Begin typing your search above and press return to search.

6 నెలల్లో వెయ్యికి పైగా గుండెపోటు మరణాలు... గుజరాత్ లో ఏమి జరుగుతుంది?

ఇటీవల కాలంలో డ్యాన్స్ చేస్తూనో, ఆటలు ఆడుతూనో ఉన్నపలంగా కుప్పకూలుతున్న వ్యక్తులకు సంబంధించిన సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.

By:  Tupaki Desk   |   2 Dec 2023 5:32 AM GMT
6 నెలల్లో వెయ్యికి పైగా గుండెపోటు  మరణాలు... గుజరాత్  లో ఏమి జరుగుతుంది?
X

ఇటీవల కాలంలో డ్యాన్స్ చేస్తూనో, ఆటలు ఆడుతూనో ఉన్నపలంగా కుప్పకూలుతున్న వ్యక్తులకు సంబంధించిన సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. అలా కుప్పకూలిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకుని వెళ్లడం.. అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందాడని, గుండెపోటే అందుకు కారణమని డాక్టర్లు చెప్పడం కూడా రొటీన్ అయిపోయింది! ఈ సమయంలో ఇలాంటి మరణాలు గడిచిన ఆరునెలల్లో 1,000 దాటేశాయని గుజరాత్ మంత్రి చెబుతున్నారు.

అవును... గుజరాత్‌ రాష్ట్రంలో గడిచిన ఆరు నెలల కాలంలో గుండెపోటు కారణంగా సుమారు 1,052 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇదే షాకింగ్ న్యూస్ అంటే... మరొక షాకింగ్ న్యూస్ కూడా చెప్పింది. అదేమిటంటే... ఇలా గుండెపోటుతో మరణించిన వారిలో 80 శాతం మంది 11-25 ఏళ్ల మధ్య వయసు వారేనట!

వాస్తవానికి ఎవరికైనా హఠాత్తుగా గుండెపోటు వస్తే వెంటనే సీపీఆర్ (కార్డియోపల్మోనరీ రిససిటేషన్) చేయాలని చెబుతుంటారు. ఈ ప్రథమ చికిత్స వల్ల ప్రయోజనం చాలా ఉంటుంది! దీంతో... గుండెపోటు ఘటనలు పెరుగుతోన్న నేపథ్యంలో దాదాపు 2 లక్షల మంది టీచర్లు, కాలేజీ ప్రొఫెసర్లకు సీపీఆర్‌ పై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది.

తాజాగా ఈ విషయాలపై స్పందించిన గుజరాత్‌ విద్యాశాఖ మంత్రి కుబేర్‌ డిండోర్‌... గుండెపోటుతో ఆరు నెలల్లో 1,052 మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. వారిలో సుమారు 80 శాతం మంది 11-25 ఏళ్ల మధ్య వయసువారే అనే విషయం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. పైగా ఈ విద్యార్థులు, యువకులు ఊబకాయులు కూడా కాదని స్పష్టం చేశారు.

ఇలా బాధితుల్లో ఎక్కువమంది చిన్నవయసు వారే ఉండటంతో గుండెపోటుపై యువకుల్లో ఆందోళన వ్యక్తమవుతోందని అన్నారు. ఇదే క్రమంలో... గుండె సంబంధిత కారణాలతో రోజుకు సగటున 173 ఎమర్జెన్సీ కాల్స్‌ సంబంధిత విభాగానికి వస్తున్నాయని వెల్లడించారు. ఇటీవల కాలంలో క్రికెట్‌ ఆడుతూ.. గార్బా నృత్యం చేస్తూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని విద్యాశాఖ మంత్రి పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో టీచర్లు, కాలేజీ ప్రొఫెసర్లు సీపీఆర్‌ పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. ఈ సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఉపాధ్యాయులందరూ పాలుపంచుకోవాలని ఆయన సూచించారు. ఈ శిక్షణ తీసుకోవడం ప్రమాదంలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. ఈ శిక్షణలో 2,500 మంది వైద్య నిపుణులు పాల్గొంటారని మంత్రి వెల్లడించారు.