Begin typing your search above and press return to search.

ఊబకాయులపై బాంబుపేల్చిన లాన్సెట్‌!

2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య 100 కోట్లను మించిపోయిందని లాన్సెట్‌ తన అధ్యయంలో పేర్కొంది

By:  Tupaki Desk   |   1 March 2024 8:15 AM GMT
ఊబకాయులపై బాంబుపేల్చిన లాన్సెట్‌!
X

ఉద్యోగ రీత్యా ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం, విపరీతమైన పని ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, వ్యామాయం పూర్తిగా వదిలేయడం, మారిన ఆహారపు అలవాటు, జీవనశైలి మార్పులు వంటి కారణాలతో అధిక బరువుతో ఉండే ఊబకాయుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ప్రపంచంలో ఏకంగా 100 కోట్ల మందికి పైగా ఊబకాయులు ఉన్నారని తేలింది. ఈ మేరకు ప్రముఖ జర్నల్‌ లాన్సెట్‌ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

ఎన్‌సీడీ రిస్క్‌ ఫ్యాక్టర్‌ కొలాబరేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా లాన్సెట్‌ ఈ అధ్యయనం నిర్వహించినట్టు తెలిపింది. పెద్ద వయసు మహిళల్లో ఊబకాయం రెండింతలు, పురుషులలో దాదాపు 3 రెట్లు పెరిగిందని వెల్లడించింది.

2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య 100 కోట్లను మించిపోయిందని లాన్సెట్‌ తన అధ్యయంలో పేర్కొంది. ఈ 100 కోట్ల మందిలో పెద్దలేగాక, పిల్లలు, యువకులు కూడా ఉన్నారని బాంబుపేల్చింది. వీరిలో 15.9 కోట్ల మంది చిన్నారులు, యువకులే కావడం గమనార్హం. పెద్దలు 87.9 కోట్ల మంది ఉన్నారని తెలిపింది.

సాధారణంగా పోషకాహార లోపం ఉంటే తక్కువ బరువు ఉండటం లేదా ఊబకాయానికి దారితీస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

అయితే, 1990 నుంచి తక్కువ బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని లాన్సెట్‌ తన తాజా అధ్యయనంలో వెల్లడించింది. దీంతో చాలా దేశాల్లో పోషకాహార లోపంతోనే ఊబకాయం వస్తుందని తెలిపింది.

1990 నాటితో పోలిస్తే.. ఊబకాయ బాధితుల సంఖ్య నాలుగురెట్లు పెరిగిందని లాన్సెట్‌ బాంబుపేల్చింది. గతంలో అధిక బరువు ఉండటం పెద్దవాళ్లలో మాత్రమే కనిపించేదని గుర్తు చేసింది. కానీ ఇప్పుడు స్కూల్‌ కు వెళ్లే చిన్నారులు, టీనేజర్లనూ కూడా ఈ సమస్య వేధిస్తుండటం తీవ్ర ఆందోళనకరంగా మారిందని పేర్కొంది.

ఊబకాయంపై ప్రపంచ దేశాలు ఇప్పుడే మేల్కొని.. తగిన చర్యలు తీసుకోవాలని లాన్సెట్‌ సూచించింది. లేనిపక్షంలో భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఒబేసిటీకి అడ్డుకట్ట వేయకపోతే 2035 నాటికి ప్రపంచ జనాభాలో సగానికి పైగా అధిక బరువుతో బాధపడతారని వరల్డ్‌ ఒబేసిటీ ఫెడరేషన్‌ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.