Begin typing your search above and press return to search.

వైద్య ఆరోగ్యశాఖ అలర్డ్... కర్ణాటకలో జికా వైరస్‌ గుర్తింపు!

కర్ణాటక రాష్ట్రం, బెంగళూరు సమీపంలో జికా వైరస్ కలకలం రేపింది. తాజాగా ఒకరికి ఈ వైరస్ సోకిందని, రిపోర్ట్ పాజిటివ్‌ గా తేలిందని వైద్యులు ధ్రువీకరించారు.

By:  Tupaki Desk   |   2 Nov 2023 3:03 PM GMT
వైద్య ఆరోగ్యశాఖ అలర్డ్... కర్ణాటకలో జికా వైరస్‌  గుర్తింపు!
X

వాతావరణంలో వస్తున్న మార్పులతో ఒక పక్క ఇన్‌ ఫ్లూయెంజా వైరస్ తన ప్రభావాన్ని చూపిస్తుంటే... మరో వైపు జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. దీంతో ఇది వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి పెట్టింది. జికా వైరస్‌ కు ఏడెస్‌ దోమ వాహకంగా పనిచేస్తుంది. తొలిసారి ఈ వైరస్‌ ను 1947లో ఆఫ్రికా ఖండంలో గుర్తించారు. ఇప్పుడు బెంగళూరు సమీపంలో తాజాగా దర్శనమిచ్చింది.

అవును... కర్ణాటక రాష్ట్రం, బెంగళూరు సమీపంలో జికా వైరస్ కలకలం రేపింది. తాజాగా ఒకరికి ఈ వైరస్ సోకిందని, రిపోర్ట్ పాజిటివ్‌ గా తేలిందని వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయాలను చిక్కబళ్లాపూర్ పరిధిలోని ఒక దోమలో ఈ వైరస్‌ బయటపడినట్లు ఇప్పటికే వైద్యులు తెలిపారు. దీంతో ఈ ప్రాంత పరిధిలోని ఐదు కిలోమీటర్ల మేర వైద్య ఆరోగ్యశాఖ అలర్డ్ జారీ చేసింది. ఇందులో భాగంగా... అనుమానాస్పద జ్వరం కేసులను పరీక్షలకు పంపాలని ఆదేశించింది.

గతకొన్ని రోజులుగా రాష్ట్రంలో తీవ్ర జ్వరాలు ప్రభలుతున్నాయి. మరోవైపు జికా వైరస్ గురించిన చర్చ జరుగుతుంది! దీంతో... రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వారిలో సుమారు వంద మంది నుంచి శాంపిళ్లను సేకరించారు. వీటిని పరీక్షించడంతో ఈ వందమందిలో ఒకరికి జికా పాజిటివ్‌ చూపించింది. దీంతో... ఈ వ్యాధి సోకిన వ్యక్తి నివాస ప్రాంతం చిక్కబళ్లాపుర్‌ కావడంతో వైద్యవర్గాలు అప్రమత్తమయ్యాయి.

ఇదే సమయంలో... చిక్కబళ్లాపుర్‌ లోని దోమలను సేకరించి పరీక్షకు పంపగా.. వాటిలో ఈ జికా వైరస్‌ ఉన్నట్లు తేలిందని చెబుతున్నారు. దీంతో రాష్ట్ర వైద్యాధికారులు ప్రభావిత ప్రాంతాల్లో హెచ్చరిక జారీ చేశారు. వాస్తవానికి గతేడాదే కర్ణాటకలో తొలి జికా కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... రాయచూర్‌ జిల్లాలో ఐదేళ్ల చిన్నారికి జికా వైరస్ సోకినట్లు గుర్తించారు.

కాగా... ఏడెస్‌ దోమ జికా వైరస్‌ కు వాహకంగా పనిచేస్తుందనేది తెలిసిన విషయమే. ఈ క్రమంలో దీన్ని తొలిసారి 1947లో ఆఫ్రికా ఖండంలోని యుగాండలో గుర్తించారు! జ్వరం, తలనొప్పి, దద్దుర్లు, కళ్లు ఎర్రగా మారడం, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పి దీని లక్షణాలు అని వైద్యులు చెబుతున్నారు. ఇదే సమయంలో... మహిళలు గర్భధారణ సమయంలో ఈ వైరస్‌ బారిన పడితే... పుట్టబోయే పిల్లలు అవలక్షణాలతో పుట్టే ప్రమాదముందని చెబుతున్నారు!

ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో జికా వైరస్ కేసు తెరపైకి రావడంతో ఆందోళన నెలకొంది. ఈ వార్త స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.