బరువు తగ్గించే ఇంజెక్షన్.. 3 నెలల్లో రూ.24 కోట్ల బిజినెస్
బరువు తగ్గేందుకు వారానికి ఒకటి చొప్పున ఈ ఇంజెక్షన్ ను తీసుకుంటే సరిపోతుందని కంపెనీ చెబుతోంది.
By: Tupaki Desk | 8 Jun 2025 3:00 PM ISTగతంతో పోలిస్తే ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పు.. జీవనశైలి మాత్రమే కాదు.. అత్యధిక క్యాలరీలున్న ఆహారాన్ని అదే పనిగా తినేయటం.. దానికి తగ్గ శారీరక శ్రమ లేని కారణంగా పలువురు.. శరీరతత్త్వంతో మరికొందరు.. మొత్తంగా ఊబకాయం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. దీనికి పరిష్కారంగా ఎన్నో మార్గాల్ని అనుసరిస్తున్నారు. అవి సరిపోక కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ఊబకాయంతో పాటు.. మధుమేహంతో ఇబ్బంది పడేవారికి వారి బరువు సమస్యను తీర్చేందుకు అమెరికా ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ అండ్ కంపెనీ మౌంజారో బ్రాండ్ పేరుతో అమ్ముతున్న ఇంజెక్షన్ కు ఇప్పుడు క్రేజ్ పెరుగుతోంది.
బరువు తగ్గేందుకు వారానికి ఒకటి చొప్పున ఈ ఇంజెక్షన్ ను తీసుకుంటే సరిపోతుందని కంపెనీ చెబుతోంది. సింగిల్ డోస్ వయల్ రూపంలో ఇది ఉంటుందని చెబుతున్నారు. స్థూలకాయం.. అధిక బరువు.. టైప్ 2 మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ ఇంజెక్షన్ మంచిదని కంపెనీ చెబుతోంది. దీని అమ్మకాలు భారత్ లో జోరుగా సాగుతున్నాయి. మార్కెట్ లోకి తీసుకొచ్చిన మొదటి రెండు నెలలో అమ్మకాలు అంతంత మాత్రంగా ఉన్నప్పటికి మూడో నెల నుంచి అమ్మకాలు పుంజుకున్నట్లుగా కంపెనీ చెబుతోంది.
కేవలం మూడు నెలల వ్యవధిలో ఏకంగా రూ.24 కోట్ల వ్యాపారం చేయటం గమనార్హం. మూడు నెలల వ్యవధిలో రూ.23.94 కోట్ల వ్యాపారం జరగ్గా.. ఇందులో రూ.12.6 కోట్ల అమ్మకాలు కేవలం మేలో జరిగినవిగా చెబుతున్నారు. మొత్తంగా 81 వేలకు పైగా వయల్స్ అమ్మినట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వారానికి ఒక డోస్ చొప్పున.. నెలకు అవసరమైన ఈ ఇంజెక్షన్లు మన దేశంలో రూ.14వేల నుంచి రూ.17,500 వరకు ఖర్చు అవుతుందని లెక్క చెబుతున్నారు.
అయితే.. ఇదే కోర్సు అమెరికాలో అయితే దగ్గర దగ్గర రూ.85వేల వరకు అవుతుందని చెబుతుున్నారు. మన దేశంతో పెద్ద ఎత్తున విస్తరించాలని భావిస్తున్న సంస్థ.. భారత్ లో తక్కువ ధరకు దీన్ని అమ్ముతున్నట్లు చెబుతోంది. అయితే.. ఈ ధర మన ప్రజలకు భారమే అని చెబుతున్నారు. అయితే.. బరువు తగ్గాలన్న పట్టుదల ఉన్నోళ్లు దీన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇంత చెప్పింది దీన్ని వాడమని కాదు. కేవలం సమాచారం కోసమే. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ట్రెండింగ్ అంశాల్ని తెలియజేసే క్రమంలో ఈ సమాచారాన్ని ఇస్తున్నామన్నది మర్చిపోకూడదు.
ఇక్కడే వైద్య నిపుణులు చెప్పే మాటను ప్రస్తావించాలి. అలా అని ఇప్పుడు చెప్పిన ఇంజెక్షన్ మంచిది.. చెడ్డదన్న తీర్పులు కూడా ఇవ్వటం లేదు. బరువు తగ్గే విషయంలో ఆహారఅలవాట్లు.. శారీరక శ్రమతో పాటు.. సహజ సిద్ధంగా బరువు తగ్గటం చాలా మంచిది.. ఆరోగ్యకరమన్నది మర్చిపోకూడదు. సహజ పద్దతిలో తగ్గే బరువు కష్టం.. శ్రమతో కూడుకున్నది. కానీ.. దీర్ఘకాలంలో ఇది చేసే సాయం అంతా ఇంతా కాదు. బరువున్న వారు పట్టుదలతో బరువు తగ్గిన తర్వాత వారిలో తమకు తెలీకుండా తమకే ఒక క్రమశిక్షణ వస్తుందన్నది మర్చిపోకూడదు. ఇదంతా చదివిన తర్వాత.. మీకు నచ్చిన నిర్ణయాన్ని మీరు తీసుకోండి.