Begin typing your search above and press return to search.

మందులకే పరిమితం అవ్వొద్దు.. జాగ్రత్త పడాల్సిందే.. సైలెంట్ కిల్లర్... హైబీపీ!

మన దైనందిన జీవితంలో ముందుగా సంపాదన మీద శ్రద్ధ చూపుతుంటాం. ముందుగా ఆదాయం, ఖర్చులు లెక్కలు వేసుకుంటాం.

By:  Tupaki Desk   |   9 Sept 2025 11:05 AM IST
మందులకే పరిమితం అవ్వొద్దు.. జాగ్రత్త పడాల్సిందే.. సైలెంట్ కిల్లర్... హైబీపీ!
X

మన దైనందిన జీవితంలో ముందుగా సంపాదన మీద శ్రద్ధ చూపుతుంటాం. ముందుగా ఆదాయం, ఖర్చులు లెక్కలు వేసుకుంటాం. ఖర్చు ఎక్కువైతే తగ్గించుకుంటాం. పొరపాట్లు జరిగితే సరిచేసుకుంటాం. అయితే మన శరీరం కూడా కొన్ని లెక్కలు పరిగణనలోకి తీసుకుంటుంది. అదే రక్తపోటు. ఇప్పుడిప్పుడే దీనిపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్నది.

అనారోగ్య సమస్యలకు ప్రధాన కారకం

మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రధాన కారకాల్లో అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్) ఒకటి. ఇది గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ సమస్యలు, మతిమరుపు లాంటి ఇతర అనేక సమస్యలకు కారణమవుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కేవలం మందులతోనే కాకుండా, జీవనశైలి మార్పులతో నియంత్రణ అవసరమని తాజా మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.

కొత్త మార్గదర్శకాలు

ఒక వ్యక్తిలో రక్తపోటు 120/80 కి తక్కువగా ఉంటే అది సాధారణ స్థాయి అని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఇక 130/80 నుండి 139/89 మధ్య ఉంటే ఇది ఫస్ట్ స్టేజ్ హైబీపీగా పేర్కొంటున్నారు. 140/90 లేదా అంతకంటే ఎక్కువ వస్తే, సెకండ్ స్టేజ్ హై బీపీగా వర్గీకరిస్తున్నారు. ఈ స్థితిలో వైద్యుల సూచన అవసరమని పేర్కొంటారు.

గుండె, కిడ్నీ సమస్యలు, మధుమేహం ఉన్నవారికి 130/80 కన్నా మించితే మాత్రం కచ్చితంగా చికిత్స తీసుకోవాల్సిందేనని సూచిస్తున్నారు. ఇతరులకు వారి జీవనశైలి మార్పులతో మూడు నుంచి ఆరు నెలల్లో ప్రయత్నించినా ఫలితం రాకపోతే మాత్రలు అవసరమని చెబుతున్నారు.

చికిత్స విధానం

గతంలో ఒకే మందుతో మొదలుపెడితే, ఇప్పుడుప్రారంభం నుంచే రెండు మందులు వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక గర్భిణీ స్ర్తీల వరకు వచ్చే సరికి బీపీ 140/80 కన్నా మించితే చికిత్స తప్పనిసరి అంటున్నారు.

ఇంటి వద్దే కొలత

హాస్పిటళ్లలో కొలతలు మారవచ్చని, అందుకే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ నాణ్యమైన పరికరాలతో బీపీ చెక్ చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. స్మార్ట్‌వాచ్‌లు పూర్తిగా నమ్మడానికి వీల్లేదనీ స్పష్టంగా చెబుతున్నారు.

ఆహార నియమాలు

రోజువారీ ఉప్పు 1.5 గ్రాముల కంటే ఎక్కువగా తీసుకోవద్దు. కిడ్నీ సమస్యలు లేని వారు ప్రత్యామ్నాయ ఉప్పు వాడవచ్చు. మద్యం పూర్తిగా మానుకోవడం ఉత్తమ మార్గం. అలవాటు ఉంటే పరిమితంగా తాగే ప్రయత్నం చేయాలి. మద్యం అధికంగా తీసుకోవడం ద్వారా రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది.

ఈ పరీక్షలు తప్పనిసరి

అధిక రక్తపోటు ఉన్నవారు మూత్రంలో అల్బుమిన్, క్రియాటినైన్ నిష్పత్తి, ఆల్డోస్టిరాన్, రెనిన్ నిష్పత్తి పరీక్షలు తప్పనిసరి చేయించుకోవాలి. ఇది కిడ్నీ ఆరోగ్యాన్ని, ఆల్డోస్టిరాన్ అధిక ఉత్పత్తి సమస్యలను ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది.

జీవనశైలి మార్పులు

పండ్లు, కూరగాయలు, పప్పులు, నిండు గింజల ఆహారం తీసుకోవాలి

వారానికి కనీసం 75 నిమిషాలు వ్యాయామం తప్పనిసరి

ధూమపానం పూర్తిగా మానాలి

రోజూ 7–9 గంటలు నిద్ర అవసరం

బరువు తగ్గితే రక్తపోటు తగ్గుతుంది

మానసిక ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయాలి

అధిక రక్తపోటు “సైలెంట్ కిల్లర్”. సమయానికి జీవనశైలిలో మార్పులు చేసుకొని అవసరమైతే మందులతో నియంత్రణలో ఉంచితేనే దీర్ఘకాల ఆరోగ్యం సాధ్యమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.