దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్లు.. ఆస్పత్రులకు కీలక ఆదేశాలు!
గతంలో ప్రపంచాన్ని వణికించి వదిలిన కరోనా వైరస్ నుంచి తేరుకొని లక్షల కుటుంబాలు కాస్త ఉపశమనంగా ఉన్నాయి అని అంటున్నారు.
By: Tupaki Desk | 24 May 2025 3:28 PM ISTగతంలో ప్రపంచాన్ని వణికించి వదిలిన కరోనా వైరస్ నుంచి తేరుకొని లక్షల కుటుంబాలు కాస్త ఉపశమనంగా ఉన్నాయి అని అంటున్నారు. నాడు కోల్పోయిన కుటుంబ సభ్యులు మిగిల్చిన దూరాన్ని కాస్త సర్దుకుని ఉంటున్నారని చెబుతున్నారు! ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి పంజా విసురుతోంది కరోనా వైరస్! ఈ సందర్భంగా దేశంలో కొత్త వేరియంట్లతో ముంచుకొస్తుందని అంటున్నారు.
అవును... కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది. ఇందులో భాగంగా.. దేశంలోని పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా పట్టణాల్లో కొత్త కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని అంటున్నారు. ఈ సందర్భంగా... కోవిడ్ కొత్త వేరియంట్లు ఎన్.బీ.1.8.1, ఎల్.ఎఫ్.7 లను భారత్ లో గుర్తించినట్లు ఇండియన్ సర్స్-కోవ్-2 జినోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకాగ్) తాజాగా వెల్లడించింది.
వీటిలో ఎన్.బీ.1.8.1 రకం కేసు ఏప్రిల్ లో వెలుగుచూడగా.. ఎల్.ఎఫ్.7 రకానికి సంబంధించిన కేసులను మే నెలలో గుర్తించినట్లు ఇన్సాకాగ్ తెలిపింది. ఈ సమయంలో... ముక్కు కారడం, జలుబు, గొంతునొప్పి, తలనొప్పి, నీరసం వంటి స్వల్ప లక్షణాలు కనిపిస్తాయని.. బాధితులు నాలుగు రోజుల్లోనే కోలుకుంటున్నారై వైద్య నిపుణులు చెబుతున్నారు!
ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీతో పాటు కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలో కేరళలో మే నెలలో ఇప్పటివరకూ 182 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోపక్క గత మూడేళ్లలో తొలిసారిగా దేశ రాజధాని ఢిల్లీలో 23 మందికి వైరస్ సోకిందని అంటున్నారు.
దీంతో... ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా... ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, టెస్టింగ్ కిట్లు, వ్యాక్సిన్ల లభ్యత సరిచూసుకోవాలని సూచించింది. దీంతో.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆసుపత్రులను అప్రమత్తం చేశాయి. ప్రభుత్వ ఆసుపత్రులు టెస్టింగ్ కిట్లు, బెడ్లు, ఆక్సిజన్ సిలెండర్ల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి.
కాగా.. ఇటీవల కాలంలో ఆసియా దేశాలు.. మరి ముఖ్యంగా చైనాతో పాటు సింగపూర్, థాయిలాండ్, హాంకాంగ్ లలో కోవిడ్ - 19 వ్యాప్తి విపరీతంగా ఉందంటూ కథనాలొస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వారానికి వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి!