పెళ్లి ఎప్పుడో కానీ పిల్లలు ఎప్పుడంటే అప్పుడే..స్పెర్మ్ ఫ్రీజింగ్ అంటే ఏంటో తెలుసా?
స్పెర్మ్ డొనేషన్: తమ స్పెర్మ్‌ను ఇతరులకు దానం చేయాలనుకునే వాళ్లకు కూడా ఈ ప్రక్రియను ఉపయోగించవచ్చు.
By: Tupaki Desk | 24 April 2025 4:27 AMప్రస్తుతం సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది. పిల్లల్ని కనడానికి కూడా ఎన్నో కొత్త టెక్నిక్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిలో చాలా ముఖ్యమైంది స్పెర్మ్ ఫ్రీజింగ్. ఇది భవిష్యత్తులో పిల్లల్ని కనాలనుకునే మగవారికి ఓ వరం లాంటిదని చెప్పొచ్చు. అసలు ఈ స్పెర్మ్ ఫ్రీజింగ్ అంటే ఏమిటి? ఎందుకు చేసుకోవాలి? దీని వల్ల ఉపయోగాలు ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
స్పెర్మ్ ఫ్రీజింగ్ అంటే మగవాళ్లు తమ వీర్యాన్ని సేకరించి ఓ ప్రత్యేక పద్ధతిలో అతి శీతల ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయడం. ఇది ఒక రకంగా భవిష్యత్తులో తమకు కావలసినప్పుడు పిల్లల్ని కనేందుకు ఓ భరోసా లాంటిది. వైద్యపరమైన కారణాల వల్ల కానీ, వ్యక్తిగత కారణాల వల్ల కానీ, లేదా భవిష్యత్తులో కుటుంబం ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన ఉన్న వారికి ఇది చాలా ఉపయోగకరమైన ప్రక్రియగా చెప్పొచ్చు.
స్పెర్మ్ ఫ్రీజింగ్ ఎందుకు అవసరం?
* క్యాన్సర్ చికిత్సలు: క్యాన్సర్ కోసం రేడియేషన్ లేదా కీమోథెరపీ తీసుకునే పురుషుల్లో స్పెర్మ్ ఉత్పత్తి తగ్గిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి, చికిత్స ప్రారంభించే ముందు స్పెర్మ్‌ను ఫ్రీజ్ చేసుకోవడం మంచిది.
* కెరీర్, వ్యక్తిగత కారణాలు: ఇటీవల కాలంలో చాలా మంది కెరీర్లో స్థిరపడే వరకు పెళ్లిపిల్లలకు దూరంగా ఉంటుంన్నారు. కొందరు పురుషులు తమ కెరీర్లో స్థిరపడ్డాకనే పిల్లల్ని కనాలని అనుకుంటున్నారు. అలాంటి వారు తమ స్పెర్మ్‌ను ఫ్రీజ్ చేసుకుని భవిష్యత్తులో వారు స్థిరపడిన తర్వాత తండ్రి కావచ్చు.
* ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు: స్త్రీగా మారాలనుకునే ట్రాన్స్జెండర్లు హార్మోన్ థెరపీ లేదా ఇతర ఆపరేషన్లు చేయించుకునే ముందు తమ స్పెర్మ్‌ను ఫ్రీజ్ చేసుకోవచ్చు.
స్పెర్మ్ ఫ్రీజింగ్ ఎలా చేస్తారు?
* స్పెర్మ్ సేకరణ: మగవారు తన వీర్యాన్ని వైద్య సిబ్బంది సమక్షంలో ఒక ప్రత్యేకమైన కంటైనర్‌లో సేకరిస్తారు.
* స్పెర్మ్ విశ్లేషణ: సేకరించిన స్పెర్మ్‌ను ల్యాబ్‌లో టెస్ట్ చేసి, దాని క్వాలిటీ, కౌంట్ సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారిస్తారు.
* క్రయోప్రిజర్వేషన్: మంచి క్వాలిటీ ఉన్న స్పెర్మ్ ను క్రయోప్రొటెక్టెంట్ అనే స్పెషల్ లిక్విడ్ లో కలిపి, ఆ తర్వాత లిక్విడ్ నైట్రోజన్‌లో అత్యంత శీతల ఉష్ణోగ్రత వద్ద స్టోర్ చేస్తారు.
* స్టోరేజీ : ఇలా స్టోర్ చేసిన స్పెర్మ్‌ను చాలా సంవత్సరాల పాటు (కొన్నిసార్లు 20 ఏళ్లకు పైగా కూడా) ఉపయోగించవచ్చు.
స్పెర్మ్ ఫ్రీజింగ్ ప్రయోజనాలు:
*స్పెర్మ్ డొనేషన్: తమ స్పెర్మ్‌ను ఇతరులకు దానం చేయాలనుకునే వాళ్లకు కూడా ఈ ప్రక్రియను ఉపయోగించవచ్చు.
* మరణం తర్వాత కూడా సంతానం : భవిష్యత్తులో టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందితే వ్యక్తి మరణించిన తర్వాత కూడా ఈ ఫ్రీజ్ చేసిన స్పెర్మ్‌ను ఉపయోగించి తన వంశాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది.
ఇప్పుడిప్పుడే మన తెలుగు వారిలో కూడా ఈ టెక్నాలజీ మీద అవగాహన ఏర్పడుతుంది. ముఖ్యంగా చదువుకున్న వారు, ఉద్యోగాలు చేసే వారు, వైద్య చికిత్సలు తీసుకుంటున్న వారు దీని గురించి తెలుసుకుంటున్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది చాలా కామన్.
స్పెర్మ్ ఫ్రీజింగ్ చేసే ముందు గుర్తుంచుకోండి
* మంచి క్లినిక్ ఎంచుకోండి: మంచి పేరున్న ఫెర్టిలిటీ క్లినిక్‌ను లేదా స్పెర్మ్ బ్యాంక్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. వారి సేవలు, ఎక్స్ పీరియన్స్ గురించి తెలుసుకోండి.
* అగ్రిమెంట్ (Consent Form): స్పెర్మ్‌ను ఎలా ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి, ఒకవేళ మరణిస్తే ఏమి చేయాలనే విషయాలన్ని ఓ అగ్రిమెంట్లో స్పష్టంగా రాసుకోవాలి.
* ఖర్చు: ఈ ప్రక్రియకు అయ్యే ఖర్చు, స్టోరేజీ ఛార్జీలు మొదలైన వివరాలను ముందుగానే తెలుసుకోవడం బెటర్.
స్పెర్మ్ ఫ్రీజింగ్ అనేది భవిష్యత్తులో కుటుంబం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి మంచి అవకాశంగా చెప్పొచ్చు.