Begin typing your search above and press return to search.

గుండెపోటు - గ్యాస్ నొప్పి... తేడా తెలుసుకోవాల్సిందే!

ఈ మధ్యకాలంలో... మరి ముఖ్యంగా కోవిడ్ అనంతరం గుండెపోటు కు సంబంధించిన వార్తలు ఎక్కువగా వస్తోన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   14 Aug 2023 1:30 PM GMT
గుండెపోటు - గ్యాస్ నొప్పి... తేడా తెలుసుకోవాల్సిందే!
X

ఈ మధ్యకాలంలో... మరి ముఖ్యంగా కోవిడ్ అనంతరం గుండెపోటు కు సంబంధించిన వార్తలు ఎక్కువగా వస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా యువకులు, ఫిట్ గా ఉండేవారు సైతం ఆటలు ఆడుతూ, కసరత్తులు చేస్తూ కూడా హార్ట్ అటాక్ కి గురై బలైపోతున్నారు. ఈ సమయంలో గ్యాస్ పెయిన్, గుండె నొప్పి మధ్య తేడా తెలుసుకొని దాని ప్రకారం రియాక్ట్ కావడం, జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా ముఖ్యం అంటున్నారు నిపుణులు.

అవును.... చిన్న వయసులోనే గుండెనొప్పితో మరణించినవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇలా మృతి చెందినవారిలో గుండెపోటుకు, గ్యాస్ వల్ల వచ్చే నొప్పికి మధ్య తేడా ను గమనించలేకపోతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. గుండెనొప్పిని గ్యాస్ నొప్పి అనుకోవడం.. గ్యాస్ నొప్పిని గుండెనొప్పి అనుకోవడం పెరిగిపోతుందని చెబుతున్నారు.

ప్రస్తుతం మనిషి జీవన విధానంలో ఎంతో మార్పు వచ్చేసింది. పైగా విపరీతంగా మారిపోయిన ఆహారపు అలవాట్ల ఫలితంగా... అజీర్తి, గ్యాస్ లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు నొప్పి వస్తున్నా ఇది నార్మల్ గా వచ్చే నొప్పే కదా అని అనుకుంటున్నారు. ఫలితంగా ఇలాంటి నొప్పి కొన్నిసార్లు గుండెపోటుకు దారితీస్తుంది.

ఈ సమయంలో గుండెపోటుకూ, గ్యాస్ నొప్పికి మధ్య ఉన్న తేడాను ఎలా గుర్తించాలి.. గుండెనొప్పి కి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం...! ఈ విషయాలను పలు సందర్భంల్లో పలువురు నిపుణులు వెల్లడించారని తెలుస్తోంది!

గుండెనొప్పి సమయంలో కొందరికి భుజాల నుంచి తలవరకు నొప్పి వస్తుంది. మరికొందరిలో చెమటలు పట్టడం, ఆవలింతలు రావడం, తేన్పులవంటి లక్షణాలు కనపడతాయి. చాలామంది ఇటువంటి సంకేతాలు కనిపించినప్పటికీ గ్యాస్ వల్లే అనుకుంటూ నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆ సమయంలో తీవ్రత ఎక్కువైతే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

శరీరంలోపల వచ్చే నొప్పి గుండె నొప్పి అయితే ఛాతీతో పాటు ఎడమ చెయ్యి, ఎడమ వైపు బ్యాక్‌ అంతా ఒకేసారి నొప్పి ఉండటంతోపాటు ఛాతీ అంతా బరువుతో కూడిన నొప్పి ఉంటుంది. అయితే గ్యాస్‌ నొప్పి మనం వేలుతో పాయింట్‌ చేసేంత స్థలంలోనే ఉంటుంది. ఓసారి ఓ దగ్గర ఇంకోసారి ఇంకో దగ్గర ఆ నొప్పి ఉంటుంది.

కూర్చున్నప్పుడు ఛాతీలో ఉండే నొప్పి.. పడుకున్నప్పుడు వీపు భాగంలో ఉంటుంది. అనంతరం వెనక్కి వెళ్తుంది. కానీ... కానీ గుండె నొప్పి పడుకున్నా లేచినా ఒకేచోట ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలను పరిగణలోకి తీసుకుని నొప్పి వచ్చినప్పుడు వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.