Begin typing your search above and press return to search.

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, ముంబైలో ఇద్దరు మృతి.. అసలేంటి జేఎన్.1.. దాని లక్షణాలేంటి ?

కరోనా మహమ్మారి మళ్ల కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కేసుల సంఖ్య భారీగా లేకపోయినా, స్వల్పంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

By:  Tupaki Desk   |   20 May 2025 3:24 PM IST
COVID Cases Rise Again in India JN.1 Variant Raises
X

కరోనా మహమ్మారి మళ్ల కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కేసుల సంఖ్య భారీగా లేకపోయినా, స్వల్పంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మే 19 నాటికి దేశవ్యాప్తంగా 257 యాక్టివ్ కొవిడ్ కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిణామంపై ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ముంబైలో పెరుగుతున్న కేసులతో పాటు, ఇద్దరు కోవిడ్ రోగులు మరణించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ముంబై మహానగరంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం స్థానిక ప్రభుత్వాన్ని ఆందోళన పరుస్తోంది. ఇప్పటివరకు ముంబై పరిధిలో 53 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాదు, కోవిడ్ సోకిన ఇద్దరు రోగులు మరణించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే, మరణించిన ఇద్దరు రోగుల ఆరోగ్యం ముందు నుంచే విషమంగా ఉందని, ఒకరికి నోటి క్యాన్సర్, మరొకరికి నెఫ్రోటిక్ సిండ్రోమ్ వంటి తీవ్రమైన అనారోగ్యాలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. వీరు ముంబైలోని ప్రముఖ కేఈఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ముంబై మహానగర పాలికా ఆసుపత్రుల్లో కరోనా రోగుల కోసం ఇప్పటికే స్పెషల్ బెడ్స్, ఐసీయూలు, ఐసోలేషన్ రూమ్స్ ఏర్పాటు చేశారు. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య విభాగం కోవిడ్-19 వ్యాప్తిని నియంత్రించడానికి నిరంతరం పర్యవేక్షిస్తోంది. జనవరి 2025 నుండి ఏప్రిల్ 2025 వరకు కోవిడ్ రోగుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పటికీ, మే నెల నుండి కేసుల్లో పెరుగుదల కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. అయినప్పటికీ, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

జేఎన్.1 ఆందోళనకరం

ప్రస్తుతం మన దేశంలో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే, హాంకాంగ్, సింగపూర్ వంటి దేశాల్లో కొవిడ్ విజృంభణకు ఎల్ఎఫ్.7 (LF.7), ఎన్‌బీ.1.8 (NB.1.8) అనే కరోనా వేరియంట్లు కారణమని నిపుణులు గుర్తించారు. ముఖ్యంగా, ఈ రెండు వేరియంట్లు కూడా జేఎన్.1 (JN.1) అనే మరో కొత్త వేరియంట్ నుంచి ఉద్భవించినవే కావడం గమనార్హం.

జేఎన్.1 వేరియంట్ అంటే ఏమిటి?

జేఎన్.1 వేరియంట్ అనేది ఒమిక్రాన్ బీఏ.2.86 (Omicron BA.2.86) వేరియంట్ నుంచి పుట్టుకొచ్చింది. దీన్ని తొలిసారిగా 2023 ఆగస్టు నెలలో గుర్తించారు. గతంలో వచ్చిన వేరియంట్లతో పోలిస్తే, ఒకటి, రెండు అదనపు మ్యూటేషన్లు కారణంగా ఈ వేరియంట్‌కు వేగంగా వ్యాపించే సామర్థ్యం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల, ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని సులభంగా ఛేదించి ఇన్‌ఫెక్షన్ కలుగజేస్తుంది. జేఎన్.1 వేరియంట్ సోకిన వారిలో సాధారణంగా పొడి దగ్గు, రుచి కోల్పోవడం, తలనొప్పి, ముక్కు దిబ్బడ, తీవ్రమైన అలసట, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా, ఈ వేరియంట్ బారిన పడిన కొందరిలో డయేరియా (విరేచనాలు) కూడా ఎక్కువగా కనిపిస్తోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

అయితే, ప్రస్తుతం భారత్‌లో పరిస్థితి నిలకడగానే ఉందని ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిన్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) నేతృత్వంలో కొవిడ్ పరిస్థితిని సమీక్షించేందుకు అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వెల్లడైన వివరాల ప్రకారం.. నమోదవుతున్న కేసుల్లో వ్యాధి లక్షణాలు చాలా వరకు ఓ మోస్తరుగానే ఉన్నాయని, బాధితులు ఆసుపత్రిలో చేరాల్సినంత తీవ్రత లేదని విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. అయినప్పటికీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

* మాస్క్ ధరించడం: రద్దీ ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం మంచిది.

* చేతులు శుభ్రం చేసుకోవడం: తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవడం లేదా శానిటైజర్ వాడటం.

* సామాజిక దూరం పాటించడం: ఇతరుల నుంచి కనీసం 6 అడుగుల దూరం పాటించడం.

* లక్షణాలు ఉంటే పరీక్షలు: జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోండి.

* వ్యాక్సినేషన్: బూస్టర్ డోసులు తీసుకోవడం వల్ల వైరస్ తీవ్రత నుంచి రక్షణ పొందవచ్చు.