Begin typing your search above and press return to search.

రోగి నో చెబితే ఐసీయూలో చేర్చుకోవద్దు.. తాజా మార్గదర్శకాలు

ఐసీయూలో చికిత్స వద్దనుకునే వారు.. ఆ మేరకు లివింగ్ విల్ రాసిన వారిని ఆ విభాగంలో చేర్చుకోకూడదని పేర్కొన్నారు

By:  Tupaki Desk   |   3 Jan 2024 6:16 AM GMT
రోగి నో చెబితే ఐసీయూలో చేర్చుకోవద్దు.. తాజా మార్గదర్శకాలు
X

ఐసీయూ అన్నంతనే.. అనారోగ్యం ఏ మాత్రం బాగోలేకున్నా.. కీలక సమయాల్లో తప్పనిసరిగా ఉంచి వైద్య చేసే విభాగాన్ని ఐసీయూ అని వ్యవహరించటం తెలిసిందే. అయితే.. ఐసీయూ పేరుతో కొన్ని ఆసుపత్రులు భారీగా దోచేస్తున్నాయన్న ఆరోపణ బలంగా ఉంది. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. రోగి తనకు తానుగా తనకు ఐసీయూలో వైద్యం చేయాల్సిన అవసరం లేదని వైద్యుల్నికోరిన తర్వాత.. సదరు పేషెంట్ ను ఐసీయూలో చేర్చాల్సిన అవసరం లేదన్న విషయాన్ని తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

అంతేకాదు.. మరికొన్ని మార్గదర్శకాల్ని విడుదల చేసింది. 24 మందితో కూడిన నిపుణుల టీం ఐసీయూలో వైద్యానికి సంబంధించిన తాజా మార్గదర్శాల్ని సిద్ధం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం తీసుకొచ్చిన మార్గదర్శకాల్ని చూస్తే.. కొన్ని కీలకమైన నిర్ణయాల్ని ప్రకటించినట్లుగా చెప్పాలి. తీవ్రమైన వ్యాధి.. అనారోగ్యంతో మరణం అంచులకు చేరే వారికి ప్రత్యేకంగా ఎలాంటి ఇతర చికిత్సల అవసరం లేనప్పుడు.. ప్రస్తుత చికిత్సతో వారి ఆరోగ్యం ఏ మాత్రం మెరుగుపడే అవకాశం లేనప్పుడు వారిని ఐసీయూలో ఉంచాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అంతేకాదు.. ఐసీయూలో చికిత్స పొందుతున్న వారు కానీ.. కుటుంబ సభ్యులు.. బంధువులు కానీ చికిత్స అవసరం లేదని పేర్కొనప్పుడు ఆ రోగులను ఆసుపత్రి యాజమాన్యాలు ఐసీయూలో చేర్చుకోకూడదు.

ఐసీయూలో చికిత్స వద్దనుకునే వారు.. ఆ మేరకు లివింగ్ విల్ రాసిన వారిని ఆ విభాగంలో చేర్చుకోకూడదని పేర్కొన్నారు. అంతేకాదు.. విపత్తులు.. మహమ్మారి వ్యాప్తించే సమయాల్లో పరిమిత వనరుల అంశాల్ని పరిగణలోకి తీసుకోవాలి. ఐసీయూ రోగులను ఉంచే అంశంపై నిర్ణయాల్ని తీసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఐసీయూ కోసం వెయిటింగ్ లిస్టు ఉండి ఉంటే కూడా ఏయే అంశాల్ని పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలన్న దానిపైనా మార్గదర్శకాలు జారీ చేశారు.

ఐసీయూ కోసం వెయిటింగ్ లిస్టు ఉన్నప్పుడు.. ఆయా రోగుల రక్తపోటు.. శ్వాస రేటు.. హార్ట్ బీట్ అంశాల్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఆక్సిజన్ శాచురేషన్.. మూత్ర పరిమాణం.. నాడీ వ్యవస్థ పని తీరు లాంటి అంశాల్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఐసీయూలో చేర్చుకోవాల్సిన వారికి సంబంధించిన వివరాల్ని తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అవేమంటే..

- మానసిక చేతలో మార్పులు

- రక్తప్రసరణ వ్యవస్థలో అస్థిరత

- శ్వాస వ్యవస్థకు తోడ్పాటు అవసరం కావటం

- తీవ్ర అనారోగ్యంతో ప్రత్యేక పర్యవేక్షణ అవసరమైన వారు

- ఏదైనా అవయువానికి తోడ్పాటు అవసరమైన వారు

- అవయువ వైఫల్యం ఉన్న వారు

- ఆరోగ్య పరిస్థితి క్షీణించే అవకాశం ఉన్న వ్యాధులతో బాధ పడేవారు

- గుండె సమస్య

- శ్వాసకోశ వ్యవస్థ పని తీరులో హెచ్చుతగ్గులు

- పెద్ద స్థాయి శస్త్రచికిత్స చేయించుకొని ఉండటం