Begin typing your search above and press return to search.

ప్రపంచానికి డబ్ల్యూహెచ్ వో వార్నింగ్

ఆ ప్రజల విషయంలో బాధ్యతగా లేకున్నా.. తమ అధికారానికి ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

By:  Tupaki Desk   |   23 Jan 2024 4:52 AM GMT
ప్రపంచానికి డబ్ల్యూహెచ్ వో వార్నింగ్
X

ప్రజల చేత.. ప్రజల కొరకు.. ప్రజల కోసమే ఏర్పాటయ్యే ప్రజాస్వామ్య దేశాలే కాదు.. ప్రజలతో సంబంధం లేకుండా ఏర్పాటయ్యే ప్రభుత్వాలు.. రాజ కుటుంబాల ఏలుబడిలోనూ.. నియంతల అధీనంలో ఉండే దేశాల సమాహారం ప్రపంచం. నాగరిక ప్రపంచంలో ఇన్ని వైరుధ్యాలేమిటన్న సందేహాన్ని పక్కన పెడితే.. ఈ ఇంటర్నెట్ రోజుల్లోనూ ఇలాంటి బతుకుల్ని బతికే దేశాల ప్రజల్ని చూసినప్పుడు మాత్రం అయ్యో అనిపిస్తుంది. ప్రజల సంగతిని పక్కన పెడితే.. ఆయా దేశాల పాలకులు తమ పవర్ చూపించేది ప్రజల మీదనే.

ఆ ప్రజల విషయంలో బాధ్యతగా లేకున్నా.. తమ అధికారానికి ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ.. అలాంటిదేమీ ప్రపంచ దేశాలకు లేదన్న విషయం తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లయూహెచ్ వో) ఇచ్చిన వార్నింగ్ చూస్తే అర్థమవుతుంది. ఈ హెచ్చరికను చూస్తే.. ప్రజాస్వామ్య దేశాలుగా చెప్పుకునేవి కూడా ఇగోను ప్రదర్శించటం.. అనాసక్తితో వ్యవహరించటం విస్మయానికి గురి చేస్తుంది.

కరోనా మహమ్మారి దారుణ అనుభవం తర్వాత.. ఫ్యూచర్ లో ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు బోలెడన్ని. అందుకే.. అలాంటి పరిస్థితులు మరోసారి ఎదురైతే ప్రపంచం మొత్తం ఏకం కావాల్సిన అవసరాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన చేసింది. భవిష్యత్తు మహమ్మారులపై సంసిద్ధతకు సంబంధించి ఒప్పందాన్ని కుదుర్చుకోవటానికి ప్రపంచ దేశాలు నడుం బిగించాలని కోరింది. ఇందుకు డెడ్ లైన్ పెట్టింది.

కానీ.. దాన్ని పట్టించుకునే విషయంలో ప్రపంచ దేశాలు పెద్ద ఆసక్తి చూపించకపోవటం గమనార్హం. ఇంతకూ ఈ ఒప్పందంతో కలిగే ప్రయోజనం.. మహమ్మారులను నిర్మూలించటం.. వాటిపై పోరుకు సంసిద్ధంగా ఉండటం.. మహమ్మారులు చెలరేగిపోయే వేళలో.. త్వరగా ప్రతిస్పించటం ఎలా? అన్న దానిపై చర్చ జరిగింది. దీనికి సమాధానంగా ఒక ఒప్పందం చేసుకోవాలని 2021లో నిర్వహించిన డబ్ల్యూహెచ్ వో సభ్య దేశాలు నిర్ణయించాయి.

అందులోని నిర్ణయం ప్రకారం ఈ ఏడాది మే 27న నిర్వహించే వరల్డ్ హెల్త్ అసెంబ్లీ వార్షిక సమావేశం లోపు ఈ ఒప్పందంలోకి సభ్య దేశాలు రావాల్సి ఉంటుంది. షాకింగ్ నిజం ఏమంటే.. సభ్య దేశాలు ఈ ఒప్పందం చేసుకోవటానికి ఆసక్తిని చూపకపోవటం. దీనిపై తాజాగా స్పందించిన డబ్ల్యూహెచ్ వో.. సమయం తక్కువగా ఉందని.. ప్రపంచ దేశాలు అనుకున్నట్లుగా స్పందించటం లేదని.. ఒప్పందం చేసుకోవటం లేదని.. డీల్ చేసుకోవటంలో ఫెయిల్ అయితే ఒక అవకాశాన్ని కోల్పోయినట్లేనని చెబుతోంది. అంతేకాదు.. భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించకపోవచ్చని పేర్కొంది. ఒప్పందం చేసుకోవటానికి ధైర్యం కావాలని.. రాజీ పడాలన్నారు సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్. ఇంత కీలకమైన అంశంపై ప్రపంచ దేశాలు ఎందుకంత లైట్ తీసుకుంటున్నాయన్నది ఇప్పుడు చర్చగా మారింది. కొన్ని దేశాలు ఇగోకు పోతే.. మరికొన్ని దేశాలకు దాని ప్రాధాన్యత తెలీకపోవటం.. ఇంకొన్ని దేశాలకు ఈ అంశం ఒక ప్రయారిటీ కాకపోవటమే కారణంగా చెబుతున్నారు. డబ్ల్యూహెచ్ వో వార్నింగ్ తర్వాత అయినా ప్రపంచ దేశాలు మేలుకొంటాయా? అన్నది అసలు ప్రశ్న.