Begin typing your search above and press return to search.

ఐదేళ్లలో 44 వేల ప్రాణాలు.. ఈ వ్యాధి సృష్టిస్తున్న సంక్షోభం అంతా ఇంతా కాదు..

ఒకప్పుడు దేశాన్ని కుదిపేసిన హెచ్‌ఐవీ (ఎయిడ్స్) వ్యాధి కొంత కాలంగా వార్తల్లో ఎక్కువగా కనిపించకపోయినా.. అది అంతరించిపోయిందని అనుకోవడం పెద్ద తప్పు.

By:  Tupaki Desk   |   4 Feb 2026 11:06 AM IST
ఐదేళ్లలో 44 వేల ప్రాణాలు.. ఈ వ్యాధి సృష్టిస్తున్న సంక్షోభం అంతా ఇంతా కాదు..
X

ఒకప్పుడు దేశాన్ని కుదిపేసిన హెచ్‌ఐవీ (ఎయిడ్స్) వ్యాధి కొంత కాలంగా వార్తల్లో ఎక్కువగా కనిపించకపోయినా.. అది అంతరించిపోయిందని అనుకోవడం పెద్ద తప్పు. గణాంకాలు మాత్రం మరో కథ చెబుతున్నాయి. 2020 నుంచి 2024 మధ్య కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో 44,140 మంది హెచ్‌ఐవీ బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం సంఖ్య కాదు.. ప్రతి సంఖ్య వెనుక ఒక కుటుంబం, ఒక జీవితం, ఒక కథ ఉంది.

రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అనుప్రియ పటేల్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో 32,642 మంది, తెలంగాణలో 11,498 మంది హెచ్‌ఐవీ బాధితులు గత ఐదేళ్లలో మరణించారు. ఈ గణాంకాలు చూస్తే వ్యాధి తీవ్రత ఇంకా తగ్గలేదని స్పష్టంగా తెలుస్తోంది. వైద్యరంగంలో ఎంతో పురోగతి సాధించిన ఈ కాలంలో కూడా ఇంత పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరగడం బాధాకరం.

అందుబాటులో యాంటీ రెట్రోవైరల్ థెరపీ

హెచ్‌ఐవీని ఇప్పుడు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ART) అందుబాటులో ఉంది. సరైన సమయంలో పరీక్షలు చేయించుకొని, మందులు తీసుకుంటే బాధితులు దీర్ఘకాలం సాధారణ జీవితాన్ని గడపవచ్చు. అయితే సమస్య ఎక్కడుంది..? నిపుణులు చెబుతున్నట్టు ప్రజల్లో పెరుగుతున్న నిర్లక్ష్యం, అవగాహన లోపం, పరీక్షలు చేయించుకోవడంపై సంకోచం ప్రధాన కారణాలు. చాలా మంది ఇంకా హెచ్‌ఐవీని ఒక అపహాస్య వ్యాధిగా చూస్తున్నారు. దాచిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఫలితంగా చికిత్స ఆలస్యమవుతుంది. మరోవైపు అధికార యంత్రాంగం వైపు నుంచి కూడా కొంత అలసత్వం ఉన్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాల లభ్యత, మందుల నిరంతర సరఫరా, ఫాలోఅప్ సేవల్లో లోపాలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఆరోగ్య వ్యవస్థ బలంగా ఉన్నా, అది ప్రతి వ్యక్తి దాకా చేరకపోతే ప్రయోజనం ఉండదు.

యువతలో పెరుగుతున్న నిర్లక్ష్యం

ఇంకో కీలక అంశం యువతలో పెరుగుతున్న నిర్లక్ష్య వైఖరి. సురక్షిత లైంగిక సంబంధాలపై అవగాహన తగ్గడం, సోషల్ మీడియా ప్రభావంతో బాధ్యతలేని ప్రవర్తన పెరగడం, మైగ్రేషన్ పెరగడం అన్నీ ఈ వ్యాధి వ్యాప్తి చాపకింద నీరుగా చేరేందుకు దోహదపడుతున్న అంశాలుగా నిపుణులు గుర్తిస్తున్నారు. ఒకప్పుడు స్కూల్, కాలేజీల్లో హెచ్‌ఐవీ అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా జరిగేవి. ఇప్పుడు ఆ ఉత్సాహం తగ్గిపోయినట్లు కనిపిస్తోంది. అయితే పూర్తిగా నెగటివ్ చిత్రమే కాదు. రెండు రాష్ట్రాల్లోనూ ఉచిత పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ, గర్భిణులకు ప్రత్యేక పర్యవేక్షణ వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కానీ గణాంకాలు చూస్తే అవి సరిపోవట్లేదన్న సందేహం కలుగుతోంది. మరింత దృఢమైన కార్యాచరణ, మానిటరింగ్ అవసరం ఉంది.

దీనిని హెచ్చరికలా తీసుకొని ముందుకు..

ఈ పరిస్థితి ఒక హెచ్చరికలా తీసుకోవాలి. హెచ్‌ఐవీ ఇక ముప్పు కాదని భావించే దశను దాటిపోయాం. అవగాహన కార్యక్రమాలు మళ్లీ జోరందుకోవాలి. ప్రతి వ్యక్తి స్వయంగా పరీక్షలు చేయించుకోవడం, సురక్షిత పద్ధతులు పాటించడం, వ్యాధిపై ఉన్న అపోహలను తొలగించడం కీలకం. ప్రభుత్వ యంత్రాంగం కూడా గ్రామ స్థాయి వరకు చేరే విధంగా చర్యలు బలోపేతం చేయాలి. సంఖ్యలు చెబుతున్న సత్యం ఏంటంటే హెచ్‌ఐవీతో పోరాటం ఇంకా ముగియలేదు. నిర్లక్ష్యం ప్రాణాలు కబలిస్తోంది. అవగాహన, ముందస్తు జాగ్రత్తలే దీనికి అసలు మందు. ఇప్పటికైనా మేల్కొని చర్యలు తీసుకుంటేనే ఈ గణాంకాలు తగ్గే అవకాశం ఉంది.