ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్ ఫీవర్స్, డెంగీ ఫీవర్ సీజన్స్ నడుస్తున్న సంగతి తెలిసిందే. దోమల వల్ల వచ్చే ఈ వ్యాది వల్ల ప్లేట్ లెట్స్ పడిపోవడం, ప్రాణాపాయ స్థితికి చేరుకోవడం జరుగుతుంటుంది. దీంతో... ఈ సీజన్ లో కాస్త ఫీవర్ రాగానే హాస్పటల్ కి చూపించుకోవడం, వైద్యుల సలహాతో బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం చేస్తున్నారు. ఈ నేపథ్యలో ఈ డెంగీ భయంతో ఒక వ్యక్తి దోమలను ఆస్పత్రికి తీసుకొచ్చాడు.
అవును... దోమలు కుడితే డెంగీ వ్యాది వస్తుందనే భయంతో ఒక వ్యక్తి కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇందులో భాగంగా తనను కుట్టిన దోమలన్నింటినీ సేకరించి ఆస్పత్రికి తీసుకొచ్చాడు. దీంతో డాక్టర్ తో సహ అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఆశ్యర్చపోయారు. ఈ సంఘటన స్థానికంగా వైరల్ గా మారింది.
వివరాళ్లోకి వెళ్తే... పశ్చిమ బెంగాల్ లో డెంగీ కేసులు భారీగా పెరుగుతున్నాయట. దీంతో పుర్బా బర్దామన్ జిల్లాలోని మంగళకోట్ కు చెందిన మన్సూర్ అలీ షేక్... డెంగీ గురించి భయాందోళనకు గురయాడు. చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న మన్సూర్ అలీ... తన దుకాణం పక్కన నిల్వ ఉన్న నీటిలో దోమల బెడద పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశాడు.
దీంతో అతడు భయంతో తనను కుట్టిన దోమలన్నింటినీ సేకరించే పనికి పూనుకున్నాడు. అలా తనకు కుట్టిన దోమలన్నింటినీ సేకరించి ఓ ప్లాస్టిక్ కవర్ లో వేశాడు. అనంతరం ఆ కవర్ పట్టుకుని నేరుగా స్థానిక ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో డాక్టర్ ను కలిసిన మున్సూర్...తాను తెచ్చిన దోమలను పరీక్షించి ముందస్తుగా తనకు వైద్యం చేయాలంటూ కోరాడు.
దీంతో ఈ ఊహించని పరిణామానికి అక్కడున్న డాక్టర్ సహా పేషెంట్లూ, స్టాఫ్ కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ ముందు జాగ్రత్తలకు ముక్కున వెళేసుకున్నారట. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై స్పందించిన స్థానిక అధికారులు తక్షణమే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తామని హామీ ఇచ్చారట. దీంతో స్థానికంగా ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది. ఆ విధంగా అయినా అధికారులు కదిలారనే గుసగుసలు వినిపిస్తున్నాయంట.