Begin typing your search above and press return to search.

ఆ కాంబో సెట్ అయితే ఇక దబిడి దిబిడే!

దీంతో ఇప్పుడు అగ్ర హీరోలేవరూ ఆయనకు డేట్స్ ఇచ్చే అవకాశం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ తదుపరి ప్రాజెక్ట్ ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొంది.

By:  Tupaki Desk   |   21 Feb 2024 4:09 AM GMT
ఆ కాంబో సెట్ అయితే ఇక దబిడి దిబిడే!
X

'గుంటూరు కారం' సినిమా తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. గురూజీ పెన్నులో ఇంక్ అయిపోయిందని, మహేశ్ బాబు లాంటి సూపర్ స్టార్ ను పెట్టుకొని అలాంటి చిత్రాన్ని రూపొందించారని విమర్శిస్తున్నారు. దీంతో ఇప్పుడు అగ్ర హీరోలేవరూ ఆయనకు డేట్స్ ఇచ్చే అవకాశం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ తదుపరి ప్రాజెక్ట్ ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇలాంటి టైంలో బాలయ్య - త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ఓ రూమర్ ప్రచారంలోకి వచ్చింది.

హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తో దూకుడుమీదున్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం బాబీ కొల్లు డైరెక్షన్ లో 'NBK 109' మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ హోమ్ బ్యానర్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. అయితే దీని తర్వాత ఇవే బ్యానర్స్ లో బాలయ్య మరో మూవీ చేస్తారని, దీన్ని త్రివిక్రమ్ తెరకెక్కిస్తారని గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.

ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబోలో ఓ ప్రాజెక్ట్ కు అనౌన్స్ మెంట్ వచ్చింది. కానీ 'గుంటూరు కారం' రిజల్ట్ చూసిన తర్వాత ఈ కాంబినేషన్ వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయంటూ టాక్ నడుస్తోంది. 'పుష్ప 2' తర్వాత భారీ స్కేల్ లో సినిమాలు చేయాలనే బన్నీ.. అట్లీ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు 'పుష్ప 3' కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు. ఇవన్నీ చూసుకుంటే అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తోనే ఉంటుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో బాలయ్య - త్రివిక్రమ్ కాంబినేషన్ తెర మీదకి వచ్చింది.

బాబీ సినిమా పూర్తయిన వెంటనే బాలకృష్ణ చేయబోయే మూవీ గురించి ఇప్పటికైతే అధికారిక ప్రకటన రాలేదు. కాకపోతే బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ 2' చేసే అవకాశం ఉందని అంటున్నారు. హను-మాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా బాలయ్య కోసం ఓ కథ రాస్తున్నారని చాలా రోజులుగా వినిపిస్తోంది. అలానే 'ఆదిత్య 369' కు సీక్వెల్ గా బాలకృష్ణ రాసుకున్న 'ఆదిత్య 999 మ్యాక్స్' సినిమాని రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తారని వార్తలు వస్తున్నాయి.

మరోవైపు అల్లు అర్జున్ మూవీ లేట్ అయితే, త్రివిక్రమ్ తమిళ హీరో సూర్యతో సినిమా చేస్తారని, కాదు వెంకటేష్ - నాని కాంబోలో సినిమా చేస్తారని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో బాలకృష్ణ కోసం కథ రెడీ చేస్తున్నారంటూ మరో పుకారు షికారు చేస్తోంది.

ఇందులో నిజమెంతో తెలియదు కానీ, ఒకవేళ ఈ కాంబో సెట్ అయితే మాత్రం క్రేజీగా ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఇది ఎవరూ ఊహించని కలయిక. వీరి సినిమాలని బట్టి ఇద్దరూ భిన్న ధృవాలని చెప్పాలి. అందుకే మాస్ హీరో బాలయ్య, క్లాస్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలిస్తే బాక్సాఫీసు వద్ద దబిడి దిబిడే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి త్వరలోనే ఈ రూమర్స్ నిజమవుతాయేమో చూడాలి.