Begin typing your search above and press return to search.

వీటికి దగ్గరైతే ఒత్తిడి చిత్తవుతుంది... ఏమిటివి..!

అవును... ఈ రోజుల్లు అనేకమంది ఒత్తిడి బారినపడి చిత్తవుతున్నారు. సమస్య చిన్నదైనా పెద్దదైనా వాటిని తట్టుకుని ముందుకెళ్లడంలో ఒత్తిడి మనిషిని కుంగదీసేస్తుంది.

By:  Tupaki Desk   |   17 July 2025 7:00 AM IST
వీటికి దగ్గరైతే ఒత్తిడి  చిత్తవుతుంది... ఏమిటివి..!
X

ఇటీవల కాలంలో అనేకమంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య, ఎదుటివారికి చెప్పుకున్న అర్ధం కాని సమస్య, కొన్ని సందర్భాల్లో చెప్పుకోవడం వీలుకాని సమస్య ఏదైనా ఉందంటే అది "ఒత్తిడి" అని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో దీని బారిన పడనివారి సంఖ్య అతి తక్కువ అని చెప్పినా అతిశయోక్తి కాదు. నేటి సమాజంలో దీని ప్రభావం, వ్యాప్తి అలా పెరిగిపోయాయి మరి.

అవును... ఈ రోజుల్లు అనేకమంది ఒత్తిడి బారినపడి చిత్తవుతున్నారు. సమస్య చిన్నదైనా పెద్దదైనా వాటిని తట్టుకుని ముందుకెళ్లడంలో ఒత్తిడి మనిషిని కుంగదీసేస్తుంది. ప్రధానంగా నేటి జీవనశైలిలో వస్తున్న మార్పులు, ఆహరపు అలవాట్లు దీనికి కారణం అని చెబుతున్నా.. దగ్గరవ్వాల్సిన మరికొన్నింటికి దగ్గరకాకపోవడం కూడా ఈ ఒత్తిడికి కారణం అని అంటున్నారు.

ప్రధానంగా దైనందిన జీవితంలో కొన్ని దురలవాట్లకు దూరంగా ఉండటం ఎంత ముఖ్యమో, మరికొన్నింటికి దగ్గరగా ఉండటం అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు! అవేమీ ఖర్చుతో కూడుకున్నవి కావు.. కాకపోతే కాస్త మనసుపెట్టాలి, క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి అంతే..! అవేమిటనేది ఒక్కొక్కటికీ ఇప్పుడు చూద్దామ్..!

* ఇటీవల కాలంలో చాలా మందికి లేని అలవాటు వ్యాయామం! వ్యక్తిగత, ఆఫీస్‌ పనులతో బిజీబిజీగా గడిపేస్తుండటంతో.. వ్యాయామానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేకపోతున్నారు. దీంతో.. తరచూ ఒత్తిడికి లోనవుతుంటారు. అయితే... ఒత్తిడికి శారీరక వ్యాయామం ఉత్తమ థెరపీ అనే విషయం అంతా గుర్తించుకోవాలని అంటున్నారు. రోజూ వ్యాయామంతో నిద్ర బాగా పట్టడంతో పాటు ఆత్మస్థైర్యం పెరుగుతుందని చెబుతున్నారు.

* ఇక ఇవాళ్టి రోజుల్లో అనేకమందికి ఉన్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి.. నిద్రపోయే సమయం తగ్గి.. స్క్రీన్‌ టైమ్‌ పెరగడం. దీంతో... రోజువారీ పనులతో అప్పటికే ఒత్తిడితో ఉన్నవారు తక్కువ సమయం నిద్రపోవడం వల్ల మానసిక సమస్యల భారిన పడుతున్నారని అంటున్నారు. అందువల్ల, తక్కువగా నిద్రపోయే అలవాటుకు స్వస్తి చెప్పాలి. ఈ క్రమంలో... ప్రతిరోజూ 8 గంటలు నిద్రపోయేలా ప్లాన్‌ చేసుకోవాలి.

* ఇలా వ్యాయామం చేయడం, ఎక్కువ సమయం నిద్రపోయేలా చూసుకోవడంతో పాటు తిండి విషయంలో నియంత్రణ ఉండేలా చూసుకోవడం ముఖ్యమని అంటున్నారు. ఈ సమయంలో... ప్రధానంగా ఏం తినాలో కాదు.. ఎంత తినాలో తెలిసిన వాళ్లే ఆరోగ్యమంతులవుతారని చెబుతున్నారు. ఉప్పు, కొవ్వు, చక్కెర, ఆల్కహాల్‌ తో ముడిపడిన పదార్థాలు, పానీయాల జోలికి వెళ్లకపోవడంతో పాటు.. కూరగాయలు, పండ్లను తినాలని సూచిస్తున్నారు.

* ఒత్తిడిని తగ్గించుకోవడానికి దైనందిన జీవితంలో ధ్యానానికి కాస్త సమయం కేటాయించాలని నిపుణులు చెబుతున్నారు. రోజూ కొంత సమయం ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయని చెబుతున్నారు. ఫలితంగా కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, ప్రశాంతంగా ఆలోచించగలుగడం చేస్తారని చెబుతున్నారు. దీనివల్ల రక్తపోటు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు.

* ఈ కాలంలో అనేకమందికి ఉన్న సమస్యలో సోషల్‌ మీడియా అధిక వినియోగం ఒకటి. దీనివల్ల విలువైన సమయం వృథా అవ్వడంతోపాటు రోజు రోజుకీ అది కాస్తా ఒక వ్యసనంలా మారిపోయింది. ఇదే క్రమంలో ఆరోగ్యమూ దెబ్బతింటోంది. ముఖ్యంగా రీల్స్‌ ను అతిగా చూసే అలవాటు కళ్లకు తీవ్రమైన హాని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.

* సూర్యకాంతి శరీరంలో విటమిన్‌ డి ఉత్తత్తికి దోహదపడుతుందనే సంగతి తెలిసిందే. శరీరానికి సూర్యకాంతి తగలకపోతే శరీరంలో సెరోటోనిన్‌ స్థాయిలు తగ్గొచ్చని.. తద్వారా ఒత్తిడి, ఆందోళనకు దారి తీసే ప్రమాదం ఉందని అంటున్నారు. అందువల్ల రోజూ కనీసం 15 నుంచి 30 నిమిషాలు ఉదయం సూర్యకాంతిలో గడిపితే.. ఇది మానసిక ఆరోగ్యానికి, ఒత్తిడి, డిప్రెషన్‌ ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు.

పైన పేర్కొన్న విధంగా చేయడం వల్ల మానసిక ఒత్తిడికి దూరమై ఉన్నంతలో ప్రశాంతమైన జీవితం జీవిస్తారని చెబుతున్నారు.