రిపోర్టు: క్యాన్సర్ కేసులు అంతలా పెరుగుతున్నాయి
అంతకంతకూ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలపై ఈ మహమ్మారి పంజా విసురుతోంది.
By: Garuda Media | 27 April 2026 11:02 AM ISTఅంతకంతకూ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలపై ఈ మహమ్మారి పంజా విసురుతోంది. రొమ్ము క్యాన్సర్ కేసుల్లో అత్యధిక శాతం వ్యాధి ముదిరిన తర్వాతే గుర్తిస్తున్న విషయాన్ని తాజాగా ఒక రిపోర్టు వెల్లడించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ డేటా ఆధారంగా నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎన్ సీడీ ఎపిడెమియాలజీ బెంగళూరు పరిశోధకులు దీన్ని నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాల్ని ప్రఖ్యాత వైద్య పత్రిక ది లాన్సెట్ లో పబ్లిష్ అయ్యింది.
ఇందులో పేర్కొన్న వివరాల ప్రకారం దేశంలో మహిళలపై క్యాన్సర్ మహమ్మారి విరుచుకుపడుతోంది. రొమ్ము క్యాన్సర్ కేసుల్లో అత్యధికం వ్యాధి ముదిరిన తర్వాతే గుర్తించటం. అంతేకాదు.. ఇతర అవయువాలకు వ్యాప్తి చెందిన తర్వాతే గుర్తించే పరిస్థితి ఉందని పేరకొంది. దీంతో చికిత్సతో పాటు కోలుకోవటం కష్టమవుతుందని చెబుతున్నారు. వ్యాదిని ఆలస్యంగా నిర్దారించటంతో శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తున్న పరిస్థితిని ఈ రిపోర్టు కళ్లకు కట్టేలా చేసింది.
ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే క్యాన్సర్ సమగ్ర స్క్రీనింగ్ ను పెంచటం ద్వారా ముప్పు తప్పించొచ్చన్న మాట వినిపిస్తోంది. ప్రభుత్వ రంగంలో కంటే ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాధి నిర్దారణ యాభై శాతం వేగంగా.. ఎన్ జీవో ఆసుపత్రుల్లో 68 శాతం అధిక వేగంగా జరుగుతున్నట్లు పేర్కొంది. దేశ వ్యాప్తంగా 71 ఆసుపత్రుల నుంచి సుమారు 76వేలకు పైనే మహిళల డేటాను విశ్లేషించారు. ఈ డేటా మొత్తం 2009-2020 మధ్య కాలం నాటిదిగా పేర్కొన్నారు.
సుమారు 12.9 శాతం కేసుల్లో తొలిసారి క్యాన్సర్ నిర్ధారణసమయంలోనే.. మెటాస్టాటిక్ దశలో ఉన్నట్లుగా గుర్తించారు. ఇందులో ఎక్కువగా ఎముకలకు క్యాన్సర్ వ్యాప్తి చెందినట్లుగా గుర్తించారు. భారత్ లో సాధారణంగా క్యాన్సర్ 40 ఏళ్ల వయసు దాటిన తర్వాతే నిర్దారణ అవుతున్నట్లుగా పేర్కొన్నారు. అదే సమయంలో మహిళల విషయానికి వస్తే పోస్ట్ మెనోపాజ్ మహిళల్లో ముప్పు మరింత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
మెడ దిగువ భాగంలో గడ్డలా ఉండటం.. నొప్పి లేకుండా గుండ్రంగా ఉండటంతో పాటు నొప్పి లేదంటే అసౌకర్యంగా అనిపిస్తే మాత్రం డాక్టర్ ను సంప్రదించటం తప్పనిసరిగా పేర్కొంటున్నారు. 2022లో ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నమోదైన క్యాన్సర్ కేసులు 23 లక్షలు అయితే మరణించిన వారు ఆరేడు లక్షల మంది. 2050 నాటికి ఏటా కొత్తగా నమోదయ్యే బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు 13 లక్షలుగా అంచనా వేస్తున్నారు. క్యాన్సర్ సంబంధిత మరణాల్లో 15.5 శాతం రొమ్ము క్యాన్సర్లదే కావటం గమనార్హం. మెట్రో నగరాల్లో రొమ్ము క్యాన్సర్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటే.. పట్టణాలు.. గ్రామీణ ప్రాంతాల్లోనే కేసుల నమోదు ఎక్కువ అవుతోంది.
స్వీయ పరీక్ష ఎలా చేసుకోవాలంటే..
- 40 ఏళ్లు దాటిన మహిళలు ఏడాదికి ఒకసారి రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ చేపట్టాల్సి ఉంటుంది. అదే సమయంలో ప్రతి నెలా స్వీయ పరీక్ష చేసుకోవటం ద్వారా ముప్పును ముందు గుర్తించే వీలు ఉంటుంది. రొమ్ములను చేతులతో ఎవరికి వారే పరీక్షగా చేతులతో పరీక్షించుకోవాలి.
- రొమ్ములో ఎక్కడైనా గడ్డలు ఉన్నాయా? అన్నది చూసుకోవాలి. ఒకవేళ గడ్డలు ఉన్నట్లు గుర్తించినప్పుడు నొప్పి లేదని తేలిగ్గా తీసుకోకూడదు. వైద్యుడ్ని సంప్రదించటం ఉత్తమం.
- ఒకవేళ చనమొనల నుంచి రక్తం కారణం చాలా సీరియస్ అంశం. చనుమొనల చుట్టూ చర్మం షేప్ లో మార్పు.. అవి ఒక పక్కకు వంగినట్లుగా అనిపించటం లాంటివి చిన్న చిన్న మార్పుల్ని తరచూ చెక్ చేసుకోవటం ద్వారా గుర్తించొచ్చు.
- ఇలాంటి ఏ అంశాల్ని గుర్తించినా వైద్యుడ్ని సంప్రదించటం ఉత్తమం.
