Begin typing your search above and press return to search.

కరోనా బారిన పడి వారానికి పైనే సిక్ అయ్యారా? అయితే చదవాల్సిందే

ఈ రీసెర్చ్ మొత్తం కరోనా బారిన పడి.. వారానికి పైగా మంచానికే పరిమితమైన వారు.. తర్వాతి రోజుల్లో వారి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయన్న దానిపై పెద్దఎత్తున అధ్యయనం చేశారు.

By:  Tupaki Desk   |   28 Oct 2023 2:30 PM GMT
కరోనా బారిన పడి వారానికి పైనే సిక్ అయ్యారా? అయితే చదవాల్సిందే
X

తక్కువ వ్యవధిలో ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా మహమ్మారి కారణంగా కోట్లాది మంది సిక్ కావటం తెలిసిందే. లక్షలాది ప్రాణాలు తీసిన కొవిడ్ అంతులేని వేదనను.. విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. కరోనా పడగనీడ ఇప్పుడు అంతగా లేకున్నా.. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా అలాంటి పరిశోధనకు సంబంధించిన రిపోర్టు బయటకు వచ్చింది.

ఈ రీసెర్చ్ మొత్తం కరోనా బారిన పడి.. వారానికి పైగా మంచానికే పరిమితమైన వారు.. తర్వాతి రోజుల్లో వారి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయన్న దానిపై పెద్దఎత్తున అధ్యయనం చేశారు. ఇందుకోసం భారీ శాంపిల్ చేపట్టి.. వారు వెల్లడించిన వివరాల్ని విశ్లేషించిన సందర్భంగా ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. వారానికి పైగా కొవిడ్ తో ఇబ్బంది పడిన వారిలో ఎక్కువమంది కనీసం రెండేళ్ల పాటు విపరీతమైన ఒంటి నొప్పులతో పాటు పలు ఇబ్బందులకు గురైనట్లుగా వెల్లడైంది.

లాంగ్ కొవిడ్ లక్షణాలు ఉన్న వారిలో ఆడ.. మగ అన్న తేడా లేదంటున్నారు. అందరిలోనూ ఇది సమానంగా కనిపించినట్లుగా వెల్లడైంది. అదే సమయంలో కరోనా బారిన పడి.. ఆసుపత్రిలో చేరి.. అక్కడే రెండు నెలలకు పైనే ఉండి.. రికవరీ అయిన వారిలో ఇలాంటి లక్షణాలు మరింత ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తించారు. ఈ తరహా అధ్యయనం కోసం స్వీడన్.. నార్వే.. డెన్మార్క్.. ఐస్ లాండ్ కు చెందిన 64,880 మంది వయోజనులను శాంపిల్ కింద తీసుకున్నారు.

ఈ అధ్యయనంలో పాల్గొన్న వారంతా 2020ఏప్రిల్ నుంచి 2022 ఆగస్టు మధ్య కాలంలో కొవిడ్ తరహాలో పలు శారీరక సమస్యల్ని ఎదుర్కొన్న వారే కావటం గమనార్హం. అధ్యయనంలో పాల్గొన్న వారంతా పూర్తిగా లేదంటే పాక్షికంగా కరోనా టీకాలు వేయించుకున్న వారే. వీరిలో 22 వేలకు పైగా కరోనా బారిన పడిన సమయంలో దాంతో ఇబ్బంది పడినవారే. వీరిలో 10 శాతం మంది కనీసం వారం.. గరిష్ఠంగా అంతకు మించిన సమయం మంచంలోనే గడిపిన వారే.

కరోనా బారిన పడిన మిగిలినవారితో పోలిస్తే.. మంచాన పడ్డన వారిలో లాంగ్ కొవిడ్ లక్షణాలు ఎక్కువగా కనిపించాయి. వారు ఇబ్బందిపడ్డ లక్షణాల్లో ఎక్కువగా శ్వాస ఆడకపోవటం.. ఛాతీనొప్పి.. తల తిప్పటం.. తలనొప్పి లాంటి లక్షణాలు ఉన్నాయి. మరో షాకింగ్ నిజం ఏమంటే.. కొవిడ్ బారిన పడిన వారిలో కనీసం 10-20 శాతం మందిలో లాంగ్ కొవిడ్ తలెత్తినట్లుగా గుర్తించారు. కొవిడ్ బారిన పడి.. బాధ పడిన వారు తమ శారీరక సమస్యలకు సంబంధించి కనీసం రెండేళ్ల పాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాల్సిన అవసరం ఉందన్న సూచన పలువురు నిపుణులు చేస్తున్నారు. సో.. కరోనా బారిన పడి.. ఆరోగ్యంగా ఉన్నామని మితిమీరిన ఆత్మవిశ్వాసానికి పోకుండా.. ఎప్పటికప్పుడు ఆరోగ్యం విషయంలో అప్రమత్తత చాలా అవసరమన్నది మర్చిపోవద్దు.