Begin typing your search above and press return to search.

వయసుతో పని లేదు.. బీమా ధీమా అందరికీ.. సంచలన నిర్ణయం

ఆరోగ్య బీమా.. కొవిడ్ వంటి మహమ్మారుల ప్రస్తుత కాలంలో ఇది ఎంతో అవసరం.

By:  Tupaki Desk   |   21 April 2024 12:30 AM GMT
వయసుతో పని లేదు.. బీమా ధీమా అందరికీ.. సంచలన నిర్ణయం
X

ఆరోగ్య బీమా.. కొవిడ్ వంటి మహమ్మారుల ప్రస్తుత కాలంలో ఇది ఎంతో అవసరం. ఇంట్లో పెద్ద వయసు వచ్చినవారుంటే ఇంకా అవసరం. అయితే, ఇందలో ప్రధాన అడ్డంకి వయో పరిమితి. ఓ వయసు దాటినవారికి ఇప్పటివరకు ఆరోగ్య బీమా వర్తించడం లేదు. ఇది చాలా కుటుంబాలకు ఇబ్బందికరంగా మారుతోంది. మరీ ముఖ్యంగా పేద కుటుంబాలకు. అయితే, ఇకపై అలాంటి ఇబ్బంది ఉండదు. భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) అత్యంత కీలక సవరణ చేసింది.

ఏ వయసువారైనా కొనొచ్చు..

ఇప్పటివరకు బీమా పాలసీ కొనుగోలుకు వయసు నిబంధన ఉండేది. 65 ఏళ్లు దాటినవారికి కొత్తగా బీమా పాలసీ కొనుగోలుకు చాన్స్ లేదు. ఈ అడ్డంకిని ఐఆర్డీఏఐ తొలగించింది. అంటే.. ఏ వయసువారైనా బీమా పాలసీ తీసుకోవచ్చన్నమాట. అటు అన్ని వయసుల వారికీ బీమా సంస్థలు పాలసీలను జారీ చేయొచ్చు.

సీనియర్‌ సిటిజన్లు, విద్యార్థులు, పిల్లలు, గర్భిణులలు సహా కాంపిటెంట్‌ అథారిటీ పేర్కొన్న అన్ని వయసుల వారికి అనుగుణంగా బీమా సంస్థలు బీమా కవరేజీలను డిజైన్‌ చేయొచ్చంటూ ఐఆర్‌డీఏఐ నోటిఫికేషన్‌ ఇచ్చింది.

ఈ నెల 1 నుంచే అమల్లోకి..

ఐఆర్‌డీఏఐ ఉత్తర్వులు ఈ నెల 1 నుంచే.. అంటే ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చాయి. ఇప్పటికి 20 రోజుల కిందటనే ఆదేశాలిచ్చినా ఇంతవరకు బయటకు రాలేదు. కాగా.. తాజా నిర్ణయంతో దేశంలో అత్యధికులకు ఆరోగ్య బీమా దక్కనుంది. మరోవైపు ఆరోగ్య బీమా కంపెనీలు ఇందుకు తగినట్లుగా పోర్ట్ ఫోలియోలను రూపొందించుకోవడానికి అవకాశం దక్కింది. ఈ నిర్ణయాన్ని బీమా పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి.

సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక పాలసీలు..

వయసు పెరిగిన కొద్దీ రోగాలు ముసిరే ప్రమాదం ఉండడంతో సీనియర్ సిటిజన్ల విభాగం వారికి ప్రత్యేక పాలసీలు తేవాలని, వారి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చానెల్ ఏర్పాటు చేయాలని ఐఆర్డీఏఐ బీమా సంస్థలకు సూచించింది. కాగా, ఇప్పటికే వ్యాధుల బారిన పడినవారికి వెయిటింగ్‌ పీరియడ్‌, మారటోరియం పీరియడ్‌ లను కూడా ఐఆర్డీఏఐ తగ్గించింది. నాలుగేళ్లు ఉన్న వెయిటింగ్‌ పీరియడ్‌ ను 3 సంవత్సరాలకు కుదించింది. తద్వారా మూడేళ్లు నిరంతరం ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తే.. ముందస్తు వ్యాధులను కారణంగా చూపి క్లెయిమ్‌లను బీమా సంస్థలు తిరస్కరించడానికి వీలుండదు. అంతేగాక.. మారటోరియం వ్యవధిని 8 సంవత్సరాల నుంచి 5 ఏళ్లకు తగ్గించింది.