Begin typing your search above and press return to search.

ఎయిమ్స్ రిపోర్టు: నలభైల్లో కుప్పకూలిపోవటం వెనుక కారణాలివే

వయసు ఫిఫ్టీ కంటే తక్కువే ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు పెద్దగా ఉండవు.

By:  Tupaki Desk   |   15 Dec 2025 9:56 AM IST
ఎయిమ్స్ రిపోర్టు: నలభైల్లో కుప్పకూలిపోవటం వెనుక కారణాలివే
X

వయసు ఫిఫ్టీ కంటే తక్కువే ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు పెద్దగా ఉండవు. కానీ.. ఉన్నట్లుండి కుప్పకూలిపోవటం.. ఆసుపత్రికి తరలించే లోపే మరణించే ఉదంతాలు ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు తలెత్తే వారిలో చాలా మంది మద్యం సేవించటం.. సిగిరెట్లు కాల్చటం.. ఊబకాయం.. తీవ్రమైన ఒత్తిడి.. ఆందోళన లేకున్నా హఠాన్మరణానికి గురవుతున్న వైనం వెనుకున్న అసలు కారణమేంటి? అన్నది కొంతకాలంగా ప్రశ్నగా మారింది.

ఇదే సమయంలో ఇలాంటి పరిస్థితులు కరోనా టీకా కారణంగా జరుగుతున్నాయన్న ప్రచారం సాగుతోంది. ఈ సందేహాలకు ఎయిమ్స్ వైద్యులు తాజాగా నిర్వహించిన ఒక రిపోర్టులో సమాధానం ఇచ్చారు. కొవిడ్ వ్యాక్సిన్ కారణంగా ఆకస్మిక మరణాలు చోటు చేసుకుంటున్నాయన్న అనుమానాలు ఉత్తవేనని.. వాటికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేస్తున్నారు.

‘‘బర్డెన్ ఆఫ్ సడెన్ డెత్ ఇన్ యంగ్ అడల్ట్స్.. ఏ వన్ ఇయరర్ అబ్జర్వేషనల్ స్టడీ ఎట్ ఏ టెర్షియరీ కేర్ సెంటర్ ఇన్ ఇండియా’’ పేరుతో నిర్వహించిన అధ్యయన ఫలితాలు ఇటీవల ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ లో పబ్లిష్ అయ్యాయి. ఈ అధ్యయనంలో భాగంగా ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడిసిన్.. పాథాలజీ నిపుణులు 2023 మే నుంచి 2024 ఏప్రిల్ మధ్య కాలంలో దాదాపు 2200 మృతదేహాల మీద పరీక్షలు జరిపారు. ఇందులో 180 ఆకస్మికంగా మరణించిన మృతదేహాలు అయితే.. అందులోనూ 18-45 మధ్య వయసు ఉన్న వారు 103 మంది. వీరిలో 42.6 శాతం మంది మరణాలకుకారణంగా గుండె సంబంధిత సమస్యలేనని తేలింది.

ఆ తర్వాతి స్థానంలోని (21.3 శాతం) మరణాలకు ఊపిరితిత్తుల సమస్యలుగా తేలింది. ఈ హఠాన్మరణాల సంఖ్య స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో ఐదు రెట్లు ఎక్కువగా ఉంటాయని తేలింది. అంతేకాదు.. ఇలాంటి మరణాల్లో వారం మధ్యలో కంటే వారాంతంలోనే ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తించారు. గుండె జబ్బుతో హఠాత్తుగా చనిపోతున్న చాలామందిలో ధమనుల్లో కొవ్వు పెరిగిపోవటాన్ని గుర్తించారు. మరింత షాకింగ్ నిజం ఏమంటే.. హఠాత్తుగా మరణించిన చాలామందికి తమకు గుండె జబ్బు లక్షణాలు లేవని.. అసలు వారికి ఆ సమస్య ఉన్నట్లుగా కూడా తెలీదని.. వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం ఆధారంగా తేల్చారు.

కరోనరీ ఆర్టరీ జబ్బులు నలభై ఏళ్ల లోపు వారిలో అరుదుగా వస్తాయని.. ఒకవేళ వసతే మాత్రం చాలా వేగంగా ప్రాణాంతకంగా మారుతుందని ఎయిమ్స వైద్యులు హెచ్చరిస్తున్నారు. నలభైల్లో ఉన్న వారు గుండెకు సంబంధించితన ముందస్తు పరీక్షలు చేసుకోవటం మంచిదన్న సూచన చేస్తున్నారు.