Begin typing your search above and press return to search.

బరువు తగ్గించే టాబ్లెట్స్ తీసుకుంటే అంతే సంగతి!

ఏదైనా ప్రకృతి సిద్ధంగా జరగాలి.. ప్రకృతికి విరుద్ధంగా జరిగే ప్రయత్నం ఏదైనా అది తాత్కాలికంగా సక్సెస్ అయినట్లే కనిపించినా అంతిమంగా అది సాధ్యం కాదు అని అంటారు.

By:  Tupaki Desk   |   13 July 2025 10:30 AM IST
బరువు తగ్గించే టాబ్లెట్స్ తీసుకుంటే అంతే సంగతి!
X

ఏదైనా ప్రకృతి సిద్ధంగా జరగాలి.. ప్రకృతికి విరుద్ధంగా జరిగే ప్రయత్నం ఏదైనా అది తాత్కాలికంగా సక్సెస్ అయినట్లే కనిపించినా అంతిమంగా అది సాధ్యం కాదు అని అంటారు. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈ క్రమంలో వయసు తక్కువగా ఉన్నట్లు కనిపించాలనో, త్వరగా సన్నగా అయిపోవాలనో, లావుగా మారలనో చాలా మంది మందులు, ఇంజెక్షన్స్ వెంట పడుతున్నారు. కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు!

ఇటీవల కాలంలో.. బరువు తగ్గాలి అనేది ఓ ఫ్యాషన్ గా మారిపోయిందనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ‘తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలిగినవాడే మనిషోయ్’ అనే మాటల మాటున... ‘సన్నబడాలి సర్’ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దానికి కారణం మారుతున్న ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం అయ్యి ఉండొచ్చు. ఇప్పటి జీవన శైలి అలా మారిపోయింది మరి! ఈ సమయంలోనే కొత్త కొత్త మందులు ఎంట్రీ ఇస్తున్నాయి.

ఇండియాలో ఊబకాయంతో బాధపడుతున్నవారి సంఖ్య ఇటీవల పెరుగుతుందని అంటున్నారు. భారత్ లో ఉన్న జనాభాలో కేవలం 2% మందికి ఊబకాయం ఉన్నా.. అది ఓ మోస్తరు చిన్న దేశం మొత్తానికి ఉన్నట్లే లెక్క. ఈ నేపథ్యంలోనే భారత్ లో పెద్ద ఎత్తున ఊబకాయం వాళ్లకు డాక్టర్ చాలా మంది కాస్ట్లీ ఇంజెక్షన్స్ ఇస్తున్నారని.. సరికొత్త బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తూ మోసం చేస్తున్నారనే చర్చ ఇటీవల బలంగా మొదలైంది.

వాస్తవానికి బరువు తగ్గాలంటే, ఊబకాయం నుంచి బయటపడాలంటే మందులతో పనిలేకుండా పలు మార్గాలున్నాయని అంటారు. అయితే.. అందుకు సమయం లేకో, లేక.. కష్టపడటం ఇష్టంలేకో చాలా మంది షార్ట్ కట్స్ ని ఎంచుకుంటున్నారు. ఒక ఇంజెక్షన్ చేయించుకుంటే పని అయిపోతుంది కదా అని భావిస్తున్నారు. కానీ... వాళ్ల ‘పని’ అయిపోతుందనే విషయం గ్రహించలేకపోతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కారణం... అలాంటి ఇంజెక్షన్స్ వల్ల చాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెబుతున్నారు. కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడినట్లుగా పరిస్థితి మారుతుందని చెబుతున్నారు. అయినప్పటికీ అవేవీ పట్టించుకోకుండా వైద్యులు అలాంటి ఇంజెక్షన్స్ ని రిఫర్ చేయడం ఏమాత్రం సహేతుకం కాదనే మాటలు వినిపిస్తున్నాయి. పైగా... బరువు తగ్గితే షుగర్ తగ్గుతుందనే ప్రచారం, తదనుగుణంగా మోసాలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.

ఒకవేళ అదే నిజమైతే... ఓవర్ వెయిట్ ఉండి షుగర్ లేనివాళ్లు లేరా..? బక్క పలచగా ఉండి షుగర్ వ్యాధితో బాదపడుతున్నవారు కనిపించడం లేదా..? అంటే... చాలా మంది వైద్యుల నుంచి సరైన, సంతృప్తికర సమాధానం లేదని అంటున్నారు! ఏది ఏమైనా... ఇప్పుడు ఊబకాయం తగ్గించడానికి వైద్యులు రకరకాల మందులు రిఫర్ చేస్తున్నారు.. వాటికి వేలల్లో ఖర్చవుతుందని చెబ్బుతున్నారు. అవేమిటో ఇప్పుడు చూద్దామ్..!

వెగోవీ!:

డెన్మార్క్‌ కు చెందిన మల్టీ నేషనల్ ఫార్మా కంపెనీ 'నొవో నార్డిస్క్‌'.. మనదేశంలో 'వెగోవీ' అనే బ్రాండెడ్‌ ఔషధాన్ని విడుదల చేసింది. ఈ మందును ఊబకాయ చికిత్సలో వినియోగిస్తున్నారని అంటున్నారు. ఇలా మందులతో బరువు తగ్గొచ్చనే సరికి దీనికి ఎంతో ఆదరణ లభించినట్లు చెబుతున్నారు. ఈ ఔషధాన్ని 5 రకాల డోసుల్లో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నొవో నార్డిస్క్‌ ఇండియా వెల్లడించింది.

వారానికి ఒకసారి తీసుకునే ఈ మందు 0.25 ఎంజీ, 0.5 ఎంజీ, 1 ఎంజీ, 1.7 ఎంజీ, 2.4 ఎంజీ డోసుల్లో లభిస్తుంది. దీనికి ఒక నెలకు రూ.17,345- 26,050 వరకూ ఖర్చవుతుందని చెబుతున్నారు. షుగర్ వ్యాధి చికిత్సలో వినియోగించే 'ఒజెంపిక్‌' అనే బ్రాండెడ్‌ మందు కూడా ఈ సంస్థదే. అయితే... ఈ 'ఒజెంపిక్‌'ను ఇంకా భారత్ లో విడుదల చేయలేదు.

మౌంజారో!:

'మౌంజారో' అనే బ్రాండెడ్‌ మందును ఎలీ లిల్లీ అనే మరో మల్టీ నేషనల్ ఫార్మా కంపెనీ గత మార్చిలో భారత్ విడుదల చేసింది. ఈ సమయంలో... 'టిర్జెపటైడ్‌' అనే మాలిక్యూల్‌ తో కూడిన 'మౌంజారో' బ్రాండు ఔషధ అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని ఎలీ లిల్లీ స్పష్టం చేస్తోంది. అయితే... 'వెగోవీ' బ్రాండు మాత్రం 'సెమాగ్లుటైడ్‌' మాలిక్యూల్‌ తో తయారైందని.. దీన్ని వాడితే బరువు తగ్గడంతో పాటు గుండెకూ ప్రయోజనాలు ఉంటాయని కంపెనీ చెప్పుకొస్తోంది.

కాగా... భారత్ లో సుమారు 25 కోట్ల మంది ప్రజలు అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నారని అంచనా ఉంది. ఇదే సమయంలో... ప్రస్తుతం సుమారు 8 కోట్ల మంది మధుమేహం వ్యాధి బాధితులున్నారని.. వీరి సంఖ్య 2045 నాటికి 12 కోట్లకు మించుతుందని చెబుతున్నారు. దీంతో... భారత్ లో ఈ మందులకు ఎంత పెద్ద మార్కెట్‌ ఉంటుందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు.

ఏది ఏమైనా... ఊబకాయం అయినా షుగర్ అయినా ఇప్పటికే ఉన్నా.. ఇంకా రాకున్నా.. వాటిని తగ్గించుకోవడానికి, రాకుండా చూసుకోవడానికి ఇలా ఇంజెక్షన్స్ ని నమ్ముకోనే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని.. అందరి శరీరతత్వం ఒకలా ఉండదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ విషయంలోనూ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని.. వీలైతే ప్రకృతి సిద్ధంగా ప్రయత్నించాలని పలువురు సూచిస్తున్నారు.