Begin typing your search above and press return to search.

రాత్రిపూట పనులు చేసే మహిళల్లో గర్భం దాల్చడంలో సమస్యలు.. గైనకాలజిస్ట్ ఏమంటున్నారంటే?

మాతృత్వం అనేది ప్రతి మహిళ కల.. ఒకానొక సమయంలో సరైన ఆరోగ్య విధివిధానాలు, జీవనశైలి కారణంగా సకాలంలో సంతానోత్పత్తి కలిగేది.

By:  Tupaki Desk   |   9 Sept 2025 12:00 AM IST
రాత్రిపూట పనులు చేసే మహిళల్లో గర్భం దాల్చడంలో సమస్యలు.. గైనకాలజిస్ట్ ఏమంటున్నారంటే?
X

మాతృత్వం అనేది ప్రతి మహిళ కల.. ఒకానొక సమయంలో సరైన ఆరోగ్య విధివిధానాలు, జీవనశైలి కారణంగా సకాలంలో సంతానోత్పత్తి కలిగేది. కానీ మారుతున్న కాలం కొద్దీ ఆహార శైలిలో మార్పులు రావడం, గజిబిజి లైఫ్ స్టైల్ లో ఆరోగ్యం పై శ్రద్ధ వహించకపోవడం.. లాంటి పలు కారణాల వల్ల గర్భం దాల్చడంలో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో గర్భం ఆలస్యం అవ్వడంతో చాలామంది దేవుళ్లను మొక్కుతున్నారు కూడా.. అటు డాక్టర్లను కూడా సంప్రదిస్తున్నారు. కానీ అసలు కారణం జీవనశైలి అనే విషయాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోవడం గమనార్హం.

ప్రత్యేకించి ఉద్యోగం చేసే మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది అని, పైగా రాత్రిపూట పనులు చేసే మహిళల్లో ఈ సమస్య ఇంకా ఎక్కువగా కనిపిస్తోందని గైనకాలజిస్ట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే.. గర్భం దాల్చడంలో ఏర్పడుతున్న అడ్డంకుల గురించి మహిళలకు సలహాలు,సూచనలు ఇస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ..శరీరంలోని అంతర్గత మార్పులే సంతానోత్పత్తిని ప్రభావం చేయవని.. బాహ్య కారకాలు కూడా ఉంటాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా కలుషితమైన ప్రదేశాలలో నివసించడం.. తక్కువ నిద్ర.. ప్లాస్టిక్ నుండి విడుదలయ్యే హానికర రసాయనాలను పీల్చడం.. రాత్రిపూట విశ్రాంతి లేకుండా పని చేయడం, సరైన ఆహారం తీసుకోకపోవడం లాంటి అంశాలు గర్భధారణ అవకాశాలను తగ్గిస్తాయట. అందుకే సంతానోత్పత్తి తగ్గడానికి అసలు కారణం ఏమిటో తెలుసుకుంటే సులభంగా గర్భం పొందవచ్చు అని గైనకాలజిస్టులు సలహాలు ఇస్తున్నారు.

క్రమం తప్పకుండా దినచర్యను పాటించాలి.. పని, నిద్ర సమయాలను ఒకేలా ఉంచుకోవడం వల్ల శరీరానికి సమతుల్యత లభిస్తుంది. కానీ నిరంతరం మారుతున్న షిఫ్టులు, ఋతుచక్రంలో అసమర్థ్యతను కలిగిస్తాయి. ఫలితంగా అండోత్సర్గము నమూనాను ప్రభావితం చేస్తాయట. కాబట్టి పని, విశ్రాంతి సమయాలను సరిగా బ్యాలెన్స్ చేసుకోవాలి అని, విశ్రాంతి సమయంలో పని ఒత్తిడి లేకుండా చూసుకోవాలని కూడా సలహా ఇస్తున్నారు.

ముఖ్యంగా శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. అందుకే రాత్రి పూట పనులు చేసే వారికి నిద్రకు అంతరాయం కలుగుతుంది.అప్పుడు హార్మోన్ల సమతుల్యత ప్రభావితం అవుతుంది. చాలాసేపు రాత్రులు మేల్కొని పనిచేయకుండా ఉండడమే మంచిది. ఆరోగ్యకరమైన నిద్ర చక్రాన్ని నిర్వహించడం వల్ల కూడా గర్భం దాల్చడానికి కారణం అవుతుంది. శబ్దం లేని గదులు , చీకటి వాతావరణం మంచి నిద్రకు సహాయపడతాయి.

ఉద్యోగాలు చేసే మహిళల్లో ఒత్తిడి ఏ రేంజ్ లో ఉంటుందో ఇంట్లో ఉండే మహిళల్లో కూడా అంతే ఒత్తిడి ఉంటుందనే విషయం ప్రతి ఒక్కరు గుర్తించాలి. కాబట్టి మహిళపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాకుండా ఆమెను మనశ్శాంతిగా ఉండేలా చూడాలి. అటు మహిళలు కూడా ధ్యానం, ప్రాణాయామం, యోగ లేదా తేలికపాటి వ్యాయామం , నలుగురితో కలిసి సరదాగా గడపడం లాంటి పనులు చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారి గర్భధారణకు కారణం అవుతుంది.

సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి.. తాజా కూరగాయలు, పండ్లు , ప్రోటీన్లు , తృణధాన్యాలు శరీరానికి మేలు చేస్తాయి. కెఫిన్, ప్యాక్ చేసిన ఆహారాలను దూరంగా ఉంచాలి.శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండడానికి తగినంత నీరు తీసుకోవాలి. అవసరమైతే వైద్యులను కూడా కలవాలి. అంతేకాదు హార్మోన్ల అసమతుల్యతను

, ఋతుచక్రాలను ప్రభావితం చెయ్యకుండా మన శరీరాన్ని బ్యాలెన్స్ గా ఉంచుకోవాలి. రాత్రిపూట పని చేయడం వల్ల శరీరం సిర్కాడియన్ లయకు అంతరాయం కలుగుతుంది. రాత్రి పని చేసే 35 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న మహిళలకు సంతానోత్పత్తి చికిత్స అవసరమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి చక్కటి జీవనశైలిని అలవాటు చేసుకుంటే గర్భం పొందడంలో ఏర్పడే సమస్యలను పరిష్కరించుకోవచ్చని సలహా ఇస్తున్నారు.