Begin typing your search above and press return to search.

క్యాన్సర్ పై 20 ఏళ్ల పరిశోధన.. ఫలించినట్లేనా?

క్యాన్సర్‌ అంటే ప్రపంచవ్యాప్తంగా రోగులను భయపెడుతుండగా, వైద్యరంగానికి సవాల్ విసురుతున్నది.

By:  Tupaki Desk   |   9 Sept 2025 3:14 PM IST
క్యాన్సర్ పై 20 ఏళ్ల పరిశోధన.. ఫలించినట్లేనా?
X

క్యాన్సర్‌ అంటే ప్రపంచవ్యాప్తంగా రోగులను భయపెడుతుండగా, వైద్యరంగానికి సవాల్ విసురుతున్నది. శస్త్రచికిత్సలు, కీమోథెరపీ, రేడియేషన్‌ వంటి చికిత్సా పద్ధతులు ఉన్నప్పటికీ, వాటి దుష్ప్రభావాలు రోగులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి సమయంలో “ఒక్క ఇంజెక్షన్‌తో క్యాన్సర్‌ పూర్తిగా నయం కావచ్చు” అన్న పరిశోధన ఫలితాలు వెలువడడం వైద్య రంగానికి ఆశాకిరణంగా మారింది.

20 ఏళ్ల పరిశోధనకు ఫలితం..

సీడీ40 అగోనిస్ట్‌ యాంటీబాడీ రకానికి చెందిన 2141.వీ11 అనే ఔషధం తాజాగా నిర్వహించిన ప్రయోగాల్లో విశేష ఫలితాలు ఇచ్చింది. నిజానికి ఈ తరహా మందులపై పరిశోధనలు రెండు దశాబ్దాలుగా జరుగుతున్నాయి. జంతువులపై పరీక్షల్లో విజయం సాధించినా, మనుషులపై ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు. ముఖ్యంగా శరీరమంతా వాపు రావడం, ప్లేట్‌లెట్లు తగ్గిపోవడం, కాలేయ నష్టం వంటి దుష్ప్రభావాలు చికిత్సకు సవాల్‌గా నిలుస్తున్నాయి. .

రాక్‌ఫెల్లర్‌ యూనివర్సిటీ ఆవిష్కరణ

2018లో రాక్‌ఫెల్లర్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త జెఫ్రీ వి. రావెచ్ ఈ సమస్యలను అధిగమించే మార్గాలను గుర్తించారు. ఆయన ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన 2141.వీ11 మందు సురక్షితంగా ఉపయోగించవచ్చని నిర్ధారణ అయ్యింది. తాజాగా ఈ మందును క్యాన్సర్‌ ఇతర భాగాలకు వ్యాపించిన 12 మంది రోగులపై పరీక్షించారు.

ప్రాథమిక ఫలితాలు ఆశాజనకమే

ఈ పరిశోధనలో పాల్గొన్న 12 మందిలో ఆరుగురిలో కణతుల పరిమాణం తగ్గగా, ఇద్దరిలో రక్త, రొమ్ము క్యాన్సర్లు పూర్తిగా నయం అయ్యాయి. ముఖ్యంగా ఇంజెక్షన్‌ ఇచ్చిన ప్రాంతం మాత్రమే కాకుండా, శరీరంలోని ఇతర ప్రాంతాల్లోని కణతులు కూడా కుంచించుకుపోవడం వైద్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ఒక్క భాగానికే పరిమితమయ్యే చికిత్సా ప్రభావం ఇక్కడ శరీరమంతా కనపడటం ఒక విశేషం.

వైద్య రంగంలో విప్లవాత్మక మార్పు

ఈ ఫలితాలు ఎంతగానో ఉత్సాహపరిచినా, ఇది కేవలం ప్రారంభ దశలోని పరిశోధన మాత్రమే. పెద్ద ఎత్తున క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతమైతేనే దీన్ని సాధారణ చికిత్సలో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ, ఒకే ఇంజెక్షన్‌తో క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధిని నియంత్రించగలమనే సూచనలు వెలువడటం వైద్యరంగంలో విప్లవాత్మక మార్పుకు నాంది కావచ్చు.

వైద్యరంగం ఎదురుచూపులు

ఇప్పటి వరకు క్యాన్సర్‌ చికిత్సలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, చికిత్స ఖర్చులు, దుష్ప్రభావాలను పరిగణనలోకి తీసుకుంటే, ఈ కొత్త ఔషధం భవిష్యత్తులో ఆశాజనక మార్గం చూపనుంది. రాబోయే సంవత్సరాల్లో జరగబోయే విశాలమైన పరిశోధనలు ఈ కలను వాస్తవం చేయగలవా? అన్న ప్రశ్నకు సమాధానం కోసం వైద్య ప్రపంచం ఆతృతగా ఎదురుచూస్తోంది