Begin typing your search above and press return to search.

పురుషుల ప్రాణాలకు ‘ప్రొస్టేట్’ ముప్పు

ప్రోస్టేట్ లో కణాల పెరుగుదలతో ఈ క్యాన్సర్ వస్తుంది. అయితే.. ఈ క్యాన్సర్ లక్షణాలు ప్రాథమికంగా గుర్తిస్తే.. ఈ ముప్పును తప్పించుకునే వీలుంది.

By:  Tupaki Desk   |   25 May 2025 3:00 PM IST
పురుషుల ప్రాణాలకు ‘ప్రొస్టేట్’ ముప్పు
X

అవును.. వయసు మీద పడుతున్న మగాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. ఎందుకంటే.. వారి ప్రాణాలకు ముప్పుగా మారింది ప్రొస్టేట్ క్యాన్సర్. వీర్యగ్రంథిగా పేర్కొనే ఈ క్యాన్సర్ కేసులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. పట్టణాలు.. నగరాల్లో నమోదవుతున్న ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు క్రమంగా పెరగటమే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వయసు 70 ఏళ్లు దాటితే.. ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుందని చెబుతున్నారు.

ప్రోస్టేట్ లో కణాల పెరుగుదలతో ఈ క్యాన్సర్ వస్తుంది. అయితే.. ఈ క్యాన్సర్ లక్షణాలు ప్రాథమికంగా గుర్తిస్తే.. ఈ ముప్పును తప్పించుకునే వీలుంది. అయితే.. దీనిపై అవగాహన లేకపోవటంతో పలువురు వ్యాధి ముదిరిన తర్వాత కానీ గుర్తించలేని దుస్థితి. ఇంతకూ ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడే వారికి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయన్న విషయానికి వస్తే.. మూత్రం.. వీర్యంలో రక్తం.. మూత్రం గులాబీ.. ఎరుపు రంగులో ఉండటం.. రాత్రిళ్లు ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావటం.. మూత్రం సరిగా రాకపోవటం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.

ఇలాంటి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడినట్లు కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇలాంటి లక్షణాలు కనిపించినంతనే అలెర్టు అయితే.. ఈ ముప్పును ముందే గుర్తించొచ్చు. ఇందుకోసం రూ.800 నుంచి రూ.వెయ్యి ఖర్చుతో ఈ క్యాన్సర్ ను గుర్తించొచ్చని చెబుతున్నారు. ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ పరీక్షతో దీన్ని కనిపెట్టొచ్చని చెబుతున్నారు. ఈ క్యాన్సర్ లక్షణాల్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత ముందు నుంచే చికిత్స షురూ చేయటం ద్వారా ముంచుకొచ్చే ప్రమాదాన్ని నివారించొచ్చు.

ముందుగా గుర్తిస్తే.. చికిత్స లేదంటే శస్త్రచికిత్స ద్వారా ఈ సమస్యను అధిగమించేందుకు వీలుగా అధునాతన పద్దతులు అందుబాటులోకి వచ్చాయన్నది మరవకూడదు. అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ కూడా ఈ క్యాన్సర్ బారినే పడ్డారన్నది మర్చిపోకూడదు. ఆయనకు కూడా మూత్ర విసర్జన సరిగా జరగకపోవటం.. నడుంనొప్పితో ఇబ్బంది పడుతుంటే పరీక్షలు నిర్వహించారు.

ఈ సందర్భంగానే ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడినట్లుగా గుర్తించారు. ఈ వ్యాధి ప్రతి లక్ష మందిలో తొమ్మిది మంది వరకు దీని బారిన పడే ప్రమాదం ఉంది. ఢిల్లీలో ఈ సంఖ్య 12గా ఉంటే.. హైదరాబాద్ లో మాత్రం లక్షకు ఆరుగురు దీని బారిన పడుతున్నారు. హైదరాబాద్ ఆసుపత్రులకు వచ్చే కేసుల్లో 30 - 40 శాతం కేసులు ముదిరిన తర్వాతే రావటం గమనార్హం. సో.. ఈ అంశం మీద ఆందోళన చెందే కన్నా.. అవగాహన చాలా ముఖ్యమన్న విషయాన్ని మరవకూడదు.