వర్షాకాలంలో గొంతు మారుతోందా.. ఏం చేయాలంటే?
వర్షాకాలం వేళ జలుబు.. దగ్గు.. గొంతు నొప్పి చాలామంది ఫేస్ చేస్తుంటారు. ఈ సందర్భంగా వారి గొంతు (వాయిస్) లో మార్పు వస్తుంది.
By: Garuda Media | 6 Oct 2025 1:00 AM ISTవర్షాకాలం వేళ జలుబు.. దగ్గు.. గొంతు నొప్పి చాలామంది ఫేస్ చేస్తుంటారు. ఈ సందర్భంగా వారి గొంతు (వాయిస్) లో మార్పు వస్తుంది. స్వరపేటిక వాపు.. గొంతు గరగర.. బొంగురుపోవటం.. తడారటం.. గొంతులో నొప్పి లాంటివి ఎదురవుతుంటాయి. నాలుగైదు రోజుల పాటు ఇలాంటి సమస్యలు ఎదురైతే ఫర్లేదు కానీ.. వారాల తరబడి అదే సమస్య వెంటాడుతుంటే మాత్రం అస్సలు లైట్ తీసుకోవద్దని.. వెంటనే ఈఎన్ టీ వైద్యుల్ని సంప్రదించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
వర్షాల్లో తడిచినా.. చల్లటి వాతావరణంలో తిరిగినా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయి. జీర్ణవ్యవస్థలో లోపాలతోనూ కడుపులోకి యాసిడ్ గొంతులోకి వచ్చి కూడా వాయిస్ మారే ఛాన్స్ ఉంది. ఇలాంటి వేళ కొన్ని చిట్కాల్ని పాటిస్తే మంచిదన్న సూచన చేస్తున్నారు నిపుణులు. విటమిన్ సి పుష్కలంగా ఉన్న నారింజ.. బొప్పాయి.. నిమ్మ.. కివీ లాంటి పండ్లు రోజువారీ ఆహారంలో తీసుకోవటం.. టమాటా.. ద్రాక్ష.. అరటి.. క్యారెట్.. ఉల్లి లాంటి పదార్థాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఎలర్జీ తగ్గించటంలో సాయం చేస్తాయని చెబుతున్నారు.
గోరు వెచ్చని గ్లాసు నీళ్లలో అరచెంచా ఉప్పు వేసి బాగా కలిపి.. తరచూ పుక్కిలిస్తే కూడా ఉపశమనం పొందే వీలుందని.. ఇలా చేయటం ద్వారా యాంటీ మైక్రో బయల్ ప్రభావంతో ఇన్ ఫెక్షన్ తగ్గే వీలుందని చెబుతున్నారు. అల్లంటీ.. గ్రీన్ టీ.. తేనె.. తులసిరసం తీసుకోవాలని చెబుతున్నారు తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్.. యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు గొంతు వాపును తగ్గిస్తాయి. శరీరంలో నీటి శాతం తగ్గినా గొంతు మీద ప్రభావం పడుతుందని.. అందుకే రోజుకు ఏడెనిమిది గ్లాసుల నీళ్లు తాగాలని చెబుతన్నారు. శీతాకాలంలో కారం.. పులుపు.. మసాలా ఆహారాలు తగ్గించాలని చెబుతున్నారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. మారిన గొంతు మామూలు స్థితికి రాకుంటే మాత్రం ఈఎన్ టీ వైద్యులను సంప్రదించి.. వారి సూచనల్ని పాటించాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు.
