Begin typing your search above and press return to search.

నేడు వరల్డ్‌ బ్రెయిన్‌ స్ట్రోక్‌ డే... తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

సాధారణంగా స్ట్రోక్ వచ్చిందని అంటే... హార్ట్ అటాక్ అని రెగ్యులర్ గా అనుకుంటారు.

By:  Tupaki Desk   |   29 Oct 2023 2:31 PM GMT
నేడు వరల్డ్‌ బ్రెయిన్‌ స్ట్రోక్‌ డే... తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!
X

సాధారణంగా స్ట్రోక్ వచ్చిందని అంటే... హార్ట్ అటాక్ అని రెగ్యులర్ గా అనుకుంటారు. ఈ విషయంలో చాలా మందికి చాలా జాగ్రత్తలే తెలుసు.. పైగా హార్ట్ స్ట్రోక్ ల గురించి నిత్యం చర్చ జరుగుతుంటుంది. కానీ... అదే స్థాయిలో బ్రెయిన్ స్ట్రోక్ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కారణం... ఈ స్ట్రోక్ గురించి ప్రజల్లో అవగాహన సాధారణంగా తక్కువగా ఉంటుంది! ఈ సమయంలో ఈ స్ట్రోక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్యుల సూచనలు మొదలైన విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.!

వాస్తవానికి వ్యాది ఎంత పెద్దదైనా.. చిన్నదైనా.. దానికి సంబంధించిన లక్షణాలు ముందుగానే పసిగడితే.. ఆ వ్యాదివల్ల జరిగే నష్టాన్ని వీలైనంత ఎక్కువగా నివారించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. దీనినే గోల్డెన్‌ పీరియడ్‌ అంటారు. ఇందులో భాగంగా అత్యంత ప్రమాదకరమైన బ్రెయిన్‌ స్ట్రోక్‌ కు సంబంధించి కూడా ముందుగా కనిపించే లక్షణాలను బట్టి డాక్టర్లను సంప్రదిస్తే ప్రమాదం నుంచి బయటపడవచ్చని వైద్యులు చెబుతున్నారు.

సాధారణంగా శరీరంలో అన్ని భాగాల్లోనూ రక్త సరఫరా సంపూర్ణంగా జరగాలి. దీనికి ఆహార అలవాట్లతోపాటు.. వ్యామామం కూడా ముఖ్యమని చెబుతారు. అలా జరిగితేనే ఆరోగ్యంగా ఉంటారు. ఈ క్రమంలో... శరీరంలో ఏ భాగానికైనా రక్త ప్రసరన సక్రమంగా జరగకపోతే ఆ భాగం అచేతనంగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో మెదడుకు ఆ స్థితి ఎదురైతే మరణం సంభవిస్తుంది. దీనినే వైద్య పరిభాషలో బ్రెయిన్‌ స్ట్రోక్‌ అని అంటారు.

ఒకప్పుడు స్ట్రోక్‌ అనేది 40 ఏళ్ల నంచి 60 ఏళ్ల వయస్సు వారిలో ఎక్కువగా కనిపించేదని వైద్యులు చెబుతున్నారు. అయితే... ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికైనా ఈ స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఇటీవల కాలంలో చిన్న వయస్సు వారిలోనూ ఈ సమస్యను గుర్తిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

అయితే... మారుతున్న ఆహారపు అలవాట్లు, ఫిజికల్ ఎక్సర్ సైజ్ లేకపోవడంతోపాటు... రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయమైన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి, వంశ పారంపర్యంగా పక్షవాతం వచ్చే వారికి, భారీ శరీరం కలవారితోపాటు మద్యపానం, ధూమపానం చేసే వారికి ఈ స్ట్రోక్‌ ముప్పు ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

వైద్యుల సలహాలు:

బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడకుండా ఉండాలంటే ప్రధానంగా అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ లేకుండా చూసుకోవాలని.. మద్యంపానం, దూమపానాలను పూర్తిగా వదిలివేయాలి. ఇదే సమయంలో విపరీతమైన ఒత్తిడికి గురికాకుండా చూసుకోవడంతోపాటు.. రోజూ కనీసం అర్ధగంటపాటు నడక కానీ, వ్యాయామం కానీ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇక ఆహారపు అలవాట్ల విషయానికొస్తే... ఫైబర్‌ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు, చేపలు, తృణధాన్యాలు ఆహారంగా తీసుకోవాలి. ఇదే సమయంలో ఉప్పు తినడం వీలైనంతవరకూ తగ్గించాలి. అదేవిధంగా... తిన్న వెంటనే పడుకోవడం అనే అలవాటును మానుకోవడం కూడా శ్రేయస్కరం అని వైద్యులు సూచిస్తున్నారు.