AI , చాట్ GPT అధిక వాడకంపై వైద్యులు హెచ్చరిక!
ఒకప్పుడు ఏదైనా ఒక సమస్యను సాల్వ్ చేయాలి అంటే.. చాలామంది తమ సొంత ప్రతిభపైన ఆధారపడేవాళ్ళు.
By: Tupaki Desk | 4 Aug 2025 11:10 AM ISTపెరుగుతున్న టెక్నాలజీని చూసి సంతోషపడాలో.. లేక ఈ టెక్నాలజీ మోజులో పడి యువత పక్కదోవ పడుతున్నారని బాధపడాలో అర్థం కావడం లేదు. టెక్నాలజీ అనేది మనిషికి ఉపయోగకరంగా ఉండాలే కానీ.. మనిషి తెలివితేటలను కూడా లాగేసే సాధనంగా ఉండకూడదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా చాట్ GPT, AI చాట్‌బాట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వీటిపై పిల్లలు, యువత ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఫలితంగా సొంత తెలివితేటలను కోల్పోవడమే కాకుండా వారిపై మానసిక ప్రభావం కూడా ఏర్పడుతోంది.
ఒకప్పుడు ఏదైనా ఒక సమస్యను సాల్వ్ చేయాలి అంటే.. చాలామంది తమ సొంత ప్రతిభపైన ఆధారపడేవాళ్ళు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత.. దీనికి తోడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఎలాంటి ప్రశ్నకైనా ఇట్టే సమాధానం లభిస్తోంది. అందుకే తమ శక్తిని, తమ తెలివితేటలను పక్కనపెట్టి ఈ టెక్నాలజీపై ఆధారపడుతున్నారు. అయితే వీటి వాడకం ఎక్కువ అయితే పిల్లలు, యువతలో ఒంటరితనం, అభద్రతాభావం పెరుగుతుందని మానసిక వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు.
సొంతంగా తీసుకునే నిర్ణయాల విషయాల్లో కూడా ఇలా ఏఐ సహాయం తీసుకోవడం, చాట్‌బాట్‌తో భావోద్వేగాలను వ్యక్తీకరించడం వంటివి చేస్తున్నారని మానసిక వైద్యులు తెలియజేశారు. దీంతో సోషల్ స్కిల్స్ కి దూరమవుతున్నారని స్పష్టం చేశారు. అంతేకాదు పిల్లలకు తల్లిదండ్రులు టైం కేటాయించకపోవడంతో పిల్లలు ఇలా వీటిపై ఆధారపడుతున్నారు అని కూడా హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. వాస్తవానికి గజీబిజీ లైఫ్ స్టైల్ లో తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ వహించడం అనేది అత్యంత శ్రమతో కూడుకున్న పని. అటు భవిష్యత్తు తరాల కోసం సంపాదన మోజులో పడి పిల్లలను పట్టించుకోవడంలేదని.. తద్వారా పిల్లలలో మానసిక రుగ్మతలు ఏర్పడుతున్నాయని, అభద్రతాభావంగా ఫీల్ అవుతున్నారని, అందుకే ఇలాంటి టెక్నాలజీలపై పిల్లలు ఆధారపడుతున్నారు అని, ఫలితంగా పిల్లల భవిష్యత్తు అయోమయంలో పడుతోంది అంటూ కూడా వైద్యులు తెలియజేశారు.
ఇలాంటి టెక్నాలజీలు అత్యవసరాలకు ఉపయోగపడాలి కానీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యాన్ని కూడా తగ్గిస్తున్నాయి అని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ముఖ్యంగా ఇలాంటి టెక్నాలజీ పై ఆధారపడడం సరైన పద్ధతి కాదు అని కూడా చెబుతున్నారు. మరి ఇప్పటికైనా వీటి వాడకం తగ్గుతుందేమో చూడాలి.. లేకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం కూడా లేకపోలేదు అంటూ హెచ్చరిస్తున్నారు.
