Begin typing your search above and press return to search.

రోడ్డు ప్రమాదబాధితులకు రూ.లక్షన్నర వైద్యం..కేంద్రం మంచి నిర్ణయం

’ప్రపంచ యుద్ధాల కంటే రోడ్డు ప్రమాద మరణాలే అధికం’.. ఈ ఒక్క మాట చాలు పరిస్థితి తీవ్రతను తెలియజేసేందుకు.

By:  Tupaki Desk   |   6 May 2025 4:03 PM IST
రోడ్డు ప్రమాదబాధితులకు రూ.లక్షన్నర వైద్యం..కేంద్రం మంచి నిర్ణయం
X

’ప్రపంచ యుద్ధాల కంటే రోడ్డు ప్రమాద మరణాలే అధికం’.. ఈ ఒక్క మాట చాలు పరిస్థితి తీవ్రతను తెలియజేసేందుకు. ఏటా ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో లక్షలమంది ప్రాణాలు కోల్పోతుంటారు. ఊహించని దుర్ఘటనల్లో ఇలా మరణించేవారి కుటుంబసభ్యుల వేదన వర్ణనాతీతం. అయితే, ఇలాంటి ప్రమాదాల్లో తక్షణ వైద్యం అందిస్తే కొందరి ప్రాణాలనైనా కాపాడే వీలుంటుంది.

ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రికి సత్వరమే తీసుకెళ్లే సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారు. ఈ సమయంలో వైద్యం అందించగలిగితే ప్రాణాలు నిలిపే అవకాశం ఉంటుంది. కానీ, దీనికి ఎన్నో సంశయాలు.

ప్రమాద బాధితులను ఆస్పత్రిలో చేర్చాలంటే.. ముందుగా చికిత్సకు డబ్బు చెల్లింపు ఎలా? అనే ప్రశ్న వస్తుంది. ఇదిగో ఇలాంటి ప్రశ్నకు సమాధానమే కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘క్యాష్‌ లెస్‌ ట్రీట్‌ మెంట్‌ ఆఫ్‌ రోడ్‌ యాక్సిడెంట్‌ విక్టిమ్స్‌ స్కీం-2025’. ఈ నెల 5వ తేదీ నుంచే అమ్లలోకి వచ్చిన పథకం కింద రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు రూ.లక్షన్నర వరకు ఉచిత వైద్యం అందనుంది.

కాగా, రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్ లో ఉచితంగా వైద్యం అందించాలని గతంలోనే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు కేంద్రం తాజాగా చర్యలు తీసుకుంది.

మోటారు వెహికిల్ కారణంగా ఏ రహదారిలో ప్రమాదానికి గురైనా ఈ పథకం కింద రూ.లక్షన్నర వరకు నగదు రహిత వైద్యం పొందవచ్చు. ఏడు రోజుల దాకా ఈ సేవలు అందుకోవచ్చు.

రాష్ట్రాలు ఏం చేయాలి?

ట్రామా, పాలీ ట్రామా వైద్యం అందించగల ఆస్పత్రులను ఈ పథకం పరిధిలోకి తీసుకురావడం రాష్ట్రాల బాధ్యత. దీనిపై కేంద్రం సూచనలు చేసింది. ప్రమాద బాధితుడిని ఆస్పత్రికి తెచ్చిన వెంటనే వైద్యం ప్రారంభించాల్సి ఉంటుంది. సౌకర్యాలు లేకపోతే రవాణా సౌకర్యం కల్పించి మరో ఆస్పత్రికి రిఫర్ చేయాలి. బాధితుడు డిశ్చార్జి అయ్యాక వైద్యం తాలూకు బిల్లులను అప్ లోడ్ చేయాలి.