Begin typing your search above and press return to search.

రష్యాలో ప్లేగ్ మరణాల కలకలం.. త‌స్స‌దియ్యా అసలు నిజం తెలుసుకోకుండానే!

రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న ఒక ల్యాబ్ టెక్నీషియన్ మరణం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన రేకెత్తించింది.

By:  Tupaki Desk   |   8 Oct 2026 12:38 PM IST
రష్యాలో ప్లేగ్ మరణాల కలకలం.. త‌స్స‌దియ్యా అసలు నిజం తెలుసుకోకుండానే!
X

రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న ఒక ల్యాబ్ టెక్నీషియన్ మరణం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన రేకెత్తించింది. కుర్ట్ యాంటీ-ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్న 28 ఏళ్ల డారియా శిపలోవా తీవ్రమైన నిమోనియాతో అక్టోబర్ 2న ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆమె ప్రయోగశాలలో పనిచేస్తున్న సమయంలో ప్లేగ్‌కు కారణమయ్యే `యెర్సినియా పెస్టిస్` బ్యాక్టీరియా ఉన్న టెస్ట్ ట్యూబ్ పగిలిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందనే ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ వార్తా క‌థ‌నాల ఆధారంగా తెలుగు మీడియాలు స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న చాలా టీవీ చానెళ్లు మ‌రో క‌రోనాను మించిన ప్ర‌మాదం ముంచుకొస్తోంద‌ని ఊద‌ర‌గొట్టాయి.

అయితే సోషల్ మీడియాల‌లో కొన్ని టీవీ చానెళ్ల‌లో వస్తున్న ఈ వార్తలకు ..అధికారిక నివేదికలకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని ప్రముఖ వార్తా సంస్థ WION తన తాజా క‌థ‌నంలో స్పష్టం చేసింది. రష్యా హెల్త్ వాచ్‌డాగ్ రోస్ప‌ట్‌నాజ్‌డ‌ర్ వెల్లడించిన వివరాల ప్రకారం... మరణించిన మహిళ నమూనాలను పరీక్షించగా ఆమె వృత్తిపరమైన పనులకు సంబంధించిన సూక్ష్మజీవులు ఏవీ శరీరంలో లభించలేదు. ల్యాబ్ యాక్సిడెంట్ జరిగిందనే వాదనలో ఎలాంటి నిజం లేదని.. మరణానికి గల కారణం అంతుచిక్కని నిమోనియాగానే అధికారికంగా నిర్ధారించారు.

ఈ ఘటనపై అనవసరమైన భయాలు తలెత్తడానికి గాలి ద్వారా వేగంగా సోకే `న్యూమోనిక్ ప్లేగ్` గురించిన ప్రచారమే ప్రధాన కారణమని నిపుణులు పేర్కొన్నారు. మధ్యయుగాల నాటి `బ్లాక్ డెత్` లాంటి ప్రాణాంతక పరిస్థితులు ఇప్పుడు లేవని ఆధునిక వైద్యంలో యాంటీబయోటిక్స్ ద్వారా ప్లేగ్‌ను ప్రారంభ దశలోనే పూర్తిగా నయం చేయవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టం చేస్తోంది. అయితే ముందస్తు జాగ్రత్త చర్యగా ఆమెతో కాంటాక్ట్‌లో ఉన్న సుమారు 200 మందిని.. ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన 60 మందికి పైగా సిబ్బందిని వైద్య నిఘాలో ఉంచారు.

ఇదిలా ఉండగా ఈ పరిణామాలపై అమెరికా సహా పలు దేశాలు కూడా నిశితంగా దృష్టి సారించాయి. ఎలాంటి తక్షణ ఆందోళనకర పరిస్థితి లేదని అమెరికా వర్గాలు పేర్కొనగా.. అవసరమైతే రష్యాకు సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాయి. కేవలం వైరస్ లీకైందనే వదంతుల ఆధారంగా దీన్ని భయానక వ్యాప్తిగా పరిగణించలేమని.. ల్యాబ్ ఆధారిత శాస్త్రీయ నిరూపణ వచ్చే వరకు ఇది కేవలం ఒక సందేహాస్పద కేస్ మాత్రమేనని నివేదిక స్పష్టం చేస్తోంది.

మొత్తానికి రష్యాను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వస్తున్న సంచలనాత్మక హెడ్‌లైన్స్‌ను నమ్మవద్దని అధికారులు కోరుతున్నారు. అధికారిక వర్గాల నుంచి స్పష్టత వచ్చే వరకు ఇలాంటి వదంతులను ప్రచారం చేయవద్దని.. ప్రస్తుత పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని ఈ ఉదంతం ద్వారా స్పష్టమవుతోంది.