గబ్బిలం కరిచి వ్యక్తి మృతి... తెరపైకి ప్రాణాంతక వైరస్!
కాగా... ఆస్ట్రేలియన్ బ్యాట్ లైసా వైరస్ (ఏ.బీ.ఎల్.వీ) అనేది ఆస్ట్రేలియన్ గబ్బిలాలలో కనిపించే అరుదైన, ప్రాణాంతకమైన వైరస్.
By: Tupaki Desk | 4 July 2025 12:00 AM ISTవైద్యశాస్త్రం ఎంత అభివృద్ధి చెందుతూ ఉందో, దానికి తగ్గట్లుగా, దాన్ని మరింత ఛాలెంజ్ చేస్తున్నట్లుగా కొత్త కొత్త వైరస్ లు పుట్టుకొస్తూనే ఉంటున్నాయి.. మనిషి మనుగడను ప్రశ్నార్థక చేస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో తాజాగా గబ్బిలం కరిచి ఓ వ్యక్తి మరణించిన సంఘటన తెరపైకి వచ్చింది. కొన్ని నెలల క్రితం ఇతన్ని గబ్బిలం కరవడంతో అరుదైన వైరస్ సోకినట్లు చెబుతున్నారు.
అవును... ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ లో అరుదైన, ప్రాణాంతకమైన 'ఆస్ట్రేలియన్ బ్యాట్ లైసా వైరస్' (ఏ.బీ.ఎల్.వీ) సోకిన మరణించిన మొదటి కేసు నమోదైంది. దీని కారణంగా 50 ఏళ్ల వ్యక్తి మరణించాడని న్యూ సౌత్ వేల్స్ హెల్త్ జూలై 3 గురువారం ధృవీకరించింది. గబ్బిలం కాటు వేసిన కొన్ని నెలల తర్వాత అతడు మృతి చెందినట్లు వెల్లడించింది.
ఇదే సమయంలో... గబ్బిలం బారిన పడటానికి ముందు అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని.. ఈ కాటు తర్వాత కొన్ని వారాలుగా అతడి పరిస్థితి విషమంగా మారిందని ఆరోగ్య అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో... ఆస్ట్రేలియాలోని ఏ గబ్బిలమైనా లైసావైరస్ ను మోసుకెళ్లగలదు కాబట్టి, గబ్బిలాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
అయితే... ఆస్ట్రేలియన్ బ్యాట్ లైసా వైరస్.. రాబిస్ తో దగ్గరి సంబంధం / పోలికలు కలిగి ఉంటుందని.. ఇది కాటు వేసిన గబ్బిలం లాలాజలం ద్వారా మానవులకు వ్యాపిస్తుందని తెలిపారు. ఈ వైరస్ కు గురైన రోగులకు వెంటనే రాబిస్ ఇమ్యునోగ్లోబులిన్, రాబిస్ వ్యాక్సిన్ పూర్తి కోర్సు అవసరమని పేర్కొన్నారు.
కాగా... ఆస్ట్రేలియన్ బ్యాట్ లైసా వైరస్ (ఏ.బీ.ఎల్.వీ) అనేది ఆస్ట్రేలియన్ గబ్బిలాలలో కనిపించే అరుదైన, ప్రాణాంతకమైన వైరస్. ఇది మానవులలో రాబిస్ లాంటి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతానికి ఈ వైరస్ కు చికిత్స లేదు! ఈ సమయంలో.. గబ్బిలం కరిచిన లేదా గీకిన ఎవరైనా అత్యవసరంగా వైద్య సహాయం పొందాలని అధికారులు నొక్కి చెబుతున్నారు.