Begin typing your search above and press return to search.

197 మంది పిల్ల‌లు.. ఒక్క వీర్య దాత కార‌ణంగా క్యాన్స‌ర్!

ఒక వీర్య దాత ద్వారా ఏకంగా 197 మంది పిల్లలు జన్మించడం వినడానికి ఏదో సినిమా కథలా అనిపించవచ్చు.

By:  Sivaji Kontham   |   13 April 2026 9:20 AM IST
197 మంది పిల్ల‌లు.. ఒక్క వీర్య దాత కార‌ణంగా క్యాన్స‌ర్!
X

ఒక వీర్య దాత ద్వారా ఏకంగా 197 మంది పిల్లలు జన్మించడం వినడానికి ఏదో సినిమా కథలా అనిపించవచ్చు. కానీ ఈ ఘటనలో ఒక విషాదకరమైన కోణం వెలుగు చూసింది. ఫ్యూచురా-సైన్సెస్ కథనం ప్రకారం.. సదరు దాతలోని గుర్తించబడని ఒక జన్యు ఉత్పరివర్తన కారణంగా.. అతడి వీర్యం ద్వారా పుట్టిన పిల్లల్లో కొందరికి అరుదైన, ప్రాణాంతకమైన క్యాన్సర్ సోకడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. వైద్య శాస్త్రం ఎంత ఎదిగినా కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో ఉండే లోపాలను ఈ ఉదంతం ఎత్తిచూపింది.

ముఖ్యంగా ఈ పిల్లలలో `రెటినోబ్లాస్టోమా` అనే అరుదైన కంటి క్యాన్సర్ వ్యాధి బయటపడింది. వీర్యం సేకరించిన సమయంలో దాతకు ఎటువంటి అనారోగ్య లక్షణాలు లేకపోవడంతో ప్రాథమిక పరీక్షల్లో ఈ జన్యు లోపం బయటపడలేదు. అయితే ఒక తరం నుండి మరో తరానికి బదిలీ అయ్యే ఈ లోపం.. పిల్లల శరీరంలో కణాల అదుపులేని పెరుగుదలకు దారితీసి క్యాన్సర్‌గా మారింది. పుట్టిన 197 మంది పిల్లల్లో అందరికీ ఈ వ్యాధి సోకకపోయినా.. ఆ జన్యువు శరీరంలో ఉన్న ప్రతి బిడ్డకూ భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ ఘటన స్పెర్మ్ బ్యాంకుల నిర్వహణలో ఉన్న లోపాలను.. స్క్రీనింగ్ పరీక్షల వైఫల్యాలను బయటపెట్టింది. ప్రస్తుతం చేస్తున్న సాధారణ పరీక్షలు అన్ని రకాల అరుదైన జన్యు లోపాలను గుర్తించలేకపోతున్నాయి. దాత ఆరోగ్య చరిత్రను సరిగ్గా విశ్లేషించకుండా ఒకే వ్యక్తి నుంచి వందల సార్లు వీర్యం సేకరించడం క్లినిక్‌ల బాధ్యతారాహిత్యమేనని విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల బాధితుల కుటుంబాలు ఇప్పుడు తీవ్రమైన మానసిక - ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. మరికొందరు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు.

భవిష్యత్తులో ఇలాంటి జన్యుపరమైన విపత్తులు జరగకుండా ఉండాలంటే ఒకే దాత నుండి పొందే సంతానంపై కఠినమైన చట్టపరమైన పరిమితులు విధించాల్సిన అవసరం ఉంది. ఒకే దాత ద్వారా వందల మంది పుట్టడం వల్ల వ్యాధులు వ్యాపించడమే కాకుండా.. తెలియకుండానే ఒకే ప్రాంతంలో రక్త సంబంధీకులు పెరగడం వల్ల భవిష్యత్తులో మరింత క్లిష్టమైన జన్యు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే దాతలకు `హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్` వంటి అత్యంత అధునాతన పరీక్షలను ప్రభుత్వం తప్పనిసరి చేయాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.

సంతాన సాఫల్య కేంద్రాలు కేవలం లాభాల కోసమే కాకుండా... నైతిక బాధ్యతతో వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది. డోనర్ల డేటాబేస్‌ను కేంద్రీకృతం చేయడం ద్వారా ఒక వ్యక్తి ఎన్నిసార్లు దానం చేస్తున్నాడో పర్యవేక్షించాలి. సాంకేతికతను వాడుకుని సంతానాన్ని పొందడం ఆనందదాయకమే అయినా... పారదర్శకమైన పర్యవేక్షణ, అత్యాధునిక జన్యు పరీక్షలు లేని పక్షంలో ఇలాంటి విపరీత పరిణామాలు తప్పవు. ఈ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫెర్టిలిటీ క్లినిక్‌లకు ఒక గట్టి హెచ్చరిక.