Begin typing your search above and press return to search.

సర్వైకల్ క్యాన్సర్ బారిన ఎందుకు పడతారు? కారణమేంటి?

కేవలం 32 ఏళ్ల చిరుప్రాయంలోనే గర్భాశయ క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వేళ.. ఈ జబ్బు గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది.

By:  Tupaki Desk   |   3 Feb 2024 12:30 PM GMT
సర్వైకల్ క్యాన్సర్ బారిన ఎందుకు పడతారు? కారణమేంటి?
X

తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో భాగంగా సర్వైకల్ క్యాన్సర్ ప్రస్తావన తీసుకొచ్చి.. దానికి అడ్డుకట్ట వేసేందుకు టీకా ప్రోగ్రాం గురించి చెప్పటం తెలిసిందే. ఇది జరిగిన తర్వాతి రోజే (శుక్రవారం) ప్రముఖ మోడల్ కం నటి పూనమ్ పాండే దీని బారిన పడి ఆకస్మిక మరణానికి గురి కావటం అందరిని షాక్ కు గురి చేసింది. నిత్యం నవ్వుతూ తుళ్లుతూ కనిపించే ఆమె మెరుపుల వెనుక ఇంతటి చేదు నిజం ఉందా? అని షాక్ తిన్నారు. కేవలం 32 ఏళ్ల చిరుప్రాయంలోనే గర్భాశయ క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వేళ.. ఈ జబ్బు గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది. అయితే.. ఇప్పటికే దీని ప్రభావం దేశంలో ఎంతో ఎక్కువైంది.

ఒక అంచనా ప్రకారం మన దేశంలో ప్రతి ఏడాది దాదాపు 80 వేల మంది ఈ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. 35 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంత జరుగుతున్నా ఒక శాతం మంది మహిళలు మాత్రమే గర్భాశయ క్యాన్సర్ పరీక్షల్ని చేసుకుంటూ ఉండటం గమనార్హం. దీనిపై అవగాహన లేకపోవటం.. దీనికి సంబంధించిన టీకా మూడు డోసులు వేయిస్తూ ఈ ముప్పు నుంచి తప్పించుకునే వీలున్నా.. దానికి సంబంధించిన అవగాహన లేకపోవటంతో దీని బారిన పడే వారి సంఖ్య.. ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుందని చెప్పాలి.

ఇంతకూ గర్భాశయ క్యాన్సర్ అంటే ఏమిటి? అదెందుకువస్తుంది? దాని లక్షణాలేంటి? దాని నివారణకు మార్గాలేంటి? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే వచ్చే సమాధానాలు ఇవే. గర్భాశయ క్యాన్సర్ అనేది హ్యూమన్ పాపిలోమా వైరస్ ద్వారా సోకుతుంది. లైంగిక సంపర్కం ద్వారా సంక్రమించే ఒక సాధారణ వైరస్. ఒకసారి ఈ వైరస్ శరీరంలోకి వెళ్లిన తర్వాత క్యాన్సర్ గా డెవలప్ కావటానికి 15-20 ఏళ్ల సమయం తీసుకుంటుంది. ఒకవేళ రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారికైతే ఐదేళ్ల నుంచి పదేళ్ల మధ్యలోనే క్యాన్సర్ కణాలు డెవలప్ అవుతాయి.

ఎక్కువమందితో లైంగిక చర్యల్లో పాల్గొనటం.. గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వినియోగించటం.. వ్యక్తిగత శుభ్రత లేకపోవటం ద్వారా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది. ఇంతకూ దీని బారిన పడినట్లుగా ఎలా తెలుస్తుంది? ఏ లక్షణాలు వార్నింగ్ బెల్స్ మోగిస్తాయన్న విషయంలోకి వెళితే.. గర్భాశయ క్యాన్సర్ వచ్చిన వారికి నెలసరి సమయంలో అధిక రక్తస్రావం జరుగుతుంది. పొత్తి కడుపులో నొప్పి.. తరచూ కడుపు ఉబ్బరం.. పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావటం.. మూత్ర విసర్జన సమయంలో మంట.. నొప్పి లాంటి ఇబ్బందులు ఉంటాయి.

సెక్సులో పాల్గొన్న సమయంలోనూ.. ఆ తర్వాత యోని దగ్గర నొప్పి.. మంట ఉంటుంది. మోనోపాజ్ తర్వాత సెక్సులో పాల్గొంటే సంభోగం తర్వాత రక్తస్రావం అవుతుంది. దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్ అవుతుంది. అలసట.. నీరసం.. బరువు తగ్గటం.. రక్తహీనత లాంటి లక్షణాలు కనిపిస్తాయి. హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి గా పేరున్న ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రికి రోజుకు 300-400 మంది సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు చేస్తుంటే అందులో రెండు మూడు కేసులు బయటపడుతున్న పరిస్థితి. ఒక అంచనా ప్రకారం ప్రతి ఏటా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25వేలకు పైగా గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్న పరిస్థితి. ఏటా నమోదవుతున్న కొత్త క్యాన్సర్ కేసుల్లో 13 శాతం సర్వైకల్ క్యాన్సర్ వే కావటం గమనార్హం.

ఇదిలా ఉంటే మహిళల్ని ఎక్కువగా ఇబ్బందులకు గురి చేసే రొమ్ము.. గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ల విషయానికి వస్తే పట్టణ ప్రాంతాల్లో రొమ్ము క్యాన్సర్ కు చెందిన కేసులు ఎక్కువగా నమోదు అవుతుంటే.. గ్రామీణ ప్రాంతాల్లో సర్వైకల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. సర్వైకల్ క్యాన్సర్ కేసుల్ని పాప్ స్మియర్ టెస్టు ద్వారా ముందే గుర్తించే వీలుంది.

ఇలా ముందుగా గుర్తించటం ద్వారా మరణ ముప్పును తగ్గించే వీలుంది. శరీరంలో నొప్పి లేని గడ్డలు ఏం కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదని.. వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకర జీవనశైలితో పాటు.. నిత్యం వ్యాయామం చేయటం అవసరమని సూచన చేస్తున్నారు. 9 - 26 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలకు ఈ వైరస్ సోకకుండా వ్యాక్సిన్ వేస్తారు. పాప్ స్మియర్ పరీక్ష ద్వారా ముందుగా ప్రీక్యాన్సర్ దశలోనే చిన్నపాటి చికిత్సతో నిర్మూలించే వీలుంది. 29-45 ఏళ్ల మద్య వయసున్న మహిళలు ప్రతి రెండు మూడేళ్లకు ఒకసారి.. 50-60 ఏళ్ల వారు ఐదేళ్లకు ఒకసారి స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాలి. గర్భాశయ క్యాన్సర్ నివారణకు సీరం ఇన్ స్టిట్యూట్ స్వదేశీయంగా సర్వావ్యాక్ అనే వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చారు. దీని ఒక్కో డోసు రూ.2వేల వరకు ఉంటుంది. ఇతర కంపెనీల వ్యాక్సిన్లు ఉన్నాయి. తాజా బడ్జెట్ లో వ్యాక్సిన్ ధరల తగ్గింపుపై ప్రకటన చేసిన నేపథ్యంలో రానున్న రోజుల్లో రూ.250- రూ.300 డోసు వచ్చే వీలుందని చెబుతున్నారు.