Begin typing your search above and press return to search.

ఎలుకల్లో 8 కొత్త వైరస్ లు... చైనా శాస్త్రవేత్తల షాకింగ్ వివరాలు!

తాజాగా చైనీస్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ (సీఎస్ఎం)కి చెందిన ప్రచురణ విభాగం వైరోలాజికా సినికా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది.

By:  Tupaki Desk   |   26 Oct 2023 5:30 PM GMT
ఎలుకల్లో 8 కొత్త వైరస్  లు... చైనా  శాస్త్రవేత్తల  షాకింగ్  వివరాలు!
X

చైనా, వైరస్... ఈ రెండు పదాలు కలిపి చదవాలంటే ప్రపంచం మొత్తం వణికిపోతుందని చెప్పినా అతిశయోక్తి కాదు. కారణం... కోవిడ్ మహమ్మారి ప్రపంచంపై విరుచుకుపడింది చైనా నుంచే అని బలమైన వాదన ఉంది! కరోనా వైరస్ తొలిసారిగా చైనా నగరమైన ఊహాన్‌ లో బయటపడిందనేది తెలిసిన విషయమే. ఈ క్రమంలో తాజాగా మరోసారి బాంబు పేల్చారు శాస్త్రవేత్తలు!

అవును... 2019లో ప్రపంచాన్ని తాకిన కరోనా వైరస్‌ భయం అందరినీ నేటికీ వెంటాడుతూనే ఉందనేది ఒప్పుకునే విషయమే! ఆ పేరు చెబితే ఇప్పటికీ వణికిపోతున్న దేశాలు ఎన్నో ఉన్నాయి! పైగా కరోనా తర్వాత.. రకరకాల వెర్షన్స్ కూడా వెలుగులోకి వచ్చాయి. కరోనా వైరస్‌ ఆల్పా, బీటా, ఓమిక్రాన్... ఇలా రకరకాల రూపాలను మార్చుకుంటూ కరోనా ప్రపంచంపై దండయాత్ర చేసింది. ఈ సమయంలో చైనాలో శాస్త్రవేత్తల కంటికి కొత్త వైరస్ లు కనిపించాయంట.

చైనా దక్షిణ తీరంలోని ఉష్ణమండల ద్వీపమైన హైనాన్‌ లో గతంలో ఎన్నడూ చూడని ఎనిమిది రకాల వైరస్‌ లను అక్కడి శాస్త్రవేత్తలు కనుగొన్నారని తెలుస్తుంది. ఈ వైరస్ లు అన్నీంటినీ ఎలుకల్లో గుర్తించినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో... ఈ వైరస్ లు ఏ క్షణమైనా ఎలుకల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో... ఈ వైరస్‌ లు మరో మహమ్మారి ముప్పుపై ఆందోళనను సూచిస్తున్నాయని అంటున్నారు.

ఇదే సమయంలో... భవిష్యత్ మహమ్మారులను ఎదుర్కొనేందుకు ప్రపంచ ప్రజలను సిద్ధం చేసే దిశగా ఈ ఆవిష్కరణలు సాగిస్తున్నారని చెబుతున్నారు! అయితే... రేపు పొద్దున్న ప్రపంచం మొత్తం తనవైపు వేలు చూపించకుండా చైనా తీసుకుంటున్న ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ విషయాలు వెల్లడించారా.. లేక సిన్సియర్ గానే తెలియజేశారా అన్నది తెలియదు కానీ... చైనా శాస్త్రవేత్తలు ఈ చావుకబురు చల్లగా చెప్పారు!

తాజాగా చైనీస్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ (సీఎస్ఎం)కి చెందిన ప్రచురణ విభాగం వైరోలాజికా సినికా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. ఇందులో భాగంగా... శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా 700 ఎలుకల నమూనాలను సేకరించారని.. వీటిలో ఎనిమిది కొత్త వైరస్ లను కనుగొన్నారని.. ఇందులో ఒకటి సార్స్‌-కోవ్‌-2, కోవిడ్‌-19కి కారణమైన వైరస్ కుటుంబానికి చెందినదని గుర్తించారని ఆ జర్నల్ పేర్కొంది.

ఈ సందర్భంగా... గబ్బిలాలపై పలు పరిశోధనలు చేసి "బ్యాట్ ఉమెన్"గా పేరు తెచ్చుకున్న శాస్త్రవేత్త డాక్టర్ షి జెంగ్లీ... ఈ నూతన వైరస్‌ లకు సంబంధించి అందించిన వివరాలను వైరోలాజికా సినికా జర్నల్ లో ప్రచురించారు. అయితే... ఈ వైరస్ లు మనుషులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది వంటి విషయాలు తెలుసుకునేందుకు మరిన్ని పరిశోధనలు చేయాల్నిన అవసరం ఉందని ఆమె చెబుతున్నారని తెలుస్తుంది.

కాగా... శాస్త్రవేత్తలు ఈ మధ్యకాలంలో హైనాన్ లో ఎలుకల నుంచి సుమారు 682 నమూనాలను సేకరించారట. అనంతరం ఈ నమూనాలను వాటిలోని జాతులు, అవి నివసించే ప్రాంతాల ఆధారంగా వర్గీకరణ చేశారట. ఈ నేపధ్యంలో జరిగిన పరిశోధనల్లోనే వాటిలోని వైరస్‌ లు వెలుగు చూశాయని.. వీటిలో కొన్నింటిలో మనిషి ఆరోగ్యానికి ముప్పు తెచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.