Begin typing your search above and press return to search.

ఆ ఊళ్లోకి ఐస్ క్రీం బండి వెళితే భారీ ఫైన్

మహానగరాలు.. నగరాలు.. పట్టణాలు.. ఒక మోస్తరు టౌన్ లోని షాపుల్లో ఐస్ క్రీం ఇట్టే దొరికేస్తాయి. కానీ.. చిన్న ఊళ్లల్లో మాత్రం ఐస్ క్రీం దొరకటం ఇప్పటికి తక్కువే.

By:  Tupaki Desk   |   20 March 2026 10:02 AM IST
ఆ ఊళ్లోకి ఐస్ క్రీం బండి వెళితే భారీ ఫైన్
X

మహానగరాలు.. నగరాలు.. పట్టణాలు.. ఒక మోస్తరు టౌన్ లోని షాపుల్లో ఐస్ క్రీం ఇట్టే దొరికేస్తాయి. కానీ.. చిన్న ఊళ్లల్లో మాత్రం ఐస్ క్రీం దొరకటం ఇప్పటికి తక్కువే. దీనికి కారణం లేకపోలేదు. ఐస్ క్రీంను అలానే ఉంచే ఫ్రీజర్లు లేకపోవటం.. ఒకవేళ ఎవరైనా సాహసించి పెట్టినా.. అందుకు తగ్గ బిజినెస్ ఉండకపోవటం మరో కారణం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మహానగరాలు.. నగరాలు.. పట్టణాల్లో మాదిరి ఐస్ క్రీం కోసం వందలకు వందల రూపాయిలు ఖర్చు చేసే పరిస్థితి చిన్న చిన్న గ్రామాల్లో ఉండదు.

అందుకే.. అలాంటి చిన్న ఊళ్లకు ఐస్ క్రీం బండ్లు వెళుతుంటాయి. గంట కొడుతూ.. ఐస్ క్రీం.. ఐస్ క్రీం అంటూ వీధుల్లో అరుస్తూ వెళ్లే బండ్లు చాలామందికి తెలిసిందే. ఈ ఐస్ క్రీం బ్రాండెడ్ కాకుండా.. ఇతర మార్గాల్లో తయారు చేసినవే ఎక్కువగా ఉంటాయి. ఈ ఐస్ క్రీం నాణ్యతకు సంబంధించి పలు సందేహాలు వస్తుంటాయి.ఇదంతా ఎందుకంటే.. ఈ తరహా ఐస్ క్రీం బండ్లను తమ గ్రామంలోకి రానివ్వమంటూ తెలుగు రాష్ట్రాల్లోని ఒక ఊళ్లోని వారు నిర్ణయం తీసుకోవటమే కాదు.. ఊరి చివరన ఏర్పాటు చేసిన బ్యానర్ ఇప్పుడు సంచనలంగా మారింది.

పోలవరం జిల్లా చింతకూరు మండలం గూడూరు గ్రామస్తులంతా కలిసి.. ఒక కమిటీగా ఏర్పడి.. తమ ఊళ్లోకి ఐస్ క్రీం బండ్లకు అనుమతి లేదని తేల్చేశారు. దీనికి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఒకవేళ.. తాము విధించిన నిషేధాన్ని కాదని ఊళ్లోకి ఐస్ క్రీం బండ్లు కాని వస్తే.. రూ.5వేలు ఫైన్ విధిస్తామని స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు.. ఇదే గ్రామంలో అంతకు ముందు ఉన్న మద్యం బెల్ట్ షాప్ ను ఊరి పెద్దలు తీయించి వేశారు.

తాజాగా ఐస్ క్రీం తయారు చేసుకొని వచ్చి.. ఊళ్లో అమ్మే వారి కారణంగా తమ ఊళ్లోని పలువురు చిన్నారులు దంత సమస్యలతో పాటు.. జీర్ణపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తించిన గ్రామస్తులు.. అంతా కలిసి తమ ఊళ్లోకి ఐస్ క్రీం బండ్ల రాకపోకల్ని నిషేధించారు.ఒకవేళ తమ నిర్ణయానికి భిన్నంగా వ్యవహరిస్తే వారికి రూ. 5వేల జరిమానాను విధిస్తామని స్పష్టం చేస్తున్న వైనం చుట్టుపక్కల గ్రామాల వారికి ఆసక్తికరంగా మారింది. ఈవ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ.. మీడియాలోనూ పలువురిని ఆకర్షిస్తోంది. పిల్లల ఆరోగ్యం కోసం గ్రామపెద్దలు వారం క్రితం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు.