Begin typing your search above and press return to search.

క్యాన్సర్‌ కేసులపై బాంబుపేల్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ!

క్యాన్సర్‌ కేసుల ప్రభావం జనాభా పెరుగుదల, వృద్ధాప్యంపైనా పడుతుందని హెచ్చరించింది

By:  Tupaki Desk   |   2 Feb 2024 9:15 AM GMT
క్యాన్సర్‌ కేసులపై బాంబుపేల్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ!
X

ప్రపంచవ్యాప్తంగా ప్రజల ప్రాణాలను అత్యధికంగా తీస్తున్న వాటిలో క్యాన్సర్‌ ఒకటి. ఆ దేశం, ఈ దేశం అనే తేడా లేకుండా ఎక్కువ మంది ప్రజలు క్యాన్సర్‌ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. గుండెపోటు తర్వాత అత్యధిక మరణాలు క్యాన్సర్‌ వే కావడం గమనార్హం. మహిళలు గర్భాశయ (సర్వైకల్‌) క్యాన్సర్, రొమ్ము (బ్రెస్ట్‌) క్యాన్సర్‌ బారిన పడుతుండగా పురుషులు ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్‌ కేసుల పెరుగుదలపై ప్రపంచ ఆరోగ్య సంస్థకి చెందిన ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ క్యాన్సర్‌ (ఐఏఆర్‌సీ) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

2022 నాటికి ప్రపంచంలో 20 మిలియన్ల క్యాన్సర్‌ కేసులు నమోదు కాగా.. 2050 ఏళ్లనాటికి కొత్తగా మరో 35 మిలియన్ల మందికి ఈ మహమ్మారి సోకే ప్రమాదముందని బాంబుపేల్చింది. ఈ మేరకు తమ పరిశోధనలో ఈ విషయం వెల్లడైనట్లు తెలిపింది.

2022తో పోల్చితే 2050 నాటికి 77 శాతం కొత్త క్యాన్సర్‌ కేసులు నమోదవుతాయని హెచ్చరించింది. క్యాన్సర్‌ కేసులు పెరగడానికి పొగాకు, మద్యం, ఊబకాయం, వాయుకాలుష్యమే ప్రధాన కారణాలుగా ఉంటాయని తెలిపింది.

క్యాన్సర్‌ కేసుల ప్రభావం జనాభా పెరుగుదల, వృద్ధాప్యంపైనా పడుతుందని హెచ్చరించింది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో మరింత ప్రభావం ఉంటుందని షాకింగ్‌ విషయం వెల్లడించింది. అభివృద్ధి చెందిన దేశాల్లో 2022 లెక్కలతో పోలిస్తే.. అదనంగా 4.8 మిలియన్ల కేసులు నమోదయ్యే ప్రమాదముందని బాంబుపేల్చింది.

ఇక మానవాభివాభివృద్ధి సూచిక తక్కువ ఉన్న దేశాల్లోనూ, ఈ సూచిక మధ్యస్థంగా ఉన్న దేశాల్లో 99 శాతం కేసుల పెరుగుదల ఉంటుందని తెలిపింది. ఈ దేశాలలో 2050 నాటికి రెట్టింపు మరణాలు సంభవిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.