భారత్ లో మెడికల్ టూరిజం అభివృద్ధి ఏ స్థాయిలో అంటే..!
అవును... కేపీఎంజీ సహకారంతో ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్.హెచ్.ఆర్.ఏ.ఐ) రూపొందించిన ఓ నివేదిక ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
By: Tupaki Desk | 18 July 2025 9:33 AM ISTభారతదేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతూ ఉందని.. మరో పదేళ్లలో చాలా రంగాల్లో భారత్ గణనీయమైన వృద్ధిని కనబరుస్తుందనే నివేదికలు తెరపైకి వస్తోన్న వేళ.. తాజాగా ఓ ఆసక్తికరమైన నివేదిక తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. భారత మెడికల్ టూరిజం మార్కెట్ 2025లో 18.2 బిలియన్ డాలర్ల నుండి 2035 నాటికి 58.2 బిలియన్ డాలర్లకు పెరుగనుంది.
అవును... కేపీఎంజీ సహకారంతో ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్.హెచ్.ఆర్.ఏ.ఐ) రూపొందించిన ఓ నివేదిక ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది మెడికల్ టూరిజం రంగంలో భారత్ అభివృద్ధిని నివేదించింది. ఈ నివేదిక.. 2035 నాటికి ప్రపంచ వైద్య కేంద్రంగా మారాలనే దేశ ప్రతిష్టాత్మక దార్శనికతను చూపించింది.
'హీల్ ఇన్ ఇండియా – క్యాటలైజింగ్ మెడికల్ అండ్ వెల్నెస్ టూరిజం ఫర్ ఎ హెల్తీయర్ గ్లోబల్ ఫ్యూచర్' అనే శీర్షికతో ఈ నివేదిక 'హీల్ ఇన్ ఇండియా 2025' సమ్మిట్ లో ఆవిష్కరించబడింది. ఈ సందర్భంగా... దీనికి తోడ్పాటు అందించేందుకు ఎంబసీలు, ఎగ్జిబిషన్లు, డిజిటల్ ప్లాట్ ఫాంల ద్వారా అంతర్జాతీయంగా బ్రాండింగ్ ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని రిపోర్ట్ సూచించింది.
వాస్తవానికి భారతదేశం ప్రస్తుతం మెడికల్ టూరిజం ఇండెక్స్ లో 10వ స్థానంలో, గ్లోబల్ వెల్ నెస్ టూరిజంలో 7వ స్థానంలో ఉంది. ఇది థాయిలాండ్, టర్కీ, మలేషియా వంటి దేశాలతో పోటీ పడుతుండగా.. ఆయుర్వేదం, యోగా, పంచకర్మ వంటి సాంప్రదాయ వెల్ నెస్ వ్యవస్థలతో ఆధునిక వైద్య నైపుణ్యాన్ని కలపడంలో భారత ప్రత్యేక ప్రయోజనాన్ని నివేదిక హైలైట్ చేస్తుంది.
ఇదే సమయంలో... అంతర్జాతీయ పేషెంట్లకు చికిత్స చేసే ఆస్పత్రులకు పన్నుల పరంగా మినహాయింపులు ఇవ్వొచ్చని.. మార్కెటింగ్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ స్కీము కింద సబ్సిడీలను పెంచవచ్చని.. ఇదే క్రమంలో వెల్ నెస్ సెంటర్లు సహా వైద్యపరమైన మౌలిక సదుపాయాల విభాగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించవచ్చని నివేదిక తెలిపింది.
ఈ సందర్భంగా స్పందించిన పర్యాటక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ సుమన్ బిల్లా మాట్లాడుతూ... మనం మార్కెట్ ను పెంచుకోవడమే కాకుండా నమ్మకాన్ని పెంచుకోవాలని.. మన లక్ష్యం లావాదేవీల సంరక్షణ మాత్రమే కాకుండా పరివర్తనాత్మక వైద్యం కావాలని అన్నారు. రాబోయే సంవత్సరాల్లో ఈ రంగానికి బలమైన వృద్ధిని ఆయన అంచనా వేశారు.
ఈ సందర్భంగా స్పందించిన ఏపీఎంజీ ఇండియా డైరెక్టర్ సోమేశ్వర కౌండిన్య... ఈ నివేదికను భారతదేశాన్ని ప్రపంచ వైద్యం రాజధానిగా నిలబెట్టడానికి అందించిన పిలుపుగా అభివర్ణించారు. ఈ సందర్భంగా.. మెరుగైన బహుభాషా ఆతిథ్య శిక్షణ, చిన్న నగరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఈ సందర్భంగా.. ఆయుర్వేదం, సాంప్రదాయ వైద్యం ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన డాక్టర్ మనోజ్ నేసరి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా, ఆయుర్వేదాన్ని.. వైద్యం, వెల్నెస్ ప్రత్యామ్నాయంగా మరింత ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నామని తెలిపారు.
