Begin typing your search above and press return to search.

‘ఒత్తిడి’: ఇలా తగ్గించుకుంటే సరి... లేకపోతే ఇవి సరాసరి!

ఒత్తిడి (స్ట్రెస్).. దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణం. ప్రతి పనిలోనూ ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది.

By:  Tupaki Desk   |   3 July 2025 10:00 AM IST
‘ఒత్తిడి’: ఇలా  తగ్గించుకుంటే సరి... లేకపోతే ఇవి సరాసరి!
X

ఒత్తిడి (స్ట్రెస్).. దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణం. ప్రతి పనిలోనూ ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. పైగా ప్రతీ మనిషిపైనా ఎంతో కొంత ఒత్తిడి ఉండాలని, అది వారి ఎదుగుదలకు సహకరిస్తుంద్ని అంటారు. అది లిమిట్ లో ఉన్నంతకాలం పర్లేదు. అదే.. ఆ ఒత్తిడి అదుపు తప్పితే, శృతి మించితే మాత్రం సమస్యే. ఇది తీవ్రమైతే.. మానసిక, శారీరక రుగ్మతలకు దారితీస్తుంది.

అవును... నేటి సమాజంలో ప్రధానంగా పట్టణాలో నివశించేవారు, ఉద్యోగాలు చేసేవారు ఎక్కువగా ఒత్తిడికి లోనవుతున్నారని అంటారు. అలా అని మిగిలినవారికి ఉండదని కాదు.. మిగిలినవారితో పాటు నగర వాసుల జీవనం ఒత్తిడితో కూడుకున్న యాంత్రిక జీవనం అని అంటారు. ఈ క్రమంలో ఒత్తిడి వల్ల నిద్రలేమి నుంచి గుండె సమస్యల వరకూ ఎదురవుతున్నాయి!

ఒత్తిడికి ఐదు అంశాలు కీలకం!:

అమెరికన్‌ సైకలాజికల్‌ అసోసియేషన్‌ సర్వే ప్రకారం.. ప్రధానంగా ఐదు అంశాలు దీర్ఘకాల ఒత్తిడికి కారణమవుతున్నాయి. అవి... డబ్బు, ఉద్యోగం / వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ, అనుబంధాలు, కుటుంబ సమస్యలు. అయితే... ఇవన్నీ అందరికీ ఒకేలా ఉండవని, వాటిని మేనేజ్ చేసుకునే విధానంపై ఆధారపడి, ఆయా వ్యక్తుల స్పందన మీదే వీటి ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.

ఉదాహరణకు ఓ వ్యక్తికి ఉన్నపలంగా ఉద్యోగం పోవడం, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడం లాంటివి జరిగితే వాటి ప్రభావం జీవితం మీద, కుటుంబం మీద పలు కోణాల్లో పడుతుంది. ఫలితంగా... తీవ్రమైన ఒత్తిడి రావడం సహజం. అటువంటప్పుడు నిపుణులను సంప్రదించడానికి సందేహించకూడదని చెబుతున్నారు. మానసిక నిపుణుల దగ్గరికి వెళ్లడం అవసరం అంటున్నారు!

పొంచిఉన్న గుండె జబ్బుల ముప్పు!:

తాజాగా ఈ విషయంపై స్పందించిన అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ (ఏహెచ్‌ఏ)... తీవ్రమైన ఒత్తిడితో గుండెజబ్బుల ముప్పు కూడా పుష్కలంగా పొంచి ఉందని తమ పరిశోధనలో వెల్లడైనట్లు తెలిపింది. ముఖ్యంగా తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా.. గుండె కొట్టుకునే తీరులో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని తమ అధ్యయనంలో వెల్లడైందని పేర్కొంది.

ఈ సమయంలో... వేర్వేరు ఉద్యోగాలు చేస్తున్న 18 - 60 ఏళ్ల వయసున్న సుమారు 6 వేల మందిని ఈ అధ్యయనానికి ఎంపిక చేసి.. వారి ఆరోగ్యాన్ని 18 ఏళ్ల పాటు నిపుణులు పరిశీలించారు. ఈ సమయంలో ఒత్తిడి లేని వారిని.. తీవ్రమైన ఒత్తిడితో బాధపడుతున్న ఉద్యోగులను విభజించి.. వారి ఆరోగ్య సమస్యలను నిపుణులు పరిశీలించారు.

ఈ సందర్భంగా స్పందిస్తూ... ఒత్తిడి లేని వారితో పోల్చితే.. తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారిలో గుండె జబ్బుల ముప్పు 83 శాతం అధికమని వెల్లడైంది. వృత్తిలో సామర్థ్యానికి మించి.. అంచనాలను పెంచుకోవడంతో చాలామంది తీవ్రమైన ఒత్తిడి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోందని ఏ.హెచ్.ఏ. అధ్యయనం పేర్కొంది.

యువత, మహిళల్లో ఎక్కువ!:

ఇక, ఇటీవల కాలంలో యువత మానసిక ఆందోళన, ఒత్తిడికి ఎక్కువగా గురవుతోందని యంగ్‌ లైవ్స్‌ ఇండియా అధ్యయనం వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న యువతలో దాదాపు 59 శాతం మంది ఏదో ఒక సమస్యతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు వివరించింది. ఇదే సమయంలో... గత నాలుగైదేళ్లలో పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ మానసిక అనారోగ్య లక్షణాలు పెరుగుతున్నాయని తెలిపింది.

సైలంట్ కిల్లర్ డిసీజ్!:

ఒత్తిడిని నేటి దైనందిన జీవితంలో మనిషి ఎదుర్కొంటున్న పెద్ద శత్రువు అని అంటున్నారు నిపుణులు. ఇది లిమిట్ లో ఉన్నంత వరకూ ఎలాంటి సమస్య లేదు కానీ... అది తీవ్రంగా మారితే మాత్రం.. అది బాధితులనే కాదు వారి చుట్టూ ఉన్న వారందరినీ కూడా ఇబ్బంది పెడుతుందని.. సమాజానికీ నష్టం కలిగిస్తుందని చెబుతున్నారు.

ఇంగ్లండ్‌ కి చెందిన ఓ సంస్థ అధ్యయనం ప్రకారం.. భారతదేశంలో కార్పొరేట్‌ రంగంలో పనిచేసే ఉద్యోగుల్లో 42 శాతం ఒత్తిడి, కుంగుబాటు సమస్యల్ని ఎదుర్కొంటున్నారట. అందుకే దీన్ని 'సైలెంట్‌ కిల్లర్‌ డిసీజ్‌' అని హెచ్చరిస్తున్నారు. ఒత్తిడికి కారణమవుతున్న చాలా సమస్యలకు పరిష్కారం మన చేతుల్లోనే ఉంటుందని.. మన చేతుల్లో లేనివాటిని వదిలేయడమే ఉత్తమమని సూచిస్తున్నారు.

ఒత్తిడి వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు!:

తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నవారు జీవితంలో ప్రశాంతంగా ఉండటం చాలా కష్టమని.. దీనివల్ల వ్యక్తిగత సంబంధాలు సైతం దెబ్బతింటాయని చెబుతున్నారు. ఇటీవల జరుగుతున్న ఎన్నో నేరాలు, ఘోరాల వెనుక తీవ్రమైన ఒత్తిడి ప్రభావం ఉంటుందని అంటున్నారు! వీటితో పాటు ఎదురయ్యే అనారోగ్య సమస్యలను ఇప్పుడు చూద్దామ్..!

* తీవ్రమైన ఒత్తిడి వల్ల రక్తపోటు (బీపీ), గుండె కొట్టుకునే వేగం పెరగడం వల్ల పక్షవాతం, గుండెపోటు ముప్పు పొంచివుంటుంది.

* ఒత్తిడి వల్ల ముందుగా కనిపించే తలనొప్పి, పార్శ్వనొప్పి, నిస్సత్తువ, ఆందోళన, తీవ్రమైన కోపం లాంటివి కుంగుబాటుకీ దారితీస్తాయి.

* ఈ ఒత్తిడి వల్ల గ్లూకోజ్‌ ఉత్పత్తి పెరిగి, షుగర్‌ వ్యాధి ముంచుకొచ్చే ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు.

* దీనివల్ల చర్మ సంబంధ సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు. ఇందులో భాగంగా... మొటిమలు, దురద, దద్దుర్లు, ఎలర్జీలు రావచ్చు.

* ఒత్తిడి ప్రభావం జీర్ణ వ్యవస్థపైనా ఉంటుంది. దీంతో... కడుపునొప్పి, అజీర్ణం, ఆకలి మందగించడం, అతిగా తినడం, వికారం లాంటివి కన్పిస్తాయి. ఇదే సమయంలో.. అల్సర్లు ఏర్పడతాయి.

* ఒత్తిడి వల్ల క్లోమగ్రంథి ఇన్సులిన్‌ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా... క్రమంగా మధుమేహం, ఊబకాయం, రక్తనాళాలు దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి.

* ఒత్తిడి వల్ల శృంగారం పట్ల ఆసక్తి తగ్గుతుంది. టెస్టోస్టెరాన్‌, ఈస్ట్రోజెన్‌ హార్మోన్ల ఉత్పత్తి పడిపోయి సంతాన సామర్థ్యం తగ్గిపోతుంది.

ఇలా చేయడం వల్ల నివారించుకోవచ్చు!:

తీవ్రమైన ఒత్తిడి బారిన పడకుండా ఉండటానికి రోజువారీ జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏమిటనేది ఇప్పుడు చూద్దామ్..!

* ధ్యానం, యోగా, ప్రాణాయామం వంటివి మానసిక ప్రశాంతతను కలగజేస్తాయి.

* మంచి ఆహారం తినటం, వ్యాయామం చేయటం, కంటి నిండా నిద్రపోవటం ద్వారా ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోవచ్చు.

* మనకు ప్రశాంతత, ఆనందం కలిగించేవారితో.. బాధల్లో తోడుగా ఉండేవారితో.. వ్యావహారిక విషయాల్లో సాయం చేసేవారితో సన్నిహిత సంబంధాలు కలిగుండాలి. దీంతో మనసు తేలికపడుతుంది.. ఫలితంగా ఒత్తిడి దరిజేరదు.

* ఇదే సమయంలో... అన్నీ మన చేతుల్లో, మన కంట్రోల్ లో ఉండవనే విషయాన్ని గుర్తించాలి. మార్చటానికి వీల్లేని పరిస్థితుల గురించి అదే పనిగా ఆలోచించకుండా ఉండే మార్గాలను అన్వేషించాలి.

* ఒత్తిడి నుంచి బయటపడలేకపోతున్నట్లు గుర్తిస్తే నిపుణుల సాయం తీసుకోవాలి.