Begin typing your search above and press return to search.

60 వేల మంది తొలగింపు.. మైక్రోసాఫ్ట్ వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ వెనుక అసలు వ్యూహమేంటి?

ఏఐ, ఆటోమేషన్ ప్రభావంతో ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. మైక్రోసాఫ్ట్ సుమారు 60 వేల మంది ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ ఇచ్చినట్లు కథనం పేర్కొంది. భారత్‌లో 23 వేల మందికి ఈ ఆఫర్ అందినట్లు సమాచారం. మారుతున్న టెక్ పరిస్థితుల్లో కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడమే ఉద్యోగులకు కీలకమవుతోంది.

By:  A.N.Kumar   |   17 Nov 2026 11:04 PM IST
60 వేల మంది తొలగింపు..  మైక్రోసాఫ్ట్ వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ వెనుక అసలు వ్యూహమేంటి?
X

ఒకప్పుడు సాఫ్ట్ వేర్ అంటే ఆ రేంజ్ వేరు.. లక్షల్లో సంపాదన.. వీకెండ్ శని, ఆదివారాలు సెలవు.. విదేశాల్లో ఉద్యోగాలు.. పిల్లనివ్వడానికి పోటీపడే బంధువులు.. కానీ ఒక్క ఏఐ, ఆటోమేషన్.. సాఫ్ట్ వేర్ కలలను చిదిమేస్తోంది. ఇప్పుడు సాఫ్ట్ వేర్ అంటేనే భయాన్ని కలిగిస్తోంది. పిల్లనివ్వడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. ఆ కలల సౌధం ఒక్కటొక్కటిగా కూలిపోతుంటే టెకీలు ఏం చేయాలో తెలియక కొత్త దారులు లేక భిక్కచూపులు చూస్తున్న పరిస్థితి నెలకొంది.

టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. ఒకటే ఆందోళన. ఎన్నో ఏళ్లుగా తమ మేధస్సును.. శ్రమను ధారబోసి నిర్మించిన సంస్థ నుంచే సుమారు 60 వేల మంది ఉద్యోగులకు ‘వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్’ (వీఈవో) ఆఫర్ ఇవ్వడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. మైక్రోసాఫ్ట్ నుంచి ఈ ఊహించని పిలుపు రావడం ప్రతి ఐటీ ఉద్యోగి గుండెల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం కేవలం అంకెల గారడీ మాత్రమే కాదు.. వేలాది కుటుంబాల భవిష్యత్తుకు.. కలలకు సంబంధించిన ఒక భావోద్వేగపూరితమైన మలుపు.

కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల దీనిని "తొలగింపుగా చూడవద్దు.. ఇది మీ కెరీర్‌కు ఒక కొత్త దారి" అని ఎంత సున్నితంగా చెప్పినా ఏళ్ల తరబడి ఒకే సంస్థను తమ రెండో ఇల్లుగా భావించిన ఉద్యోగులకు ఆ మాటలు కొంత ఆవేదనను మిగల్చక మానవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పెను తుఫాను ఐటీ రంగాన్ని కుదిపేస్తోంది. ఒకప్పుడు పదుల సంఖ్యలో మనుషులు కలిసి చేసిన పనులను.. నేడు ఏఐ చిటికెలో పూర్తి చేస్తోంది. ఈ మారుతున్న కాలానికి తగ్గట్టుగా మైక్రోసాఫ్ట్ తన పనితీరును.. టీమ్‌ల నిర్మాణాన్ని పూర్తిగా మార్చుకునే పనిలో పడింది.

భారత్‌లోని సుమారు 23 వేల మంది ఉద్యోగులతో పాటు అమెరికా, బ్రిటన్, కెనడాలోని సిబ్బందికి డిసెంబర్ 1 వరకు గడువు ఇస్తూ సంస్థ ఈ ఆఫర్‌ను ముందుంచింది. "మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోండి.. ఆర్థిక భరోసాతో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోండి" అని సంస్థ చెబుతున్నప్పటికీ ఆ నిర్ణయం తీసుకోవడం ఏ ఉద్యోగికైనా కత్తి మీద సాములాంటిదే. ఎందుకంటే ఇది కేవలం ఉద్యోగం మారడం కాదు.. ఒక అలవాటైన జీవితాన్ని.. ఆత్మీయ బంధాలను వదులుకుని కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టడం...

ఈ పరిణామం యావత్ ఐటీ రంగానికి ఒక బలమైన మేలుకొలుపు. ఒకప్పుడు భారీ సంఖ్యలో ఉద్యోగులు ఉండటం కంపెనీల బలంగా ఉండేది.. కానీ నేడు నైపుణ్యం.. ఏఐ వినియోగం మాత్రమే మనుగడకు ప్రాణవాయువుగా మారాయి. మైక్రోసాఫ్ట్ వేసిన ఈ అడుగు ప్రతి టెక్ ఉద్యోగికి ఒక కఠినమైన వాస్తవాన్ని గుర్తుచేస్తోంది.. ఇకపై ఏ ఉద్యోగమూ శాశ్వతం కాదు.. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకునే తత్వమే మనల్ని కాపాడుతుంది. ఈ అనిశ్చితి నీడలో ఉద్యోగులు తమ భయాన్ని వదిలి.. ఈ మార్పును ఒక సవాలుగా స్వీకరించి కొత్త శిఖరాలను అధిరోహించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి.. మీ భవిష్యత్తుకు ఒక కొత్తదారిని ఎంచుకోండి..