Begin typing your search above and press return to search.

గుండెపోటు ప్రమాదంలో కోవిడ్ రోగులు... కేంద్ర ఆరోగ్య మంత్రి కీలక వ్యాఖ్యలు!

అవును... వయసుతో సంబంధం లేకుండా, ఇటీవల వరుసగా సంభవిస్తున్న గుండెపోటు మరణాలపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌ సుఖ్‌ మాండవీయ స్పందించారు.

By:  Tupaki Desk   |   31 Oct 2023 2:30 AM GMT
గుండెపోటు ప్రమాదంలో కోవిడ్  రోగులు... కేంద్ర ఆరోగ్య మంత్రి కీలక వ్యాఖ్యలు!
X

ఇటీవలి కాలంలో గుండెపోటుకు గురై అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళన రేపుతున్న సంగతి తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా... ఈ మరణాలు అర్ధాంతరంగా సంభవిస్తున్నాయి. జిం చేస్తూ, డ్యాన్స్ చేస్తూ, మైదానంలో ఆటలు ఆడుతూ అర్ధాంతరంగా చనిపోతున్నవారి వార్తలు ఇటీవల ఆందోళన కలిగిస్తున్నాయి. కోవిడ్ తర్వాతే ఈ పరిస్థితి అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి స్పందించారు.

అవును... వయసుతో సంబంధం లేకుండా, ఇటీవల వరుసగా సంభవిస్తున్న గుండెపోటు మరణాలపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌ సుఖ్‌ మాండవీయ స్పందించారు. ఇందులో భాగంగా... కొవిడ్‌-19 కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై కోలుకున్నవారు.. ఒకటి నుంచి రెండేళ్లపాటు ఎక్కువ శ్రమపడకూడదని, శరీరానికి విపరీతమైన అలసట వచ్చే పనులుచేయొద్దని సూచించారు. దీనివల్ల కార్డియాక్‌ అరెస్ట్‌ ముప్పు నుంచి బయటపడొచ్చని సూచించారు.

ఈ మేరకు భారత వైద్య పరిశోధన మండలి (ఐ.సీ.ఎం.ఆర్) అధ్యయనాన్ని ఉదహరించిన కేంద్రమంత్రి మాండవీయ... ఈ నివేదిక ప్రకారం కొవిడ్‌-19 కారణంగా తీవ్రంగా బాధపడి కోలుకున్నవారు.. గుండెపోటు బారిన పడకుండా ఉండాలంటే కనీసం రెండేళ్లపాటు ఒత్తిడితో కూడిన పనులు చేయడం, పరిగెత్తడం, కఠినమైన వ్యాయామాలు చేయడం వంటివాటికి దూరంగా ఉండాలని సూచించారు.

కొద్దిరోజుల క్రితం గుజరాత్‌ లో దసరా పండగ సందర్భంగా గర్బా నృత్యం చేస్తూ పది మందికి పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ మరణాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ... గుజరాత్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రుషికేష్ పటేల్‌ ఈ సమావేశం నిర్వహించారు. ఇందులో వైద్య నిపుణులు, కార్డియాలజిస్ట్‌ లతో పాటు కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి మన్‌ సుఖ్‌ మాండవీయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.

కాగా... ఇటీవల నవరాత్రుల సందర్భంగా గర్బా నృత్యం చేస్తూ గుజరాత్‌ రాష్ట్రం ఖేడా జిల్లాలోని క‌ప‌ద్వంజ్‌ లో 17 ఏళ్ల యువకుడు అకస్మాత్తుగా అస్వస్థతకు గురవ్వగా.. అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ యువకుడు గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు చెప్పారు. ఇదే క్రమంలో... వడోదర జిల్లాలోని దభోయిలో 13 ఏళ్ల బాలుడు, 28 ఏళ్ల యువకుడు, 55 ఏళ్ల వ్యక్తి కూడా గర్బా నృత్యం చేస్తూ గుండెపోటుతో మృతిచెందినట్లు వార్తలొచ్చాయి.

దీంతో వయసుతో సంబంధం లేకుండా.. ఆరోగ్య పరిస్థితులతో, అలవాట్లతో సంబంధం లేకుండా.. ఇలా అర్ధాంతరంగా డ్యాన్స్ చేస్తూ, వ్యాయామం చేస్తూ, పనిచేస్తూ ఉన్నపలంగా కుప్పకూలిపోతున్న ఘటనలు ఎందుకు సంభవిస్తున్నాయనే చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. అయితే.. కోవిడ్ అనంతరం ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయనే కథనాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు!