దగ్గుమందు సిరప్ పై బ్యాన్.. ఐదేళ్ల లోపు వరకు వాడకుండా రూల్
రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గుమందుల్లో సిరప్ లను ప్రిస్కిప్షన్ లో రాయకుండా ఉండేలా బ్యాన్ విధించాలన్న యోచనలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తోంది.
By: Garuda Media | 12 April 2026 11:59 AM ISTదగ్గుమందు సిరప్ వినియోగంపై కేంద్రం సీరియస్ గా ఆలోచిస్తోంది. దీనికి సంబంధించి కఠిన నిబంధనల్ని తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా కఠిన నిబంధనల్ని తీసుకురావటం ద్వారా.. దగ్గుమందు సిరప్ లు చిన్నారులకు వాడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్న ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించిన నిబంధనల ముసాయిదాను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గుమందుల్లో సిరప్ లను ప్రిస్కిప్షన్ లో రాయకుండా ఉండేలా బ్యాన్ విధించాలన్న యోచనలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తోంది. ఐదేళ్ల లోపు పిల్లలకు దగ్గుమందు సిరప్ వాడకుండా నిరోధించే చర్యలు చేపట్టాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ విడుదల చేసిన నేషనల్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా 2026 ముసాయిదాలో భాగంగా ఈ చర్యలు చేపడతారని చెబుతున్నారు.
నాసిరకం దగ్గు ముందు సిరప్ కారణంగా గత ఏడాది పలువురు మరణించిన నేపథ్యంలో వీటి వినియోగం విషయంలో కఠినంగా వ్యవహరించాలన్న ఆలోచనలో కేంద్రం ఉందంటున్నారు. రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గు.. జలుబు మందులను సిరప్ రూపంలో ప్రిస్క్రైబ్ చేయకూడదని.. పంపిణీ చేయరాదన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. ఐదేళ్ల లోపు పిల్లలకు కూడా అత్యంత జాగ్రత్తగా.. వైద్యుల సూచన లేకుండా అమ్మని రీతిలో నిబంధనల్ని మార్చాలని భావిస్తున్నారు.
దగ్గు నివారణకు ఉపయోగపడే లిక్విడ్ ఓర్ ఫార్ములేషన్స్ లో డైఇథిలీన్ గ్లైకాల్.. ఇథిలీన్ గ్లైకాల్ లాంటి హానికర పారిశ్రామిక రసాయనాలు ఉన్నట్లుగా తేలటంతో.. సిరప్ తయారీ నిబంధనల్ని మరింత కఠినతరం చేసే ఆలోచనలో కేంద్రం ఉంది. వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం చేసిన ముసాయిదాను ఇండియన్ డ్రగ్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ లాంటి పరిశ్రమ సంఘాలు ఈ ముసాయిదాను రివ్యూ చేసి.. తమ రియాక్షన్ ను తెలుపుతాయని చెబుతున్నారు. దగ్గు అన్నది ఒక సహజమైన రక్షణ ప్రతిచర్యగా పేర్కొంటూ.. ఈ లక్షణాల్ని అణిచివేసే కన్నా.. దానికి దారి తీసే కారణాలపై ఫోకస్ చేయటం మంచిదన్న సూచన వైద్యుల నుంచి వస్తోంది. సిరప్ లకు బదులుగా.. ప్రత్యామ్నాయాలపై ఆలోచించాలని సూచన చేస్తున్నారు.
