ఆఫీసులో కుర్చీకి అతుక్కుపోకుండా..మైక్రో వాకింగ్‌తో ఆరోగ్యం కాపాడుకోండి
నడక ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలుసు. అయితే, ఆధునిక జీవనశైలిలో చాలా మందికి రోజూ వ్యాయామం చేయడం లేదా నడవడం కుదరదు.
By: Tupaki Desk | 26 May 2025 3:01 PM ISTనడక ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలుసు. అయితే, ఆధునిక జీవనశైలిలో చాలా మందికి రోజూ వ్యాయామం చేయడం లేదా నడవడం కుదరదు. ముఖ్యంగా, రోజు మొత్తం కూర్చొని పనిచేసే ఉద్యోగులకు ఇదో పెద్ద సమస్య. అలాంటి వారికోసమే వైద్యులు ఇప్పుడు "మైక్రో వాకింగ్" (Micro Walking) అనే కొత్త పద్ధతిని సూచిస్తున్నారు. ఇది కేవలం ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, పనిలో కూడా చురుగ్గా ఉండేలా చేస్తుంది. మైక్రో వాకింగ్ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.
ఏమిటీ మైక్రో వాకింగ్?
మైక్రో వాకింగ్ అంటే రోజూ ఒకే సమయానికి, ఎక్కువ దూరం నడవాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు, కొద్దిసేపు నడవడం. ఉదాహరణకు, మీరు ఆఫీసులో పనిచేస్తుంటే ప్రతి గంటకు ఒకసారి లేచి 2-5 నిమిషాలు నడవొచ్చు. లేదా ఫోన్ మాట్లాడేటప్పుడు అటూ ఇటూ తిరుగుతూ నడవొచ్చు. ఇలా రోజులో చిన్న చిన్న విరామాల్లో నడవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు.
మాక్స్ ఆసుపత్రి వైద్యులు చెబుతున్న దాని ప్రకారం.. రోజు మొత్తం ఒకే చోట కూర్చొని పనిచేసే ఉద్యోగులకు మైక్రో వాకింగ్ ఎంతో మేలు చేస్తుంది. కూర్చోవడం వల్ల కండరాలు బిగుసుకుపోతాయి. అప్పుడప్పుడు లేచి నడవడం వల్ల కండరాలు సంకోచించి, సడలి తిరిగి సాధారణ స్థితికి వస్తాయి. కండరాల కదలిక వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్, పోషకాలను సమర్థవంతంగా అందిస్తుంది. మెరుగైన రక్త ప్రసరణ వల్ల శరీరం మొత్తంగా మరింత చురుగ్గా పనిచేస్తుంది. గుండెపై ఒత్తిడి తగ్గుతుంది, గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
మెదడుకు రక్త ప్రసరణ పెరిగి, ఆలోచనా శక్తి, ఏకాగ్రత మెరుగుపడతాయి. తద్వారా పనిలో ఉత్సాహంగా ఉండొచ్చు. ఒకే చోట కూర్చోవడం వల్ల వచ్చే అలసట, నీరసం తగ్గుతాయి. అందుకే, ఉద్యోగులు అప్పుడప్పుడు లేచి నడవడం, కాసేపు అటూ ఇటూ తిరగడం చాలా ముఖ్యం. ఇది కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా, మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరం. పని ఒత్తిడిని తగ్గించి, రోజంతా ఫ్రెష్‌గా ఉండటానికి మైక్రో వాకింగ్ ఒక అద్భుతమైన మార్గం.