'మూడు రాత్రులు నిద్ర' పై కొత్త అధ్యయనం హెచ్చరిక ఇదే!
ఈ సమయంలో కనీసం మూడు రాత్రులు సరిగా నిద్ర పోకపోతే జరిగే పరిణామాలపై తాజాగా ఓ అధ్యయనం షాకింగ్ హెచ్చరికలు చేసింది.
By: Tupaki Desk | 24 May 2025 9:34 AM ISTమనిషికి మూడుపూటలా కడుపు నిండా తిండి లేకపోయినా పర్లేదు కానీ.. రాత్రి కంటి నిండా నిద్ర ఉండాలని అంటారు! కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర అనేది మనిషి ఆరోగ్యానికి అత్యంత అవసరమైన ప్రక్రియగా చెబుతారు! ఈ సమయంలో కనీసం మూడు రాత్రులు సరిగా నిద్ర పోకపోతే జరిగే పరిణామాలపై తాజాగా ఓ అధ్యయనం షాకింగ్ హెచ్చరికలు చేసింది.
అవును... చాలామంది రాత్రులు సరిగా నిద్రపోలేకపోతుంటారు. అయితే.. అది చాలా ప్రమాదమని తాజా అధ్యయనం చెబుతోంది. ఈ మేరకు స్వీడన్ లోని ఉప్ప్సల యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన కొత్త అధ్యయనంలో.. వరుసగా మూడు రాత్రులు, రాత్రికి నాలుగు గంటలు అంతకంటే తక్కువ నిద్రపోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని కనుగొన్నారు.
ఈ పరిశోధన కోసం ప్రయోగశాల వాతావరణంలో 16 మంది ఆరోగ్యవంతమైన యువకులు పాల్గొన్నారు. వారి బసలో.. కచ్చితమైన ఫలితాలు నిర్ధారించడం కోసం వారి భోజన, ఇతర కార్యక్రమాల విషయాల్లో పలు జాగ్రత్తలు తీసుకొన్నారు. ఈ సమయంలో ఈ పరిశోధనలో పాల్గొనే 16 మంది యువకులను రెండు గ్రూపులుగా విభజించారు.
ఇందులో ఒక గ్రూపులో వారి దినచర్యలో మూడు రాత్రులు సాధారణ నిద్ర (8.5 గంటలు), మరో గ్రూపులోని వారిలో మూడు రాత్రులు తక్కువ నిద్ర (4.25 గంటలు) కేటాయించారు. నిద్ర అనంతరం సైక్లింగ్ వ్యాయామం పూర్తి చేశారు. ఈ సమయంలో వారి రక్తాన్ని వ్యాయామానికి ముందు, తర్వాత పరీక్షించారు!
ఈ అధ్యయనంలో.. నిద్ర లేమి వల్ల యువకులు, ఆరోగ్యవంతులైన పెద్దలలో గుండె జబ్బులకు సంబంధించిన సమస్యలు పెరుగుతాయని తేలింది! కనీసం మూడు రాత్రులు సరిగా నిద్రపోవకపోవడం అనేది.. సాధారణంగా ఆరోగ్యకరమైన ప్రోటీన్లను పెంచే వ్యాయామానికి శరీర ప్రతిస్పందన బలహీనంగా ఉంది.
దీంతో.. పగటి సమయాన్ని బట్టి ప్రోటీన్ స్థాయిలు మారుతూ ఉంటాయని.. నిద్ర పరిమితం చేయబడినప్పుడు (తక్కువ సమయం నిద్రపోయినప్పుడు) ఎక్కువ వైవిధ్యాలు ఉంటాయని కూడా ఈ అధ్యయనంలో తేలిందని చెబుతున్నారు. ఇది గుండె జబ్బులపై నిద్ర యొక్క గణనీయమైన ప్రభావాన్ని హైలెట్ చేస్తుంది! ఈ అధ్యయనం ప్రధానంగా రక్తంలోని ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్లపై దృష్టి పెట్టింది.
