లావుగా ఉన్న పిల్లలకు తెలివితేటలు తక్కువట.. ఇందులో నిజమెంత ?
ఊబకాయం ప్రపంచానికి రానురాను ఓ మహమ్మారిగా మారుతోంది. మారిపోయిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ సమస్య వేగంగా పెరుగుతోంది.
By: Tupaki Desk | 2 May 2025 2:30 PMఊబకాయం ప్రపంచానికి రానురాను ఓ మహమ్మారిగా మారుతోంది. మారిపోయిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ సమస్య వేగంగా పెరుగుతోంది. ప్రపంచంలో ప్రతి 8 మందిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీనివల్ల ప్రజలు తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రతేడాది 28 లక్షల మంది మరణిస్తున్నారు. ఈ కారణంగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీని గురించి ఆందోళన చెందుతోంది. ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఊబకాయాన్ని కేవలం బరువుతో మాత్రమే ముడిపెట్టి చూస్తున్నారు. కానీ ఊబకాయం కేవలం శరీరంపైనే కాకుండా మెదడుపై కూడా ప్రభావం చూపుతుందట. ఊబకాయం మన జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఆలోచనా సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుందట.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఊబకాయానికి, మెదడు శక్తికి మధ్య లోతైన సంబంధం ఉంది. ఊబకాయం శరీరంలో కొన్ని రకాల పదార్థాలను పెంచుతుంది. ఇవి మెదడు ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు, దీర్ఘకాలిక వాపు, ఇన్సులిన్ నిరోధకత, ఆక్సిడేటివ్ ఒత్తిడి. దీని కారణంగా మెదడు ప్రభావితమవుతుంది.
డాక్టర్లు చెబుతున్న దాని ప్రకారం. మన శరీరంలో అవసరానికి మించిన కొవ్వు పేరుకుపోయినప్పుడు, అది మెదడుకు సరైన విధంగా రక్తం చేరుకోనివ్వదు. దీనివల్ల న్యూరాన్లు (మెదడు నరాలు) మధ్య సమన్వయం దెబ్బతింటుంది. ఎక్కువ కాలం ఇలా ఉంటే, మన ఆలోచించే, అర్థం చేసుకునే శక్తి బలహీనపడుతుంది. చిన్నతనంలోనే పిల్లలు ఊబకాయానికి గురైతే, అది వారి మెదడు అభివృద్ధికి కూడా ఆటంకం కలిగిస్తుంది. చిన్నతనంలో ఊబకాయం జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సమస్య పరిష్కరించే సామర్థ్యాన్ని తగ్గిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.
ఎక్కువగా జంక్ ఫుడ్, తీపి పదార్థాలు, వేపుళ్లు తినే వారి శరీరంలో వాపు, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు విషయాలు మెదడు పనితీరును తగ్గిస్తాయి. దీనికి విరుద్ధంగా, మీరు ఒమేగా-3, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఆహారం తీసుకుంటే, మెదడు వేగంగా , ఆరోగ్యంగా ఉంటుంది. ఊబకాయం నేరుగా తెలివితేటలను తగ్గించదు, కానీ ఇది మన మెదడు ఆరోగ్యంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. అంటే ఊబకాయం ఉన్నవారు తక్కువ తెలివైనవారు అని కాదు, కానీ ఊబకాయం వారి ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యాన్ని నెమ్మదిగా తగ్గిస్తుంది.