేవలం "ఐటీ ఉద్యోగిని" అని చెప్పుకుని తిరిగే రోజులు పోయాయి. ఏఐ ఇచ్చే కాపీ-పేస్ట్ కోడింగ్‌ను తట్టుకుని నిలబడాలంటే.. మన ఉద్యోగులు కూడా 'ఆర్టిఫిషియల్' కాకుండా 'రియల్ ఇంటెలిజెన్స్' చూపించక తప్పదు.. లేదంటే "సిస్టమ్ షట్‌డౌన్" అయ్యే ప్రమాదం ఉంది గురూ..