Begin typing your search above and press return to search.

త‌ళా అజిత్‌కి బ్రెయిన్ స‌ర్జ‌రీ ప్ర‌చారంతో ఫ్యాన్స్‌లో టెన్ష‌న్

మెదడుకు శస్త్రచికిత్స అంటూ సాగిన‌ పుకార్లను అజిత్ ప్రచారకర్త సురేష్ చంద్ర ఒక ప్ర‌క‌ట‌న‌లో ఖండించారు. ఇది సాధారణ వైద్య‌ ప్రక్రియ అని స్పష్టం చేశారు.

By:  Tupaki Desk   |   9 March 2024 7:02 AM GMT
త‌ళా అజిత్‌కి బ్రెయిన్ స‌ర్జ‌రీ ప్ర‌చారంతో ఫ్యాన్స్‌లో టెన్ష‌న్
X

మ‌నిషి అన్నాక అనారోగ్యం పాల‌వ్వ‌డం ఆస్ప‌త్రికి వెళ్లడం స‌హ‌జం. దెబ్బ త‌గిలింద‌నో లేక గాయం నొప్పి పెడుతోంద‌నో, వాతావ‌ర‌ణ మార్పుతో శ‌రీరంలో తేడా వ‌చ్చింద‌నో డాక్ట‌రుకు పేషెంట్ నివేదిస్తాడు. అయితే దీనికి సామాన్యుడు మాన్యుడు అనే తేడా లేదు. సామాన్యుడి విష‌యంలో ఇలాంటి వాటిని అస‌లు ప‌ట్టించుకోరు కానీ.. సెల‌బ్రిటీకి ఏదైనా అయ్యింది అంటే చాలు దానికి బోలెడంత ప్ర‌చారం. ఇందులో ఫేక్ ప్ర‌చారంతోనే అస‌లు ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొంద‌రు న‌టీన‌టులు ఇంకా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతుండ‌గానే చ‌నిపోయారంటూ ప్ర‌చారం సాగిపోయిన సంద‌ర్భాలున్నాయి.

ఇప్పుడు అలాంటి ఒక విష‌ప్ర‌చారం త‌ళా అజిత్ అభిమానుల‌ను క‌ల‌వ‌ర‌పెట్టింది. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కి బ్రెయిన్ సర్జరీ జరిగిందని వెబ్ మీడియాలో పుకార్లు షికార్ చేస్తున్నాయి. అయితే తాజా స‌మాచారం మేర‌కు ఇవ‌న్నీ ఫేక్ వార్త‌లు అని తెలిసింది. అతని మెదడుకు సంబంధించిన చికిత్స‌ను చేయించుకోలేదు.

త‌మిళ మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. త‌ళా అజిత్ కుమార్ ఇటీవల తన చెవిని మెదడుకు కలిపే నరాల వాపును పరిష్కరించుకోవ‌డానికి వైద్యం చేయించుకున్నారు. దీనికోసం మొన్న‌ గురువారం నాడు ఆసుపత్రిలో చేరిన అత‌డు విజయవంతంగా చికిత్స‌ను పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్నారు.

మెదడుకు శస్త్రచికిత్స అంటూ సాగిన‌ పుకార్లను అజిత్ ప్రచారకర్త సురేష్ చంద్ర ఒక ప్ర‌క‌ట‌న‌లో ఖండించారు. ఇది సాధారణ వైద్య‌ ప్రక్రియ అని స్పష్టం చేశారు. అజిత్ శుక్రవారం రాత్రి లేదా శనివారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతారని కూడా గ‌త ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. అయితే అజిత్ డిశ్చార్జ్ అయిన‌ట్టు కొద్ది సేప‌టి క్రితం వార్త‌లు అందాయి.

అజిత్ ఆసుపత్రిలో చేరింది సాధారణ పరీక్ష కోసం మాత్ర‌మేన‌ని, ఆ సమయంలో వైద్యులు వాపును పరిష్కరించాలని నిర్ణయించుకున్నారని మేనేజ‌ర్ చంద్ర చెప్పారు. వైద్య ప్రక్రియ విజయవంతమైంది.. అజిత్ ICU నుండి తన వార్డుకు తిరిగి వెళ్ళిన తర్వాత మంచి ఆరోగ్యంతో ఉన్నాడు. బ్రెయిన్ సర్జరీపై వస్తున్న ఊహాగానాలు స‌రికాదు అని ఫేక్ వార్త‌ల‌కు తెరదించారు.

మానసిక ఒత్తిడిలో అజిత్: చంద్ర‌ అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలలో త‌ళాతో స‌న్నిహితంగా కలిసి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ మిలన్ ఆకస్మిక మరణంతో అజిత్ తీవ్రంగా ప్రభావితమయ్యారని చంద్ర విచారం వ్యక్తం చేశారు. అజర్‌బైజాన్‌లో షూటింగ్‌లో ఉండగా మిలన్ కన్నుమూశారు. ఇటీవల అతనితో మాట్లాడిన అజిత్ విషాదం గురించి తెలుసుకుని షాక్ అయ్యాడు. ఈ సంఘటన అజిత్ ఆరోగ్య పరీక్షలను మరింత సీరియస్‌గా తీసుకోవాలని ప్రేరేపించిన‌ట్టు చంద్ర తెలిపారు.

వ్య‌క్తిగ‌తంగా ఎన్ని సవాళ్లు ఉన్నా కానీ అజిత్ తన పనికి కట్టుబడి ఉన్నాడు. ప్రస్తుతం మగిజ్ తిరుమేని యాక్షన్ థ్రిల్లర్ 'విదా ముయార్చి'లో చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రంలో అర్జున్ సర్జా, త్రిష, రెజీనా కసాండ్రా, ఆరవ్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. అజిత్ తన ప్రాజెక్ట్‌ల విష‌యంలో ఎప్ప‌టిలానే అంకితభావంతో ఉన్నాడు. వ్యక్తిగత కార‌ణాలు స‌హా వృత్తిపరంగా ఫ్లాపులు ఎదురుదెబ్బల నేపథ్యంలో అతడి మాన‌సిక స్థితిపై ఒత్తిడి ఉంద‌నే విష‌యాన్ని కూడా అర్థం చేసుకోవాలి.

త‌ళా అజిత్ అభిమానులు తమ అభిమాన తార ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందుతున్నందున అతడి ఆరోగ్యంపై మరిన్ని వివరాలు వెల్ల‌డి కావాల్సి ఉంది. కొద్ది సేప‌టి కింద‌ట అందిన స‌మాచారం మేర‌కు అజిత్ సుర‌క్షితంగా త‌న ఇంటికి చేరుకున్నార‌ని కూడా తెలుస్తోంది.