Begin typing your search above and press return to search.

క‌రోనా క‌న్నా డేంజ‌ర్ గురూ: నిఫా వైర‌స్‌పై ఐసీఎం ఆర్ వార్నింగ్‌

కేరళ రాష్ట్రాన్ని నిఫా వైరస్‌ కలవరపరుస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా మరో కొత్త కేసు బయటపడింది.

By:  Tupaki Desk   |   16 Sep 2023 11:22 AM GMT
క‌రోనా క‌న్నా డేంజ‌ర్ గురూ:  నిఫా వైర‌స్‌పై ఐసీఎం ఆర్ వార్నింగ్‌
X

కేరళ రాష్ట్రాన్ని నిఫా వైరస్‌ కలవరపరుస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా మరో కొత్త కేసు బయటపడింది. 39 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తికి వైరస్‌ సోకినట్లు తేలింది. నిఫా వైర‌స్‌ బారిన పడి గత నెల 30వ తేదీన ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి ద్వారా ఇతనికి వైరస్‌ సంక్రమించిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్‌ తెలిపారు. దీంతో రాష్ట్రంలో నిఫా కేసుల సంఖ్య ఆరుకు చేరింది. వీరిలో ఇద్దరు ఇప్పటికే మరణించారు. నలుగురికి చికిత్స అందిస్తున్నామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని మంత్రి పేర్కొన్నారు.

అదేవిధంగా నిఫా వైర‌స్ సోకిన వ్య‌క్తితో క‌లిసి తిరిగిన ఒక వెయ్యి 80 మంది వ్య‌క్తుల జాబితాను సేక‌రించి, వారికి కూడా ప‌రీక్ష‌లు చేయ‌నున్న‌ట్టు మంత్రి వివ‌రించారు. కాగా, కేర‌ళ‌లో వెలుగు చూసిన నిఫా వైరస్‌ బంగ్లాదేశ్‌ వేరియంట్‌ అని, మనుషుల నుంచి మనుషులకు సంక్రమించే ఈ వేరియంట్‌ వ్యాప్తి తక్కువగా ఉన్నా, మరణాలు అధికంగా ఉంటాయని కేరళ ప్రభుత్వం హెచ్చరించింది. ఇదిలావుంటే, నిఫా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ఈ నెల 24వ తేదీ వ‌ర‌కు కొజికొడ్‌ జిల్లాలో అన్ని విద్యాసంస్థ‌ల‌కు కేర‌ళ ప్ర‌భుత్వం సెల‌వు ప్ర‌క‌టించింది.

కేర‌ళ‌లోని కొజికోడ్ జిల్లాను వ‌ణికిస్తున్న నిఫా వైర‌స్ విష‌యంలో ప్ర‌జ‌లు అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ICMR డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ రాజీవ్ బాహ్ పేర్కొన్నారు. నిఫా వైర‌స్ సోకిన వారిలో మరణాల రేటు 40 నుంచి 70 శాతం ఉంటుంద‌ని, క‌రోనాతో పోల్చితే ఇది చాలా ఎక్కువని ఆయ‌న‌ తెలిపారు. అయితే, నిఫా వైర‌స్ సోకిన వారు సైతం కరోనా సమయంలో తీసుకున్న జాగ్ర‌త్త‌లే పాటించాల‌ని సూచించారు. మాస్క్‌ ధరించాల‌ని, తరచూ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాల‌ని, ఇన్ఫెక్షన్‌ సోకిన వారు ఇతరులను క‌ల‌వ‌రాద‌ని, ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకోవాలని వివ‌రించారు.

ఇవీ ల‌క్ష‌ణాలు!

నిఫా వైర‌స్ సోకిన వారిలో శ్వాసక్రియ, మెదడులో ఇబ్బందులు తలెత్తుతాయని రాజీవ్ బాహ్ తెలిపారు. నిఫా వైరస్‌ సోకిన తొలిదశలో జ్వరం, తలనొప్పి, మగతగా ఉండటం, వాంతులు, జలుబు, దగ్గు, శ్వాస ఆడకపోవటంతోపాటు ఒళ్లు నొప్పులు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయ‌న్నారు. ఈ ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వైద్యుల‌ను సంప్ర‌దించాల‌ని సూచించారు.