Begin typing your search above and press return to search.

క్యాన్సర్ భూతానికి మసాలాలతో మందు.. ఐఐటీ చెన్నై కసరత్తు

ఈ మహమ్మారిపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నప్పటికీ.. ఆశించినంత ఫలితాలు సాధించింది లేదు. రోజులు గడిచే కొద్దీ క్యాన్సర్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   26 Feb 2024 4:29 AM GMT
క్యాన్సర్ భూతానికి మసాలాలతో మందు.. ఐఐటీ చెన్నై కసరత్తు
X

చెక్క.. లవంగాలు.. జాజికాయి.. జాపత్రి.. అనాపువ్వు.. ఇలా చెప్పుకుంటూ పోతుంటే.. మీకు గుర్తుకు వచ్చేది వంటింట్లో ఉండే మసాలాల సంగతి ఇప్పుడెందుకు? అన్న సందేహం రావొచ్చు. వంటింట్లో ఒక డబ్బాలో ఉండే ఈ దినుసుల పవర్ ను గుర్తించారు ఐఐటీ చెన్నైకు చెందిన పరిశోధకులు. దాని ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. ఇంతకూ వీటితో ఏం చేస్తున్నారంటే.. దశాబ్దాలు గడుస్తున్నా.. చెక్ పెట్టే విషయంలో వ్యయప్రయాసలకు గురి చేసే క్యాన్సర్ భూతానికి విరుగుడు దిశగా అడుగులు వేస్తున్నారు.

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా ఇటీవల కాలంలో క్యాన్సర్ కేసులు అంతకంతకూ ఎక్కువ అయిపోతున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారిపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నప్పటికీ.. ఆశించినంత ఫలితాలు సాధించింది లేదు. రోజులు గడిచే కొద్దీ క్యాన్సర్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గతానికి భిన్నంగా అన్ని వర్గాల్ని ఈ భూతం ఆవహిస్తోంది. మారిన జీవనశైలి పుణ్యమా అని క్యాన్సర్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. తొలిదశలో క్యాన్సర్ ను గుర్తిస్తే దాని నుంచి బయటపడొచ్చని చెబుతున్నా.. వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి.

క్యాన్సర్ కు చికిత్స కోసం భారతీయ మసాలా దినుసుల్నిఉపయోగించేందుకు ఐఐటీ మద్రాస్ పరిశోధకులు కసరత్తు చేస్తూ.. ఈ అంశంపై పేటెంట్ పొందారు. భారతీయ మసాలాలతో రూపొందించిన నానో ఔషధాలకు క్యాన్సర్ పై పోరాడే సామర్థ్యం ఉందన్న విషయాన్ని సైంటిస్టులు సైతం ఒప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తులు.. రొమ్ము.. పేగు.. గర్భాశయ ముఖద్వారం.. గొంతు లాంటి భాగాల్లో తిష్ఠ వేసే క్యానర్లపై ఈ మసాలాల ఔషధాలు ప్రభావాన్ని చూపుతాయని చెబుతున్నారు.

ఈ ఔషధం ఆరోగ్యకర కణాల జోలికి వెళ్లదని చెబుతున్నారు. ఇప్పటికే వీటిని జంతువులపై ప్రయోగించటం.. అవి సక్సెస్ కావటం జరిగింది. మనుషులపై వీటి సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ప్రణాళికల్ని రూపొందిస్తున్నారు. అయితే.. వీటికి ఎంత ధర నిర్ణయించాలన్న దానిపైనా కసరత్తు జరుగుతోంది. భారతీయ మసాలాల నుంచి సేకరించే నూనెలతో అద్భుతాలు చేసే వీలుందని. కాకుంటే వాటిని శరీరంలో టార్గెట్ చేసిన ప్రాంతానికి చేరేలా చేయటమే అతి పెద్ద సమస్య. ఈ పరిమితిని అధిగమించే విషయంలో విజయం సాధించకపోవటంతో వాటిని ఔషధాలుగా అందుబాటులోకి రావటం లేదు.

అయితే.. ఈ పరిమితిని నానో ఎమల్షన్ ద్వారా సమర్థంగా అదిగమించొచ్చని.. ఇప్పటికే దీన్నితమ ల్యాబ్ లో మెరుగుపర్చినట్లుగా ఐఐటీ మద్రాస్ లోని రసాయన ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఆర్ నాగరాజన్ వెల్లడించారు. సంప్రదాయ క్యాన్సర్ చికిత్సతో పోలిస్తే నానో ఔషధాలతో అనేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. మసాలా దినుసుల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉన్న నేపథ్యంలో ఈ ఔషధాల్ని తక్కువ ధరకు అందించే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.