Begin typing your search above and press return to search.

కళ్ల కలకలు స్టార్ట్... ఈ జాగ్రత్తలు తీసుకోండి!

వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటంతో ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంద

By:  Tupaki Desk   |   29 July 2023 5:53 AM GMT
కళ్ల కలకలు స్టార్ట్... ఈ జాగ్రత్తలు తీసుకోండి!
X

ప్రస్తుతం కళ్లకలకల సీజన్ నడుస్తోంది. ఇందులో భాగంగా... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని అనేక రాష్ట్రాలలో ప్రజలు "ఐ ఫ్లూ"తో ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భంగా ఈ ఫ్లూ ఎందుకు వస్తుంది.. లక్షణాలేమిటి.. తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏమిటి.. తగ్గాలంటే చేయాల్సిన పని ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం!

వైరస్, బ్యాక్టీరియా, అలర్జీల వల్ల కళ్ల కలకలు వస్తుంటాయని అమెరికాలోని “సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్” (సీడీసీ) చెప్తోంది. ఒక్కోసారి కంట్లో ఏవైనా రసాయనాలు పడినా, గాలి కాలుష్యం వల్ల, ఫంగస్‌ వల్ల, కొన్ని రకాల పరాన్నజీవుల వల్ల కూడా కలకలు వస్తాయని సీడీసీ చెప్తోంది.

"ఐ ఫ్లూ"ను వైద్య పరిభాషలో కంజంక్టివైటిస్ అంటారు. వాడుక భాషలో కళ్ల కలకలు అంటుంటారు. ఐఫ్లూ సోకిన వారి కళ్లు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారుతాయి. దీంతో దీనికి "పింక్ ఐ" అని కూడా అంటారు. కళ్లలో మంట, కంటి నుంచి నీరు కారడం, నిద్ర లేచేసరికి రెప్పలు అతుక్కోవడం, కళ్లలో పుసి ఏర్పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

సాధారణంగా వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటంతో ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటుంటారు. బ్యాక్టీరియా వల్ల వచ్చే ఐ ఫ్లూ చాలా వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఐఫ్లూతో బాధపడుతున్నవారి కళ్లలోకి చూసినా వస్తుందని చాలా మంది భావిస్తుంటారు.. సాధారణంగా అలాంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు. ఐ ఫ్లూ ఉన్నవారు ఉపయోగించిన టవళ్లు, రుమాళ్లు ఇతరులు వాడకుండా జాగ్రత్త పడాలి.

ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా... నీళ్లు కాచి, చల్లార్చి కాస్త దూదిని ఆ నీటిలో ముంచి కళ్లను వీలైనంత నెమ్మదిగా శుభ్రం చేసుకోవాలి.. చేతులు తరచూ సబ్బుతో కడుక్కోవాలి. శభ్రమైన, ఉతికిన టవల్స్ లేదా కర్చీఫ్‌ లు మాత్రమే వాడాలని సూచిస్తున్నారు.

తగ్గేవరకు కళ్లజోడు పెట్టుకోవాలని చెబుతున్నారు. వీలయితే పవర్‌ లేని కళ్లజోడు వాడే ప్రయత్నం చేయండి. ఎవరైనా కాంటాక్ట్‌ లెన్సులు వాడేవారు వాడకపోవడం.. కళ్లు ఇలా ఇబ్బందులు పడుతున్నప్పుడు ప్రయాణాలు చేయకపోవడంతోపాటు పూర్తి విశ్రాంతితో ఉండటంతోపాటు ఫోన్లు, టీవీలు చూడవద్దని సూచిస్తున్నారు వైద్యులు.

కానీ కళ్లల్లో విపరీతమైన నొప్పి, దురద, బాగా ఎరుపెక్కి మంట ఎక్కువవుతుందంటే మాత్రం కచ్చితంగా డాక్టర్‌ ను సంప్రదించాలని సూచిస్తున్నారు.