షాకిచ్చే రిపోర్టు: కరోనాతో మనిషి ఆయుష్షు ఎంత తగ్గిందంటే?
కరోనా అలియాస్ కొవిడ్. పేరు విన్నంతనే ప్రతి మనిషి జీవితంలోనూ ఎన్నో అనుభవాలు.. అనుభూతులు. మంచి కంటే చెడ్డవే ఎక్కువగా ఉండిపోయిన పాడు కాలం.
By: Tupaki Desk | 17 May 2025 9:30 AM ISTకరోనా అలియాస్ కొవిడ్. పేరు విన్నంతనే ప్రతి మనిషి జీవితంలోనూ ఎన్నో అనుభవాలు.. అనుభూతులు. మంచి కంటే చెడ్డవే ఎక్కువగా ఉండిపోయిన పాడు కాలం. యావత్ ప్రపంచానికి పీడకలగా మారిన ఈ కొవిడ్ కాలానికి సంబంధించిన ఒక షాకింగ్ రిపోర్టు వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తయారు చేసిన ఈ రిపోర్టు చెప్పే ముఖ్యమైన అంశం.. కరోనా కారణంగా మనిషి జీవితకాలం ఎంత తగ్గిందో లెక్క కట్టారు.
ప్రజల ప్రాణాల్ని భారీగా హరించటమే కాదు.. జీవన నాణ్యతను దారుణంగా దెబ్బ తీసిన వైనాన్ని వెల్లడించటమే కాదు.. మనిషి చరిత్రలో అతి పెద్ద పతనం లెక్కను కళ్లకు కట్టినట్లుగా వివరించింది. కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా మనిషి జీవిత సగటు కాలం 1.8 సంవత్సరాలు తగ్గినట్లుగా పేర్కొంది. కరోనా విపత్తు కారణంగా ఆందోళన.. కుంగుబాటుతో ఆరోగ్యకర సగటు జీవిత కాలం ఆరు వారాలు పడిపోయిందని..ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య రంగంలో ప్రగతి సాధించినా.. సాధించాల్సింది మరెంతో ఉందన్న విషయాన్ని అర్థమయ్యేలా చేసింది.
స్మోకింగ్.. మెరుగైన వాయు నాణ్యత.. సురక్షితమైన తాగునీరు.. పారిశుధ్య వసతులు అందుబాటులోకి రావటంతో 1.4 బిలియన్ల మంది ఆరోగ్యంగా జీవిస్తున్నారు. అత్యవసర వైద్య సేవలు వేగంగా మెరుగుపడటం లేదని.. కేవలం 431 మిలియన్ల మంది మాత్రమే ఈ సేవల్ని పొందుతున్నట్లుగా రిపోర్టు పేర్కొంది. తల్లి.. బిడ్డ మరణాలు అనుకున్నంత స్థాయిలో తగ్గలేదని తేల్చింది. 2000 నుంచి 2023 వరకు ఈ విషయంలో కొంత ప్రగతి సాధ్యమైందని.. బాలింతల మరణాలు 40 శాతం తగ్గినట్లుగా పేర్కొంది.
ఆరోగ్య రంగానికి సంబంధించిన దిద్దుబాటు చర్యలు తీసుకోకుంటే 2030 నాటికి అదనంగా 7 లక్షల మంది తల్లుల మరణాలు.. 80 లక్షలకు పైగా శిశు మరణాలు చోటు చేసుకోవటం ఖాయమని పేర్కొన్నారు. ప్రస్తుతం 70 ఏళ్ల లోపు వయసున్న వారిలో అత్యధిక మరణాలు గుండె సంబంధిత వ్యాధులు.. క్యాన్సర్.. డయాబెటిస్ కారణాలు అవుతున్నట్లుగా పేర్కొన్నారు. చైల్డ్ హుడ్ వ్యాక్సినేషన్ రేటు కొవిడ్ కు ముందున్న స్థాయికి ఇంకా చేరుకోలేదు. దీంతో చిన్నారులకు ముప్పు పొంచి ఉన్నట్లుగా రిపోర్టు వెల్లడించింది.
