Begin typing your search above and press return to search.

కార్తీక మాసం అంటే కేవలం భక్తి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఓ ఛాలెంజ్.. తెలుగు యువత కొత్త ట్రెండ్..

పూజలు, ఉపవాసాలకే పరిమితం కాకుండా తెలుగు యువత కార్తీక మాసాన్ని 30 రోజుల హెల్తీ లైఫ్‌స్టైల్ ఛాలెంజ్‌గా మార్చుకుంటోంది. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ, సాత్విక ఆహారం, వాకింగ్, యోగా, ధ్యానం, మంచి నిద్రకు ప్రాధాన్యత ఇస్తోంది.

By:  Tupaki Desk   |   9 Nov 2026 4:26 PM IST
కార్తీక మాసం అంటే కేవలం భక్తి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఓ ఛాలెంజ్.. తెలుగు యువత కొత్త ట్రెండ్..
X

పూజలు.. నోములు.. దీపారాధనలతో పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసం అంటే మనందరికీ ముందుగా గుర్తుచ్చేది ఆధ్యాత్మిక భావన.. భక్తి పారవశ్యం. తెల్లవారుజామునే లేచి నదీస్నానాలు ఆచరించడం.. శివనామ స్మరణతో ఆలయాలను మార్మోగించడం మన సంప్రదాయం. అయితే కాలం మారుతోంది.. కాలంతో పాటు మన ఆలోచనలు.. అలవాట్లు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటికీ కాలం వేరు.. మనుషులు వేరు.. మనస్తత్వాలు వేరు. అందరిలోనూ ఫిట్ నెస్ ఆరోగ్యాభిలాష పెరిగింది. దానికి అనుగుణంగానే పండుగలను మన ఆరోగ్యానికి అనుగుణంగా మలుచు కుంటున్నారు.

ఈ కార్తీక మాసాన్ని కేవలం ఆచారాలకే పరిమితం చేయకుండా.. శరీరానికి, మనసుకు ఒక అద్భుతమైన 'హెల్తీ డీటాక్స్ మంత్'గా మలుచు కుంటున్నారు నేటి తెలుగు యువత. భక్తికి ఫిట్‌నెస్‌ను జోడిస్తూ వారు ఎంచుకున్న ఈ సరికొత్త మార్గం ఇప్పుడు సమాజంలో చర్చనీయాంశమైంది.

నవంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న కార్తీక మాసాన్ని మన యువత ఒక అద్భుతమైన ఛాలెంజ్‌గా స్వీకరిస్తోంది. నెల రోజుల పాటు క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవాటు చేసుకుంటూ.. తమ శరీరాన్ని మనసును నూతన ఉత్సాహంతో నింపాలని సంకల్పించు కున్నారు. ఉరుకుల పరుగుల ఆధునిక జీవితంలో మనం కోల్పోతున్న ఆరోగ్యాన్ని.. ప్రశాంతతను తిరిగి పొందేందుకు ఈ మాసాన్ని ఒక సువర్ణావకాశంగా భావిస్తున్నారు.

చాలామంది కార్తీక మాసంలో మాంసాహారానికి దూరంగా ఉంటారు.. అయితే ఈసారి దానిని మరింత ముందుకు తీసుకెళ్తూ.. కేవలం రెడ్ మీట్ మాత్రమే కాకుండా శరీరానికి హాని చేసే ఫాస్ట్ ఫుడ్స్, బర్గర్లు, పిజ్జాలు, నూనె పదార్థాలు, అధిక చక్కెర డ్రింక్స్‌కు పూర్తిగా గుడ్‌బై చెబుతున్నారు. బయటి జంక్ ఫుడ్‌కు బదులుగా.. అమ్మ చేతి వంట రుచిని ఆస్వాదిస్తూ ఇంట్లో తయారుచేసిన సాత్విక ఆహారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆకుకూరలు, తాజా కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలను రోజూటి ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకుంటూ తగినన్ని నీళ్లు తాగుతూ జీర్ణక్రియను మెరుగుపరుచుకుంటున్నారు.

ఆహార నియమాలతో పాటు వ్యక్తిగత దినచర్యలోనూ అద్భుతమైన మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. అర్ధరాత్రి వరకు మొబైల్ స్క్రీన్‌లకు అతుక్కుపోవడం.. సరిగ్గా నిద్రపోకపోవడం.. ధూమపానం.. మద్యపానం వంటి వ్యసనాలకు నెల రోజుల పాటు దూరంగా ఉండాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు.

ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి.. చల్లటి గాలిలో వాకింగ్, యోగా, ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటున్నారు. రోజులో కనీసం 30 నిమిషాలు తమ శరీరం కోసం కేటాయించడం ద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందుతున్నారు.

ఏ మంచి పనైనా పది మందితో పంచుకుంటే వచ్చే ఆనందమే వేరు. ఈ '30 డేస్ హెల్తీ కార్తీక్ ఛాలెంజ్' ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. తమ లక్షణాలను స్నేహితులతో పంచుకుంటూ ఒకరికొకరు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నెల ప్రారంభంలో తమ గోల్స్‌ను డిక్లేర్ చేసి నెల చివరికి తాము సాధించిన ప్రగతిని సమీక్షించుకుంటూ ఆరోగ్యకరమైన పోటీని తలపిస్తున్నారు.

అయితే ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నట్లుగా.. డీటాక్స్ పేరుతో తిండి మానేయడం.. కఠినమైన ఉపవాకాలతో శరీరాన్ని నీరసపరుచుకోవడం సరికాదని యువత గ్రహించింది. మన శరీరంలోని వ్యవస్థలు సహజంగానే వ్యర్థాలను తొలగిస్తాయని తెలుసుకుంటూ.. సమతుల్య ఆహారం, తగిన నిద్ర, ప్రశాంతతకు పెద్దపీట వేస్తున్నారు. మాంసాహారం మానినప్పుడు ప్రత్యామ్నాయంగా పప్పులు, సోయా, పాలు వంటి వాటి ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తున్నారు. ఈ నెల రోజులు పాటించే చిన్న చిన్న మంచి అలవాట్లు రేపు జీవితాంతం ఒక చక్కని జీవనశైలిగా మారిపోవడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ కార్తీక మాసంలో మనమూ ఒక కొత్త సంకల్పం చేద్దాం. భక్తి మార్గంలో దేవుడిని కొలుస్తూనే మన శరీరం అనే దేవాలయాన్ని కూడా ఆరోగ్యంగా కాపాడుకుందాం. నెల రోజుల ఈ చిన్న ప్రయత్నం మన జీవితాన్ని శాశ్వతంగా సుఖసంతోషాలతో నింపాలని కోరుకుందాం..